క్రికెటర్‌ గౌతమ్‌ అరెస్ట్‌ | Cricketer CM Gautam Arrested In KPL Fixing Case | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ గౌతమ్‌ అరెస్ట్‌

Published Thu, Nov 7 2019 11:57 AM | Last Updated on Thu, Nov 7 2019 3:45 PM

Cricketer CM Gautam Arrested In KPL Fixing Case - Sakshi

బెంగళూరు: స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశవాళీ క్రికెటర్‌ చిదంబరం మురళీధరన్‌ గౌతమ్‌ను సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై గౌతమ్‌ను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు సహచర క్రికెటర్‌ అబ్రార్‌ కాజీను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌లో బల్లారి టస్కర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరిపై ఫిక్సింగ్‌ ఆరోపణలు చుట్టుముట్టాయి. దాంతో గౌతమ్‌, కాజీలను క్రైమ్‌  బ్రాంచ్‌ విభాగం అదుపులోకి తీసుకుంది. బల్లారీ టస్కర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్‌.. ఫిక్సింగ్‌ చేయడానికి నగదు తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాటింగ్‌ స్లోగా చేయడానికి ఈ జోడికి రూ. 20 లక్షలు బుకీలు అందజేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా హబ్లీతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో వీరిద్దరూ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.(ఇక్కడ చదవండి: టీఎన్‌పీఎల్‌లో ఫిక్సింగ్‌!)

దేశవాళీ టోర్నీల్లో భాగంగా గతంలో కర్ణాటక తరఫున ఆడిన గౌతమ్‌.. గోవాకు మారిపోయాడు. ఇక కాజీ మిజోరాం తరఫున ఆడుతున్నాడు.  కాగా, శుక్రవారం నుంచి ఆరంభం కానున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో వీరిద్దరూ తమ తమ రాష్ట్రాల జట్టులో చోటు దక్కించుకున్న సమయంలో అరెస్ట్‌ కావడం క్రికెట్‌ వర్గాల్లో చర్చకు దారి తీసింది. భారత-ఏ మాజీ ఆటగాడైన గౌతమ్‌.. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌,  ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడాడు. 94 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన గౌతమ్‌ 4,716 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 24 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.  2013-14, 2014-15 సీజన్‌లో కర్ణాటక గెలిచిన మ్యాచ్‌ల్లో  కీలక పాత్ర పోషించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement