ఇస్లామబాద్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చైనీయులపై మండిపడ్డారు. ఏది పడితే అది తిని ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, ఎలుకల్ని ఎలా తింటారని విస్మయం వ్యక్తం చేశారు. వాటి రక్తం, వ్యర్థాలను సైతం ఆహారంగా తీసుకునే చైనీయులపై కోపం వస్తోందని అన్నారు. కరోనా వ్యాప్తితో ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. పర్యాటకం దెబ్బతిందని, ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని తెలిపారు. కోవిడ్ ప్రభావం క్రీడలపైనా పడిందని తన యూట్యూబ్ చానెల్‌లో చెప్పుకొచ్చారు.
(చదవండి: కెనడా ప్రధాని.. వర్క్ ఫ్రమ్ హోమ్)
అంత క్రూరంగా ఎలా!
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఒక చట్టం తీసుకురావాలని షోయబ్ అన్నారు. చైనా పట్ల తనకేం వ్యతిరేకత లేదని, అయితే, జంతువుల పట్ల మరీ అంత క్రూరంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. ‘గబ్బిలాలు, కప్పలు,పాములు, కుక్కలు వంటికి తినడం తమ సంస్కృతిలో భాగం అని చైనీయులు అనొచ్చు. కానీ, ఆ సంస్కృతి మీకు లాభాన్ని కాకుండా తీవ్రమైన నష్టాన్నే మిగిల్చింది కదా’ అని పేర్కొన్నారు. ప్రాణాంతక వైరస్ భారత్‌కు చేరొద్దని కోరుకుంటున్నాని షోయబ్ తెలిపారు. భారత్‌లోని తన నా మిత్రులతో టచ్‌లో ఉన్నానని, వారంతా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఇక కోవిడ్ దెబ్బతో పాకిస్తాన్‌లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) సందిగ్దంలో పడిందని, పీఎస్‌ఎల్ షెడ్యూల్ కుదించారని షోయబ్ తెలిపారు. కాగా, కరోనా నేపథ్యంలో పీఎస్‌ఎల్ మిగతా మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహించనున్నారు. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు సైతం ప్రేక్షకులు లేకుండానే నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శుక్రవారం నాటి మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించారు. ఇక ప్లేఆఫ్ మ్యాచ్‌లను రద్దు చేసిన నిర్వాహకులు.. మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లను సెమీపైనల్‌కు చేరినట్టు ప్రకటించారు. మార్చి 17న సెమీఫైనల్, 18న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
(చదవండి: కరోనా ఎఫెక్ట్ : విద్యా సంస్థలు, మాల్స్ మూసివేత)
ఇదిలాఉండగా.. భారత్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్ రద్దు కాగా, ఆస్ట్రేలియాలో జరగుతున్న కివీస్, ఆసీస్ వన్డే సిరీస్ కూడా రద్దయింది. ఇక మార్చి 29న మొదలు కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఏప్రిల్ 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా, చైనాలోని వుహాన్ నగరలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ 125కు పైగా దేశాలకు పాకింది. 1,45, 810 మంది ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతుండగా.. 5 వేలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment