చైనాలో సైనా జోరు | China Saina initiative | Sakshi
Sakshi News home page

చైనాలో సైనా జోరు

Published Thu, Nov 12 2015 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

చైనాలో సైనా జోరు

చైనాలో సైనా జోరు

క్వార్టర్స్‌కు చేరిన  స్టార్ క్రీడాకారిణి
సింధు, శ్రీకాంత్,  జ్వాల జోడికి చుక్కెదురు


ఫుజోహ్ (చైనా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో అదరగొడుతోంది. సహచరులందరూ వెనుదిరిగినా... అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సైనా 21-10, 19-21, 21-19తో ప్రపంచ 34వ ర్యాంకర్ టీ జింగ్ యీ (మలేసియా)పై నెగ్గి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. 55 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఈ హైదరాబాదీ పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లతో చెలరేగింది.

అయితే రెండో గేమ్‌లో జింగ్ పుంజుకోవడంతో సైనా 5-8, 8-11తో వెనుకబడింది. నెట్ వద్ద కీలకమైన డ్రాప్ షాట్లతో వరుస పాయింట్లు రాబట్టిన మలేసియా ప్లేయర్ చివరి వరకు అదే జోరుతో గేమ్‌ను చేజిక్కించుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభంలో జింగ్ 6-2 ఆధిక్యంలోకి వెళ్లినా... సైనా పోరాటపటిమతో 8-8తో సమం చేసింది. తర్వాత ఇరువురు ఒక్కో పాయింట్ గెలవడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది.  జింగ్ 15-13తో ఆధిక్యంలో ఉన్న దశలో హైదరాబాద్ అమ్మాయి భిన్నమైన షాట్లతో చెలరేగింది. సుదీర్ఘమైన స్మాష్‌లతో పాటు నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించి 17-17తో సమం చేసింది. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లతో పాటు మరోటి నెగ్గి గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్‌లో పి.వి.సింధు 21-18, 18-21, 16-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో కంగుతింది. గంటా 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో గేమ్‌లో సింధు తడబడింది. ప్రత్యర్థి అనుభవం, బలమైన సర్వీస్ ముందు తలవంచింది.

 పురుషుల సింగిల్స్ తొలిరౌండ్‌లో ఐదోసీడ్ శ్రీకాంత్ 12-21, 18-21 హు యున్ (హాంకాంగ్) చేతిలో; అజయ్ జయరామ్ 12-21, 11-21తో టాప్‌సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో; హెచ్.ఎస్.ప్రణయ్ 14-21, 21-17, 19-21తో క్వాలిఫయర్ గుయె కాయ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. డబుల్స్‌లో మను అత్రి-సుమిత్ రెడ్డి.. ప్రత్యర్థులకు వాకోవర్ ఇచ్చారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో జ్వాల-అశ్విని 16-21, 11-21తో నాకో ఫుక్‌మన్-కురుమి యోనావో (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యారు.  శుక్రవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో సైనా... నొజోమి ఓకురా (జపాన్)తో తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement