క్రికెట్‌లో 'అరుంధతీ' నక్షత్రం | Cricketer Arundhati Reddy Elected Women T20 World Cup | Sakshi
Sakshi News home page

శెభాష్‌.. అరుంధతి

Published Tue, Jan 14 2020 10:21 AM | Last Updated on Tue, Jan 14 2020 10:21 AM

Cricketer Arundhati Reddy Elected Women T20 World Cup - Sakshi

మైదానంలోక్రికెట్‌ ఆడుతున్న అరుంధతీరెడ్డి

సిటీ అమ్మాయి క్రికెట్‌లో అద్భుతమైన ఘనత సాధించింది. గల్లీ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. విమెన్‌ టీ20 ప్రపంచకప్‌కు ఎంపికై శెభాష్‌ అన్పించుకుంది నేరేడ్‌మెట్‌ డిఫెన్స్‌ కాలనీకి చెందిన క్రికెటర్‌ అరుంధతీరెడ్డి. వచ్చే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న విమెన్స్‌ మెగా ఈవెంట్‌ టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌ జట్టుకు ఆమె ఎంపికైంది. ఈ సందర్భంగా తాను క్రికెటర్‌గా ఎదిగిన తీరు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తదితర అంశాలను ‘సాక్షి’కి వివరించారు.

పదేళ్ల వయసులోనే సోదరుడు రోహిత్‌రెడ్డితో కలిసి గల్లీలో క్రికెట్‌ ఆడింది. ఆమె ఆట తీరు ఎంతో క్రీడాభిమానుల చేత ఔరా అనిపించింది. ప్రత్యేకంగా శిక్షణ ఇస్తే గొప్ప క్రికెటర్‌ అవుతుందని కుటుంబ సభ్యులు ఆమెను ప్రోత్సహించారు. వాలీబాల్‌ క్రీడాకారిణి అయిన ఆ యువతి తల్లి.. ఎన్ని ఇబ్బందులెదురైనా సరే కూతురును క్రికెటర్‌గా చూడాలనిగట్టిగా సంకల్పించింది. టీచర్‌గా పని చేస్తూ కూతురుకువెన్నుదన్నుగా నిలిచింది. క్రికెట్‌కు సంబంధించి అన్నీ సమకూర్చింది. ఆర్మీలో చేరాలనుకున్న ఆ యువతి క్రికెట్‌ ప్రస్థానం అలా మొదలైంది.  నిరంతర సాధనతో అంచలంచెలుగాఎదిగింది. పదేళ్ల వయసులో బాల్, బ్యాట్‌ పట్టిన ఆ బాలిక సరిగా మరో పదేళ్లకే భారత జట్టుకు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షిచింది. తల్లి నమ్మకాన్ని నిలబెట్టింది. పొట్టి క్రికెట్‌లో ఫాస్ట్‌బౌలర్, ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది నేరేడ్‌మెట్‌ డిఫెన్స్‌ కాలనీకి చెందిన క్రికెటర్‌ అరుంధతీరెడ్డి. వచ్చే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న విమెన్స్‌ మెగా ఈవెంట్‌ టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌ జట్టుకు ఆమె ఎంపికైంది. ఈ సందర్భంగా తాను క్రికెటర్‌గా ఎదిగిన తీరు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తదితర అంశాలను అరుంధతీరెడ్డి ఇలా చెప్పుకొచ్చింది. 

 నేరేడ్‌మెట్‌: పాఠశాలలో చదువుకుంటున్నప్పటినుంచే ఆర్మీలో చేరాలనే కోరిక ఉండేది. అల్వాల్‌లో ఇంటి వద్ద అన్న రోహిత్‌రెడ్డి, స్నేహితులతో కలిసి గల్లీలో క్రికెట్‌ ఆడేందుకు వెళుతుంటే.. నేనూ వెంట వెళ్లేదాన్ని. అలా వారితో నేను పదేళ్ల వయసులో క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టాను. అక్కడ అన్న స్నేహితులు నా ఆటను చూసి బాగా ఆడుతున్నావని అభినందించారు. ప్రత్యేక శిక్షణ తీసుకుంటే తప్పక క్రికెట్‌లో రాణిస్తుందని మా అన్నకు వారు సలహా ఇచ్చారు. ఈ విషయంలో ప్రైవేట్‌ టీచర్‌గా పని చేస్తున్న అమ్మ భాగ్యరెడ్డి నన్నెంతగానో ఎంకరేజ్‌ చేసింది.  

5 గంటలకు నిద్రలేచి..బస్సులో వెళ్లేదాన్ని..
క్రికెట్‌పై ఆసక్తి పెరగటంతో పాటు శిక్షణ తీసుకుంటుండటంతో తెల్లవారుజాము 5గంటలకే నిద్రలేచి.. అల్వాల్‌ నుంచి బస్సులో సుమారు 9కి.మీ. దూరంలోని క్రికెట్‌ అకాడమీకి వెళ్లేదాన్ని. అక్కడ ఉదయం 8గంటలకు ప్రాక్టీస్‌ ముగించుకొని.. స్కూల్‌ (పికెట్‌లోని కేంద్రీయ విద్యాలయం)కు, తిరిగి సాయంత్రం 4.30 గంటలకు స్కూల్‌ నుంచి అకాడమీకి వెళ్లి 6.30 వరకు సాధన చేసేదాన్ని. ప్రాక్టీస్‌ కోసం ఒక్కదాన్నే బస్సుల్లో వెళ్లి వచ్చేదాన్ని. ఇలా శిక్షణ ప్రారంభించిన ఏడాదికి 2009 సంవత్సరంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అండర్‌– 19, సీనియర్‌ మహిళల క్రికెట్‌ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాను. 

2008 క్రికెట్‌అకాడమీలో చేరాను..
నన్ను క్రికెటర్‌గా చేయాలని అమ్మ 2008 సంవత్సరంలో ప్యాట్నీలోని స్పోర్టివ్‌ క్రికెట్‌ అకాడమీలో చేర్పించింది. అకాడమీలో చేరి క్రికెట్‌లో గణేష్‌ కోచ్‌ వద్ద శిక్షణ తీసుకున్నాను. టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌లు బాగా చూస్తూ, కోచ్‌ సలహాలను పాటిస్తూ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ వచ్చాను.

పిల్లలనుఒత్తిడికి గురిచేయొద్దు.. 
క్రికెట్‌లో రాణించాలనే లక్ష్యంతో శిక్షణ తీసుకుంటున్న పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టొద్దు. వారికి కావాల్సిన స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే వారిలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సహజంగా ఆడటానికి ఆస్కారం కలుగుతుంది. అకాడమీలో కోచ్‌లకు అప్పగించి.. తల్లిదండ్రులు కేవలం పిల్లలకు మెంటార్‌గా వ్యవహరిస్తూ సలహాలు, సూచనలు చేయాలి తప్ప.. ఒక మ్యాచ్‌లో బాగా ఆడలేదని పిల్లలను ఇబ్బంది పెడితే వారికి క్రికెట్‌పై ఆసక్తి సన్నగిల్లుతుంది. ‘నేను పదేళ్లకు క్రికెట్‌ ఆడటం మొదలు పెడితే.. ఇండియా జట్టుకు ఎంపిక కావడానికి మరో పదేళ్లు పట్టింది. అవకాశాల కోసం ఓపికతో ఉండాలి. ప్రతిభ ఉన్నప్పుడు తప్పక అవకాశం వస్తుంది.

2018లో భారత జట్టుకు ఎంపిక..
హెచ్‌సీఏ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ టోర్నీలలో ప్రతిభను కనబర్చడంతో 2018 సంవత్సరంలో టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. టీ20 కోసం ఎంపిక చేసిన విమెన్స్‌ క్రికెట్‌ జాతీయ జట్టులో చోటు దక్కింది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్డిండీస్‌ జట్లతో జరిగిన టీ20 మ్యాచ్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించి నిలకడగా రాణించాను.  

వరల్డ్‌కప్‌ అందించాలన్నదే లక్ష్యం..
జాతీయ జట్టుకు ఎంపిక కావాలని.. అందులోనూ ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీలో ఒక్కసారైనా ఆడాలని ప్రతి క్రికెటర్‌ కోరుకుంటాడు. వచ్చే నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మెగా ఈవెంట్‌లో జట్టు సభ్యులమంతా సమష్టిగా రాణించి ఇండియాకు వరల్డ్‌కప్‌ అందించాలన్నదే లక్ష్యం. వరల్డ్‌ కప్‌ కన్నా ముందు ఆస్ట్రేలియాలో మొదలవనున్న ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్‌ ముక్కోణపు సీరియస్‌కు సన్నద్ధమవుతున్నాను. ముక్కోణపు సిరీస్‌తో పాటు వరల్డ్‌ కప్‌ కోసం ప్రత్యేక సాధనపై దృష్టి సారించాను. 

వారే స్ఫూర్తి..
సీనియర్‌ విమెన్‌ క్రికెటర్లు మిథాలీరాజ్, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), జులన్‌ గోపాలస్వామితో పాటు భారత జట్టు మాజీ సారథి రాహుల్‌ ద్రావిడ్‌ ఆట అంటే ఎంతో ఇష్టం.

వికెట్‌ కీపర్‌ అవుతుందనుకున్నా 
క్రికెట్‌ అకాడమీలో అరుంధతిని చేర్పించినప్పుడు వికెట్‌ కీపర్‌ అవుతుందనుకున్నా. ఈ విషయమై అప్పట్లో కోచ్‌కు చెప్పాను. ఆయన నా అభిప్రాయంతో ఏకీభవించలేదు. ఆమె ఆట చూసి.. చెబుతానని కోచ్‌ చెప్పారు. అకాడమీలో చేరిన తొలిరోజే బౌలింగ్‌ వేయమని అరుంధతికి బాల్‌ ఇచ్చారు. తొలిబంతి లైన్‌ అండ్‌ లెంథ్‌లో వేయడంతో వికెట్‌ కీపర్‌గా వద్దు.. అరుంధతి మంచి ఫాస్ట్‌బౌలర్‌ అవుతుందని కోచ్‌ చెప్పారు. అలాగే ఫాస్ట్‌బౌలర్‌గా నిలకడగా రాణిస్తోంది.      – భాగ్యారెడ్డి, అరుంధతీరెడ్డి తల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement