కుల్దీప్‌ కా కమాల్‌! | Chinaman Kuldeep Yadav rattles Australia in Dharamsala Test | Sakshi
Sakshi News home page

కుల్దీప్‌ కా కమాల్‌!

Published Sun, Mar 26 2017 1:43 AM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

కుల్దీప్‌ కా కమాల్‌!

కుల్దీప్‌ కా కమాల్‌!

సాక్షి క్రీడావిభాగం : ‘చైనామన్‌’ బౌలింగ్‌... భారత క్రికెట్‌కు పెద్దగా పరిచయం లేని శైలి. ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కూడా ఇలాంటి బౌలర్లు లేరు. అదే కుల్దీప్‌ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. మణికట్టుతో బౌలింగ్‌ చేసే రెగ్యులర్‌ లెగ్‌ స్పిన్నర్‌కు ప్రతిబింబంలాంటిదే చైనామన్‌ శైలి. అంటే ఎడమచేతి వాటం బౌలర్‌ వేసే లెగ్‌ స్పిన్‌నే చైనామన్‌గా వ్యవహరిస్తారు. 2014 అండర్‌–19 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ సహా 14 వికెట్లు తీసినప్పుడు కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్నాళ్లకు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు భారీ మొత్తానికి తీసుకున్నప్పుడే కుల్దీప్‌ పేరు ప్రముఖంగా వినిపించింది.

అయితే అంతకు ముందు ముంబై ఇండియన్స్‌తో ఉన్నప్పుడు ప్రాక్టీస్‌ సెషన్‌లో సచిన్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసినప్పుడు ప్రశంసలే దక్కాయి తప్ప మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు! 2014లో విండీస్‌తో వన్డే సిరీస్‌ కోసం జట్టులోకి ఎంపికైనా... ఇక్కడా మ్యాచ్‌ దక్కలేదు. ఇప్పుడు దాదాపు మూడేళ్ల తర్వాత అతను ఎప్పటికీ గుర్తుంచుకునే రీతిలో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు.
చిన్నప్పుడు టేబుల్‌ టెన్నిస్‌ను విరామం లేకుండా ఆడే కుల్దీప్‌ తండ్రి కోరిక తీర్చేందుకు క్రికెట్‌లోకి ప్రవేశించాడు.

 కాన్పూర్‌కు చెందిన ఇటుకల వ్యాపారి రామ్‌ సింగ్‌ తన తమ్ముడిని క్రికెటర్‌ను చేద్దామని ప్రయత్నించి విఫలం కావడంతో కొడుకును ఆటలోకి తీసుకొచ్చాడు. వసీం అక్రమ్‌లా ఫాస్ట్‌ బౌలర్‌ కావాలని అనుకున్నా, తగిన ఎత్తు లేడంటూ కోచ్‌ కపిల్‌ పాండే చేసిన సూచనతో ఇష్టం లేకున్నా స్పిన్‌ బౌలింగ్‌కు మారాడు. తనకు తెలీకుండానే కుల్దీప్‌ మణికట్టును భిన్నంగా వాడే శైలిని గుర్తించిన కోచ్‌ అదే తరహాలో ప్రోత్సహించాడు.

ఆ తర్వాత షేన్‌ వార్న్‌ను ఇష్టపడిన ఈ కుర్రాడు ఇప్పటికీ వార్న్‌ వీడియోలు చూసి చాలా నేర్చుకుంటాడు. ‘వార్న్‌ను కలిసినప్పుడు ఇచ్చిన కొన్ని సూచనలతోనే అదే ఆస్ట్రేలియాకు చెందిన వార్నర్‌ను తొలి వికెట్‌గా అవుట్‌ చేయడం చాలా గర్వంగా ఉంది’ అని అతను చెప్పుకున్నాడు. కోల్‌కతా జట్టులో తనలాంటి బౌలర్‌ బ్రాడ్‌ హాగ్‌ వచ్చాక అతని పర్యవేక్షణలో కుల్దీప్‌ బౌలింగ్‌ మరింత పదునెక్కింది. అయితే ఉత్తరప్రదేశ్‌ జట్టులో అప్పుడప్పుడు ఒక మ్యాచ్‌ ఆడటం తప్ప అతనికి రెగ్యులర్‌గా చోటు దక్కలేదు. గత ఏడాది ఐదు రంజీ మ్యాచ్‌లలో అతను 13 వికెట్లే తీయగలిగాడు.

 నిజానికి 33.11 ఫస్ట్‌క్లాస్‌ బౌలింగ్‌ సగటుతో భారత టెస్టు జట్టులోకి కుల్దీప్‌కు అవకాశం దక్కడం ఆశ్చర్యకరమే. అయితే సీజన్‌ ఆరంభంలో దులీప్‌ ట్రోఫీలో సెలక్టర్లు, కోచ్‌ కుంబ్లే సమక్షంలో మూడు మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు తీయడం అతనికి కలిసొచ్చింది. ‘నేనే గనక సెలక్టర్‌ను అయి ఉంటే ఒక్క ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడకపోయినా కుల్దీప్‌ను భారత జట్టులోకి ఎంపిక చేసేవాడిని. అతనిపై సెలక్టర్లు ఒక కన్నేసి ఉంచడం మంచిది’ అని కొన్నాళ్ల క్రితం కుల్దీప్‌ యాదవ్‌ గురించి దిగ్గజ క్రికెటర్‌ గావస్కర్‌ చేసిన ప్రశంసాపూర్వక వ్యాఖ్య ఇది.

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో, ఆ తర్వాత ఆసీస్‌తో గత మూడు టెస్టుల సమయంలో కూడా భారత జట్టుతోనే ఉన్న కుల్దీప్‌ కూడా తన ఎంపికను ఊహించి ఉండడు. కీలకమైన టెస్టులో భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఒక రకమైన జూదం ఆడింది. కోహ్లిలాంటి స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్థానంలో ఒక కొత్త బౌలర్‌కు స్థానం ఇవ్వడమంటే ఎంతో రిస్క్‌తో కూడిన ప్రయోగం.

 దాదాపు ఏడాది క్రితం శ్రీలంక చైనామన్‌ బౌలర్‌ లక్షణ్‌ సందకన్‌ను ఎదుర్కోవడంలో ఆసీస్‌ తీవ్రంగా ఇబ్బంది పడింది. అతనూ తన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో కంగారూలను దెబ్బ తీశాడు. దీనినే దృష్టిలో ఉంచుకొని కుంబ్లే బృందం ఆసీస్‌ ముందు అనూహ్యంగా తమ ట్రంప్‌కార్డ్‌ను బయటకు తీసింది. అశ్విన్, జడేజాలు ఉన్న చోట మూడో స్పిన్నర్‌ వస్తాడని, అతను ఇలాంటి బౌలర్‌ అవుతాడని ఆసీస్‌ ఊహించలేదు. కనీసం వీడియోలు చూసి సన్నద్ధమయ్యే అవకాశం కూడా ఆ జట్టుకు లేకపోయింది.

హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్‌ బౌల్డ్‌ అయిన బంతులు కుల్దీప్‌ బౌలింగ్‌ ప్రతిభను చూపించాయి. కుల్దీప్‌ తీసిన ప్రతీ వికెట్‌కు డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి కుంబ్లే సంబరపడిన తీరు చూస్తే ఆ వ్యూహం ఎంత బాగా పని చేసిందో అర్థమవుతోంది. భారత 288వ టెస్టు క్రికెటర్‌గా మాజీ లెగ్‌స్పిన్నర్‌ శివరామకృష్ణన్‌ నుంచి క్యాప్‌ అందుకున్న కుల్దీప్‌ తన సంచలనాలను కొనసాగించాలని ఆశిద్దాం.

ఆ పేరు ఎలా వచ్చిందంటే...
1933లో ఓల్డ్‌ట్రాఫోర్డ్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ జరిగింది. చైనా సంతతికి చెందిన విండీస్‌ బౌలర్‌ ఎలిస్‌ అచాంగ్‌ సాంప్రదాయ స్పిన్నర్‌ వేసే బంతికి భిన్నంగా వేసిన ఒక బంతికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ వాల్టర్‌ రాబిన్స్‌ అవుటయ్యాడు. తిరిగి వెళుతూ అతను ‘బ్లడీ చైనామన్‌’ అనడంతో ఆ బౌలింగ్‌ శైలి చైనామన్‌గా స్థిరపడిపోయింది. అన్నట్లు కుల్దీప్‌కంటే ముందు యూపీకే చెందిన మహిళా చైనామన్‌ బౌలర్‌ ప్రీతి దిమ్రి భారత్‌కు 2 టెస్టులు, 23 వన్డేల్లో (2006–10) ప్రాతినిధ్యం వహించడం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement