
‘నో’బాల్ నేపాల్!
అసోసియేట్ జట్టే అయినా ప్రపంచ కప్‌లో తమ స్ఫూర్తిదాయక ఆటతీరుతో నేపాల్ అందరి మనసులూ గెలుచుకుంది. హాంకాంగ్, యూఏఈ లాంటి జట్ల తరహాలో కాకుండా ఈ జట్టులో మాత్రమే అసలైన, అక్కడే పుట్టి పెరిగిన నేపాలీలు ఉన్నారు. టోర్నీలో రెండు మ్యాచ్‌లు నెగ్గినా, రన్‌రేట్‌లో వెనుకబడి సూపర్-10 అవకాశం కోల్పోయిన ఆ జట్టు ఒక అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది.
ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి ఆ జట్టు ఒక్క నోబాల్, ఒక్క వైడ్ బాల్ కూడా వేయకపోవడం విశేషం! ఏ టి20 ప్రపంచ కప్‌లోనూ ఈ ఘనత ఏ జట్టుకూ సాధ్యం కాలేదు. హాంకాంగ్‌తో 1 పరుగు (లెగ్‌బై), బంగ్లాదేశ్‌తో 2 (లెగ్‌బై), అఫ్ఘానిస్థాన్‌తో 5 (బై 4, లెగ్‌బై 1)...ఇలా మాత్రమే ఆ జట్టు ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చిందంటే బౌలర్లు ఎంత క్రమశిక్షణతో బౌలింగ్ చేశారో అర్ధం చేసుకోవచ్చు.
అగ్రశ్రేణి జట్లు, స్టార్ బౌలర్లు కూడా ఏదో దశలో గతి తప్పడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. కానీ జట్టు మొత్తం అదే తరహాలో బౌలింగ్ చేయడం అరుదైన విషయమే. తమ ఆటతో భవిష్యత్తుపై ఆశలు రేపిన నేపాల్‌కు హ్యట్సాఫ్ చెప్పక తప్పదు.