
దోహా (ఖతర్): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు కూడా భారత అథ్లెట్స్ పతకాల పంట పండించారు. బుధవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో ఆఖరి రోజు భారత అథ్లెట్స్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా భారత్‌కు ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు లభించాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల 1500 మీటర్ల విభాగంలో చిత్ర ఉన్నికృష్ణన్ స్వర్ణం సాధించింది. ఈ పోటీల్లో భారత్‌కు లభించిన మూడో పసిడి పతకమిది. 1500 మీటర్ల రేసును చిత్ర 4 నిమిషాల 14.56 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఫినిషింగ్ లైన్‌కు కొన్ని మీటర్ల దూరంలో చిత్ర బహ్రెయిన్ అథ్లెట్ గషా టైగెస్ట్‌ను దాటి ముందుకెళ్లింది. మహిళల 200 మీటర్ల విభాగంలో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ కాంస్య పతకాన్ని సాధించింది. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్న ద్యుతీ చంద్ 23.24 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది.
ఎడిడియోంగ్ ఒడియోంగ్ (బహ్రెయిన్) కూడా 23.24 సెకన్లలోనే గమ్యానికి చేరినా ఫొటోఫినిష్‌లో ద్యుతీ చంద్‌కు కాంస్యం ఖాయమైంది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో ప్రాచి, పూవమ్మ రాజు, సరితాబెన్ గైక్వాడ్, విస్మయలతో కూడిన భారత బృందం 3ని:32.21 సెకన్లలో రేసును ముగించి రజత పతకం గెల్చుకుంది. పురుషుల 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ 3ని:43.18 సెకన్లలో గమ్యానికి చేరి రజతం సాధించాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో కున్హు మొహమ్మద్, జీవన్, అనస్, అరోకియా రాజీవ్‌లతో కూడిన భారత బృందం 3ని:03.28 సెకన్లలో రేసును పూర్తి చేసి రజతం కైవసం చేసుకుంది. అయితే రేసు సందర్భంగా మూడో ల్యాప్‌లో చైనా అథ్లెట్‌ను భారత అథ్లెట్ అనస్ నిబంధనలకు విరుద్ధంగా ఢీకొట్టడంతో నిర్వాహకులు భారత జట్టుపై అనర్హత వేటు వేసి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో నవజీత్ కౌర్ (57.47 మీటర్లు) నాలుగో స్థానంలో... కమల్‌ప్రీత్ కౌర్ (55.59 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచారు. పురుషుల 5000 మీటర్ల రేసులో మురళి ఐదో స్థానంలో, అభిషేక్ ఆరో స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment