
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఈవెంట్లు, జాతీయ స్థాయి టోర్నీలలో డోపింగ్ వివాదాలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంటాయి. పెద్ద స్థాయిలో ఇలాంటివి కొత్త కాదు. కానీ పాఠశాల స్థాయిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఖేలో ఇండియా’ పోటీల్లో కూడా డోపింగ్‌లో పట్టుబడటం అసాధారణం. తొలిసారి నిర్వహించిన ఈ క్రీడల అండర్–17 విభాగంలో మొత్తం 12 మంది డోపింగ్‌కు పాల్పడినట్లు తేలింది. వీరిలో ఐదుగురు స్వర్ణ పతకాలు నెగ్గిన వారుండటం గమనార్హం. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నివేదిక ప్రకారం నిషేధిత ఉత్ప్రేరకం వాడిన ఈ 12 మందిలో నలుగురు రెజ్లర్లు, ముగ్గురు బాక్సర్లు, ఇద్దరు జిమ్నాస్ట్‌లతో పాటు జూడో, వాలీబాల్, అథ్లెటిక్స్‌కు చెందిన ఒక్కో ఆటగాడు ఉన్నాడు.
వీరిలో ఒక అమ్మాయి కూడా ఉంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు ‘ఖేలో ఇండియా’ క్రీడలు దేశంలోని వివిధ నగరాల్లో జరిగాయి. ‘పట్టుబడిన ఆటగాళ్లలో ఎక్కువ మంది ఫ్యూరోసెమైడ్, టర్బు టలైన్ వాడినట్లు తేలింది. అయితే ‘వాడా’ నిబంధనల ప్రకారం ఈ ఉత్ప్రేరకాలు ప్రత్యేక కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఇంకా నిషేధం గురించి ఆలోచించలేదు’ అని అధికారులు వెల్లడించారు. అయితే పూర్తిగా నిషేధం ఉన్న స్టెనజలోల్‌ను వాడిన ఒక బాక్సర్‌పై మాత్రం తాత్కాలిక నిషేధం విధించారు. డోపింగ్‌లో దోషులుగా తేలితే వీరందరిపై కనీసం 2 నుంచి 4 సంవత్సరాల నిషేధం పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment