పింక్ బంతిపై క్రికెటర్ల ఆందోళన | Concerns over pink ball lasting in Tests | Sakshi
Sakshi News home page

పింక్ బంతిపై క్రికెటర్ల ఆందోళన

Published Sat, Oct 24 2015 4:53 PM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

పింక్ బంతిపై క్రికెటర్ల ఆందోళన

పింక్ బంతిపై క్రికెటర్ల ఆందోళన

కాన్ బెర్రా: సంప్రదాయ టెస్టు క్రికెట్ లో తొలిసారి ఉపయోగించబోయే పింక్ బంతిపై క్రికెటర్లు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తొలిసారి అంతర్జాతీయంగా జరగబోతున్నడే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కు  న్యూజిలాండ్ -ఆస్ట్రేలియాల సిద్ధమవుతున్న తరుణంలో పింక్ బాల్ రగడ మరోసారి చోటు చేసుకుంది. ఇరుజట్ల మధ్య  అడిలైడ్ ఓవల్‌లో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1  వరకూ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరుగనుంది.  ఇప్పటికే కొన్ని దేశవాళీ టోర్నీలలో ప్రయోగాత్మకంగా డే అండ్ నైట్ టెస్టులు జరిగినా అంతర్జాతీయంగా తొలి మ్యాచ్ జరగడానికి రంగం సిద్ధమైంది. అంత వరకూ బాగానే ఉన్నా అందులో ఉపయోగించబోయే పింక్ రంగు బంతి ఇప్పుడు వివాదాలకు దారితీస్తోంది. 

 

ఇప్పటికే సన్నాహక మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్-ప్రైమ్ మినిస్టర్స్ ఎలివన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పింక్ బంతిని ఉపయోగించారు. కాగా, ఆ బంతి సరైన ఫలితానివ్వలేదని ఆస్ట్రేలియన్ ఆటగాడు ఆడమ్ వోజస్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్టు మ్యాచ్ లో రోజుకు  కనీసం 80 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. తాము 95.0 ఓవర్లు ఆడిన మ్యాచ్ లో పింక్ బంతి సత్ఫలితాన్ని ఇవ్వలేదన్నాడు. 30 ఓవర్లకే పింక్ బంతిపై ఉన్న కోటింగ్ పోయి సరిగా కనిపించట్లేనప్పుడు టెస్టు మ్యాచ్ లకు ఆ బంతి ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. తాము ఆడిన మ్యాచ్ లో పింక్ బంతి తొలుత బాగానే కనిపించినా.. రానురాను ఆ బంతి మెత్తబడిపోతుందన్నాడు. పింక్ బంతి ఆరంభ కార్యక్రమంలో భాగంగా ప్రైమ్ మినిస్టర్స్ బౌలర్ ఆస్టోన్ ఆగన్ వేసిన బంతిని న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్ మిడ్ వికెట్ మీదుగా షార్ట్ ఆడితే ఆ బంతి ఎటువైపు వెళ్లిందో కూడా తెలియదని వోజస్ ఆందోళన వ్యక్తం చేశాడు. డే అండ్ టెస్టు మ్యాచ్ కు మరో 34 రోజుల మాత్రమే ఉన్నందున దీనిపై మ్యాచ్ అధికారులు, ఆటగాళ్లు చర్చించాల్సిన అవసరం ఉందన్నాడు.


పింక్ రంగు బంతితో క్రికెటర్ల సమస్య ఏమిటి?


ఫీల్డింగ్ చేసే సమయంలో పింక్ బంతి సరిగ్గా కనిపించదనేది క్రికెటర్ల వాదన. దీనిపై ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లతో పాటు, న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీల్డర్‌కు కనిపించనప్పుడు చూసే అభిమానులు దాన్ని ఎలా గుర్తించగలుగుతారనేది మరో ప్రశ్న. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఫీల్డింగ్ సమయంలో పింక్ బంతులు సరిగ్గా కనిపించే అవకాశాలు తక్కువ. అలాగే బౌలింగ్ చేసే సమయంలో బంతి స్వింగ్ అయ్యే దానిపై కూడా అనేక అనుమానాలు. త్వరగా మెరుపు కోల్పోతుంది. దాంతో పేసర్లకు ఇబ్బందిగా మారుతుంది. రివర్స్ స్వింగ్ చేయడం కూడా కష్టం. కచ్చితంగా ఎర్ర బంతితో పోలిస్తే పింక్ బాల్ చాలా వైవిధ్యంగా ఉంటుందని క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.


నిజానికి టెస్టుల్లో ఎరుపు రంగు బంతుల్ని వాడతారు. రాత్రి సమయాల్లో జరిగే మ్యాచ్ ల్లో ఫడ్‌లైట్ల వెలుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే ఎరుపు కంటే ఇంకా స్పష్టంగా కనిపించేందుకు పింక్ రంగు బంతులని వాడాలని ఐసీసీ నిర్ణయించింది. పింక్ బంతులు ప్రముఖ సంస్థ కుకుబుర్రా తయారుచేస్తోంది. గత నాలుగు సంవత్సరాల నుంచి పింక్ బంతి తయారీకి సంబంధించి మెరుగులు దిద్దుతున్న కుకుబుర్రాకు క్రికెటర్ల ఆందోళనతో మరోసారి నిరాశ ఎదురయ్యిందనే చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement