
మెకల్లమ్‌కు మరో గౌరవం
కివీస్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక
ఆక్లాండ్: ప్రపంచకప్‌లో తొలిసారి తమ జట్టును ఫైనల్‌కు చేర్చిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్‌కు తమ దేశంనుంచి మరో గౌరవం దక్కింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కెప్టెన్సీలోనూ సమర్థంగా రాణించిన మెకల్లమ్ కివీస్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ రిచర్డ్ హ్యడ్లీ మెడల్)కు ఎంపికయ్యాడు.
బుధవారం ఇక్కడ జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మెకల్లమ్ అవార్డు అందుకున్నాడు. ఏడాది కాలంగా బ్యాట్స్‌మన్‌గా కూడా అద్భుతంగా రాణించిన మెకల్లమ్ నేతృత్వంలో కివీస్ ఒకే ఏడాది ఐదు టెస్టు విజయాలు సాధించడం విశేషం. ఈ అవార్డు కోసం మెకల్లమ్‌తో పోటీ పడిన కేన్ విలియమ్సన్ మూడు అవార్డులు గెలుచుకున్నాడు. టెస్టు, వన్డే, టి20లు మూడింటిలోనూ అతను ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్‌కు ఉత్తమ బౌలర్ అవార్డు దక్కింది.