
ఇండోర్: ఈ ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఆటగాడు క్రిస్ గేల్.. ఆ జట్టు సాధించే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకూ పంజాబ్ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడిన గేల్ మూడు విజయాలను సాధించి పెట్టాడు. ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా తయారైన గేల్ తనదైన మార్కును చూపెడుతూ చెలరేగిపోతున్నాడు. శుక్రవారం కింగ్స్ పంజాబ్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇండోర్‌లో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో గేల్‌పై సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ జట్టులో గేల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. క్రిస్ గేల్‌తో కలిసి క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నానని తెలిపిన రాహుల్.. అతనొక కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని కొనియాడాడు.
‘ఈ ఐపీఎల్ సీజన్‌లో గేల్ నుంచి చాలా నేర్చుకుంటున్నా. అతను ఎప్పుడూ నవ్విస్తూ ఉండే క్రికెటర్. ఎప్పుడూ చిరునవ్వుతో సహచరుల్ని పలకరిస్తూనే ఉంటాడు. అత్యంత వినోదాన్ని అందించే క్రికెటర్లలో గేల్ ఒకడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్. ఈ సీజన్‌లో కింగ్స్ పంజాబ్‌కు ఆడుతున్న గేల్.. నా పని సులువు చేశాడు. ప్రత్యర్థి జట్లు గేల్‌పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. దాంతో అవతలి ఎండ్‌లో ఉండే నాకు ఒత్తిడి తగ్గింది. ఒక్క మాటలో చెప్పాలంటే గేల్ నా పని సులువు చేశాడు. అతనితో కలిసి క్రికెట్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా’ అని రాహుల్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment