టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి
పుణే: కౌంటీ క్రికెట్ ఆడాలన్న విరాట్ కోహ్లి నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా దిగ్గజం, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ సమర్థించారు. ఇంగ్లాండ్ టూర్ కంటే ముందుగా ఇంగ్లీష్ మైదానాలపై ఆడటం కోహ్లికి బాగా కలిసొచ్చే అంశమని ఆయన అంటున్నారు. ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘యూకే డొమెస్టిక్ ఫార్మట్‌లో ఆడటం గొప్ప అవకాశం. కౌంటీ ఆడాలనేది ప్రతీ క్రికెటర్ కల. ఒకవేళ ఇంగ్లాండ్ పర్యటన కంటే ముందుగానే కోహ్లి ఆ ఫార్మట్‌లో ఆడితే అది బాగా కలిసొచ్చే అంశం. ఆ అనుభవం టీమిండియాకు బాగా పనికి వస్తుంది’ అని కిర్‌స్టెన్ చెప్పారు. గత ఇంగ్లాండ్ టూర్(2014)లో కోహ్లి పేలవమైన ఫామ్‌తో విమర్శలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే.
వచ్చే నెలలో జరగబోయే కౌంటీ మ్యాచ్‌ల్లో భాగంగా సర్రే టీమ్ తరపున కోహ్లి బరిలోకి దిగనున్నాడు. జూన్ 9 నుంచి 12వ తేదీ వరకు మ్యాచ్‌లలో ఆడనున్నాడు. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు గుప్పించినా.. కోహ్లి మాత్రం ‘ఎప్పటి నుంచో ఆడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ కొరిక తీరబోతుంది’ అని తేలికగా కొట్టిపడేశాడు. కౌంటీ మ్యాచ్‌ల కారణంగా బెంగళూరులో అఫ్గానిస్తాన్(అరంగేట్రం)తో భారత్ ఆడబోయే ఏకైక టెస్టు మ్యాచ్‌కు కోహ్లి దూరం కానున్న విషయం తెలిసిందే. జూన్ చివరి వారం నుంచి మొదలయ్యే ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మే 8న జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment