గతేడాది జర్మనీ క్లబ్ షాల్క్ నుంచి 37 మిలియన్ డాలర్లకు మాంచెస్టర్ సిటీ లియోరి సానేను కొనుగోలు చేసింది.
లియోరి సానే ఇంటర్వూ్య
గతేడాది జర్మనీ క్లబ్ షాల్క్ నుంచి 37 మిలియన్ డాలర్లకు మాంచెస్టర్ సిటీ లియోరి సానేను కొనుగోలు చేసింది. తన విలువకు తగ్గట్టుగా ఈ 21 ఏళ్ల మిడ్ ఫీల్డర్ వరుసగా అర్సెనల్, టాటెన్‌హమ్ జట్లపై గోల్స్ చేసి జట్టును పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేర్చాడు. ఇప్పుడు టాప్‌లో ఉన్న చెల్సీకన్నా 12 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో వెస్ట్ హామ్‌తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో యువ సంచలనం సానేపై జట్టు మరోసారి ఆశలు పెట్టుకుంది.
జర్మనీ క్లబ్ నుంచి వచ్చాక కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చినట్టనిపిస్తుంది. ఎట్టకేలకు సరైన ట్రాక్‌లో పడినట్టు
భావిస్తున్నారా?
అవును. గాయాల కారణంగా జట్టులోకి రావడం, పోవడం జరిగింది. కానీ ప్రస్తుతం అంతా సజావుగానే ఉంది. మాంచెస్టర్‌ను సొంత ఇంటిలా భావిస్తున్నాను. రాబోయే నెలల్లో కూడా అంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నాను. కొత్త క్లబ్ తరఫున ఆడుతూ గాయాల బారిన పడటం కొంచెం ఇబ్బందే. తొడ కండరాల సమస్య కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. తిరిగి ఫామ్ కోసం చాలా కష్టపడ్డాను.
లీగ్‌లో ఇప్పటిదాకా సిటీ ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. గత వారం టాటెన్‌హామ్‌తో అద్భుతంగా ఆడినా చివరికి 2–2తో డ్రా చేసుకోవడం ఎలా అనిపించింది?
అవును. ఆ ఫలితాన్ని జీర్ణించుకోవడం కష్టంగా అనిపించింది. నిజానికి ఆ మ్యాచ్ మేమే గెలవాలి. కానీ చివరకు అలా జరగకపోవడం నిరాశపరిచింది.
వెస్ట్ హామ్‌తో జరిగే మ్యాచ్‌పై ఆ ప్రభావం పడుతుందంటారా?
ఫలితంతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం. టాటెన్‌హామ్ మ్యాచ్‌లో మేం పూర్తి ఆధిపత్యం వహించాం. ప్రథమార్ధం చాలా బాగా ఆడాం. నా చివరి రెండు గేమ్స్‌లో గోల్స్ సాధించాను. నాతో పాటు మా జట్టు కూడా అదే ఊపును కొనసాగిస్తాం.
మాంచెస్టర్ సిటీకి ఆడుతుండడం సంతోషాన్నిస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఇంగ్లండ్ జీవితానికి
అలవాటుపడ్డారా?
అలాగే అనుకుంటున్నాను. మాంచెస్టర్‌లో నేను నా సొంత ఇంటికన్నా ఎక్కువ హాయిగా ఉన్నాననిపిస్తుంది. జట్టు ఆటగాళ్లు కూడా నాకు ఆ భావన కల్పిస్తున్నారు. ఇతర నైపుణ్యం కలిగిన ఆటగాళ్లతో కలిసి జట్టుకు మంచి విజయాలు అందించాలనే ఆలోచనలో ఉన్నాను. నాకు ఆ సామర్థ్యం ఉందని నమ్ముతున్నాను.
టైటిల్ రేసులో ఇప్పటిదాకా మీ జట్టు ప్రయాణం ఎలా ఉందని అనుకుంటున్నారు?
ప్రతీ జట్టు ఉత్తమ ఆటతీరుతో పాయింట్ల కోసం పోరాడుతోంది. అన్ని జట్లు మంచి పరిణతి సాధించాయి. సీజన్ ఆరంభంలో చాలా మంది మేం లీగ్‌ను గెలుచుకుంటామని చెప్పారు. ఇప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి. అయితే ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొంటామనే విశ్వాసం ఉంది.