Karnataka Premier League
-
"మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదు.." హైకోర్టు సంచలన తీర్పు
Match Fixing Not Punishable Says Karnataka High Court: క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదని, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం శిక్షార్హం కూడా కాదని ఆదేశించింది. 2019 కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) ఫిక్సింగ్ కేసుకు సంబంధించి ఈ తీర్పును వెల్లడించింది. జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. కేసును కొట్టి వేస్తూ, దోషులను శిక్షించడం బీసీసీఐ అధికార పరిధిలోకి వస్తుందని పేర్కొంది. నిందితులపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదని, ఐపీసీ ప్రకారం వీరికి చీటింగ్ కేసు వర్తించదని వివరించింది. ఓ ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడితే.. క్రీడను అమితంగా అభిమానించే ప్రేక్షకులను మోసం చేశాడన్న భావన కలగడం సహజమని, అయితే దీన్ని పరిగణలోకి తీసుకుని నిందితులను శిక్షించే హక్కు కోర్టుకు లేదని, ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకునే అధికారం సంబంధిత క్రికెట్ బోర్డులకే ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, 2019 కేపీఎల్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి భారీ ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పలువురు ఆటగాళ్లు, జట్ల యజమానులు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి సహా ఓ బుకీపై బెంగళూరు పోలీసులు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. వీరిలో సిఎం గౌతమ్ (ప్లేయర్, ఏ1), అబ్రార్ ఖాజీ (ప్లేయర్, ఏ2), అలీ అష్పక్ (బెల్గావి పాంథర్స్ యజమాని, ఏ3), అమిత్ మావి (బుకీ, ఏ4) ప్రధాన నిందితులుగా ఉన్నారు. చదవండి: కోహ్లికి షోకాజ్ నోటీసులు.. స్పందించిన గంగూలీ -
నటులకు మ్యాచ్ ఫిక్సింగ్ మరక
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రోజుకొక కొత్త విషయం బయటకు వస్తోంది. ఇన్ని రోజులు ఆటగాళ్లు, కోచ్‌లు, బుకీల బాగోతంతోపాటు హనీట్రాప్ మరక కూడా నమోదైంది. తాజాగా ఈ స్కామ్‌లో శాండల్వుట్ నటీనటులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నగర పోలీసు కమిషనర్ భాస్కర్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు నటీనటులకు సంబంధం ఉందని అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. మ్యాచ్‌లు ముగిసిన తర్వాత జరిగే పార్టీల్లో నటీనటులు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ విందుల్లో నటీనటులు, ఆటగాళ్లతో కలిసిమెలిసి కనిపించేవారన్నారు. తద్వారా కొద్ది రోజుల్లోనే నటులు భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసిందని తెలిపారు. హఠాత్తుగా వీరికి అంత డబ్బు ఎలా వచ్చిందనే విషయాన్ని మున్ముందు విచారణలో తెలుసుకుంటామన్నారు. కేవలం రెండు, మూడు సినిమాలు చేసిన తర్వాత ధనవంతులయిపోవడం సాధ్యమయ్యే పనేనా అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. బెళగావి ప్యాంథర్స్ కోచ్ సు«దీర్ శింధేను మంగళవారం అరెస్టు చేసినట్లు, అతని నుంచి విచారణలో పలు విషయాలను రాబట్టినట్లు చెప్పారు. ఆ క్లబ్ నుంచే ఫిక్సింగ్ సుధీర్ శింధేకు చెందిన జయనగరలోని సోషల్ క్రికెట్ క్లబ్లో చాలా మంది ఆటగాళ్లు క్రికెట్ ఆడేవారని, ఆ ఆటగాళ్లే దాదాపుగా చాలామంది బెళగావి ప్యాంథర్స్ జట్టులో ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా ఈ క్లబ్లో శిక్షణ పొందిన క్రికెటర్లు కేపీఎల్లోని చాలా జట్లలో చేరారని తెలిపారు. ఆయా జట్లలో చేరిన ఈ ఆటగాళ్లతో∙మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడే వారని చెప్పారు. ఆ క్రికెట్ క్లబ్‌కు బెళగావి జట్టు యజమాని అస్ఫాక్ థార్ అలి తరచూ వచ్చి ఆటగాళ్లతో పరిచయాలు పెంచుకునే వాడని తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న సినీ నటులు అప్రూవర్‌గా మారితే వారికి పోలీసుల నుంచి సహాయంతోపాటు రక్షణ కల్పిస్తామని కమిషనర్ తెలిపారు. కేపీఎల్ రద్దు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కేపీఎల్కు మాయని మచ్చ పడింది. ఇప్పటికే ఈ కేసులో ఆటగాళ్లు, జట్ల యజమానులు, కోచ్‌లతో కలుపుకుని సుమారు 9 మంది వరకు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఫిక్సింగ్ కేసు తేలే వరకు కేపీఎల్ నిర్వహించరాదని కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) నిర్ణయించింది. వచ్చే ఏడాది జరగనున్న కేపీఎల్ టోర్నీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. క్యాబ్‌లకు సీసీ కెమెరా, జీపీఎస్ ఓలా, ఉబర్ తదితర ట్యాక్సీలు, క్యాబ్‌లల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చుకోవాలని కమిషనర్ సూచించారు. హైదరాబాద్ వద్ద పశువైద్యురాలిపై దారుణ హత్యాచారం నేపథ్యంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ట్యాక్సీల్లో సీసీటీవీ కెమెరా, జీపీఎస్, ఎమెర్జెన్సీ బటన్ అమర్చుకోవడం తప్పనిసరి అని చెప్పారు. హైదరాబాద్ ఘటన తర్వాత బెంగళూరు నగర పోలీసులు సిద్ధం చేసిన బీసీపీ సురక్షా యాప్ డౌన్లోడ్లు పెరిగాయని తెలిపారు. -
కేపీఎల్ ఫిక్సింగ్: అంతర్జాతీయ బుకీ అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో పలు మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు యత్నించిన ఒక అంతర్జాతీయ బుకీని అరెస్టు చేశారు. మ్యాచ్‌లను ఫిక్సింగ్‌కు చేయడానికి పాల్పడ్డ హర్యానాకు చెందిన సయ్యమ్ అనే వ్యక్తిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెలబ్రేటీ డ్రమ్మర్ భవేశ్ బఫ్నా సాయంతో మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి సయ్యర్ యత్నించాడు. అయితే అతనిపై ముందుగా లుక్ ఔట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు.(ఇక్కడ చదవండి: క్రికెటర్ గౌతమ్ అరెస్ట్) ఈ క్రమంలోనే వెస్టిండీస్‌లో దాక్కొన్న అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవల బళ్లారి టస్కర్స్ కెప్టెన్ సీఎం గౌతమ్‌తో పాటు అబ్రార్ కాజీలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడానికి రూ. 20 లక్షలకు ఒప్పందం చేసుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా బుకీని కూడా అదుపులోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. -
షెకావత్ బుకీలను పరిచయం చేసేవాడు
కర్ణాటక, బనశంకరి: కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ పోటీల్లో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కేసును విచారణ తీవ్రతరం చేసిన బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం బళ్లారి టస్కర్స్ జట్టు కెప్టెన్‌తో మరో క్రికెటర్‌ను అరెస్ట్ చేశారు. బళ్లారి జట్టు కెప్టెన్ సీఎం గౌతం, క్రికెటర్ అబ్రార్ ఖాజీని అరెస్ట్ చేసి విచారణ తీవ్రతరం చేశామని జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. రూ.20 లక్షలకు స్పాట్ ఫిక్సింగ్ సందీప్ తెలిపిన మేరకు... పోలీసులకు పట్టుబడిన ఇద్దరు క్రికెటర్లు 2019 కేపీఎల్ టోర్నీ హుబ్లీ, బళ్లారి జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. మ్యాచ్‌లో నిదానంగా బ్యాటింగ్ చేయడానికి వీరు బుకీలనుంచి రూ.20 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. బెంగళూరు జట్టుపై ఆడిన మరో మ్యాచ్‌లోనూ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఇద్దరు క్రికెటర్లు పలు జాతీయస్థాయి టోర్నీల్లో ఆడినవారే కావడం గమనార్హం. మ్యాచ్ ఫిక్సింగ్‌తో సంబంధమున్న మరికొందరిని కనిపెట్టి పూర్తి ఆధారాలతో త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. షెకావత్ అరెస్టుతో కదిలిన డొంక రెండురోజుల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగస్వామిగా ఉన్న బెంగళూరు బ్లాస్టర్ జట్టులో బ్యాట్స్‌మెన్ నిశాంత్ సింగ్ షెఖావత్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టగా అతడు ప్రముఖ బుకీలతో సంప్రదింపులు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన షెఖావత్ కేపీఎల్ మొదటి సీజన్ నుంచి హుబ్లీ, మంగళూరు, శివమొగ్గ జట్లతరఫున ఆడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరు బ్లాస్టర్స్ జట్టులో తరపున ఆడుతూ పరారీలో ఉన్న ప్రముఖ బుకీలైన సయ్యాం, జతిన్, చండీఘడ్ బుకీ మనోజ్ కుమార్‌తో షెఖావత్ నిత్యం సంప్రదించేవాడు. ఇప్పటికే పోలీసులకు పట్టుబడిన బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు బౌలింగ్‌కోచ్ విను ప్రసాద్, బ్యాట్స్‌మెన్ విశ్వనాథన్‌లకు బుకీలను పరిచయం చేసింది షెకావతే. మైసూరులో 2018 ఆగస్టు 31 హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య మైసూరు శ్రీకంఠ దత్త నరసింహరాజు ఒడయార్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు కొద్దిరోజులకు ముందు మైసూరులో ఓ హోటల్ బుకీ మనోజ్ ను నిశాంత్‌సింగ్ షెకావత్ సంప్రదించాడు. అనంతరం వినుప్రసాద్, విశ్వనాథన్‌ను పిలిపిం చి మాట్లాడారు. అప్పుడు డబ్బు చేతులు మారి ఉండవచ్చని అనుమానం ఉంది. షెకావత్‌కు అన్ని జట్లలో కోచ్‌లు, ఆటగాళ్లతో పరిచయం ఉంది. ఇతడు బుకీలను ఆటగాళ్లకు పరిచయం చేసి దందాను విస్తరించేవాడు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సందీప్‌పాటిల్ తెలిపారు. ఢిల్లీ బుకీలైన జతిన్, సయ్యాం అరెస్ట్ కోసం లుక్‌అవుట్‌నోటీస్ విడుదల చేశామన్నారు. వారిద్దరూ విదేశాల్లో తలదాచుకున్నట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో బెళగావి ప్యాంథర్స్ జట్టు యజమాని అష్పాక్ అలీతార్‌ను అరెస్ట్ చేయగా అతనిచ్చిన సమాచారం ఆధారంగా కేసు విచారణ తీవ్రతరం చేశామన్నారు. బళ్లారి టస్కర్స్ జట్టులో డ్రమ్మర్ భవేశ్‌ను కూడా ఫిక్సింగ్ కేసులో అరెస్టు చేశారు. ♦ ఏమిటీ: కొన్నేళ్ల క్రితం ఐపీఎల్ తరహాలో అట్టహాసంగా ఆరంభమైన కర్ణాటక ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఫిక్సింగ్, బెట్టింగ్ దందా ♦ ఎలా, ఎవరు: ఓ జట్టు యజమాని, కొందరు ఆటగాళ్లు, పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు కుమ్మక్కై మ్యాచ్ ఫలితాలను ముందే నిర్దేశించడం. ♦ ఇప్పటివరకు అరెస్టయింది: బెళగావి ప్యాంథర్స్ జట్టు యజమాని అష్పాక్ అలీతార్, బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు బౌలింగ్‌కోచ్ విను ప్రసాద్, బ్యాట్స్‌మెన్ విశ్వనాథన్, మరోఆటగాడు షెకావత్, డ్రమ్మర్ భవేశ్. పరారీలో ఉన్న ఢిల్లీ బుకీలు సయ్యాం, జతిన్ ♦ ఎలా మొదలైంది: ఆటగాడు షెకావత్ బుకీలను ఆటగాళ్లకు పరిచయం చేసేవాడు. -
కేపీఎల్ కథ...
ఐపీఎల్ తరహాలో రాష్ట్ర స్థాయిలో లీగ్ నిర్వహించుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన తొలి టోర్నీ. 2009లో మొదలైంది. ముందుగా ఎనిమిది జట్లతో మొదలైనా ప్రస్తుతం 7 టీమ్‌లు ఉన్నాయి. భారత్‌కు ఆడిన కర్ణాటక అగ్రశ్రేణి క్రికెటర్లంతా పాల్గొంటుండటంతో లీగ్‌పై అందరి దృష్టీ పడింది. భారీ స్పాన్సర్‌షిప్‌లు, టీవీ రేటింగ్స్ కూడా బాగా వచ్చాయి. డీన్ జోన్స్, బ్రెట్‌లీలాంటి స్టార్లు కామెంటేటర్లుగా వ్యవహరించారు. ఒక దశలో ఆకర్షణ కోసమంటూ కన్నడ సినీ, టీవీ ఆర్టిస్టులతో కూడిన ‘రాక్‌స్టార్స్’ అనే టీమ్‌ను కూడా లీగ్ బరిలోకి దించారు. కేపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగానే కరియప్ప, శివిల్ కౌశిక్‌లాంటి క్రికెటర్లకు ఐపీఎల్ అవకాశం దక్కింది. ఈ లీగ్‌కు వివాదాలు కొత్త కాదు. 2011లో టోర్నీ నిర్వహణా తీరును సందేహిస్తూ కుంబ్లే, శ్రీనాథ్‌లాంటి దిగ్గజాలు విమర్శించారు. వీరిద్దరు కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన తర్వాత మూడేళ్ల పాటు లీగ్‌ను నిర్వహించకుండా నిలిపివేశారు. అయితే కుంబ్లే, శ్రీనాథ్ పదవులనుంచి దిగిపోయిన తర్వాత మళ్లీ కేపీఎల్ ప్రాణం పోసుకుంది. -
క్రికెటర్ గౌతమ్ అరెస్ట్
బెంగళూరు: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశవాళీ క్రికెటర్ చిదంబరం మురళీధరన్ గౌతమ్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై గౌతమ్‌ను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు సహచర క్రికెటర్ అబ్రార్ కాజీను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బల్లారి టస్కర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరిపై ఫిక్సింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి. దాంతో గౌతమ్, కాజీలను క్రైమ్ బ్రాంచ్ విభాగం అదుపులోకి తీసుకుంది. బల్లారీ టస్కర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్.. ఫిక్సింగ్ చేయడానికి నగదు తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాటింగ్ స్లోగా చేయడానికి ఈ జోడికి రూ. 20 లక్షలు బుకీలు అందజేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా హబ్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరూ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.(ఇక్కడ చదవండి: టీఎన్‌పీఎల్‌లో ఫిక్సింగ్!) దేశవాళీ టోర్నీల్లో భాగంగా గతంలో కర్ణాటక తరఫున ఆడిన గౌతమ్.. గోవాకు మారిపోయాడు. ఇక కాజీ మిజోరాం తరఫున ఆడుతున్నాడు. కాగా, శుక్రవారం నుంచి ఆరంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో వీరిద్దరూ తమ తమ రాష్ట్రాల జట్టులో చోటు దక్కించుకున్న సమయంలో అరెస్ట్ కావడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. భారత-ఏ మాజీ ఆటగాడైన గౌతమ్.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. 94 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన గౌతమ్ 4,716 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2013-14, 2014-15 సీజన్లో కర్ణాటక గెలిచిన మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషించాడు. -
బెట్టింగ్ స్కామ్: ప్రాంఛైజీ ఓనర్ అరెస్ట్
బెంగళూరు: భారత క్రికెట్లో మరోసారి బెట్టింగ్ ఉదంతం కలకలం సృష్టించింది. ఏకంగా ఫ్రాంచైజీ యజమానే బెట్టింగ్‌కు పాల్పడి అడ్డంగా బుక్యయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీపీఎల్)లో ఫిక్సింగ్ ఉదంతాన్ని మరిచిపోకముందే మరో లీగ్‌లో ఏకంగా ఫ్రాంచైజీ యజమాని బెట్టింగ్‌లో పాల్గొనడం క్రికెట్ వర్గాలను నిర్ఘంతపోయాలే చేశాయి. తాజాగా విజయవంతంగా ముగిసిన కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)-2019లో బెళగావి ఫాంథర్ యజమాని అలీ ఆష్వాక్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని బెంగళూరు సిటీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ బుకీతో కలిసి బెట్టింగ్‌లకు పాల్పడినట్లు అలీ అంగీకరించాడని బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ఫిక్సింగ్, ఇతరుల హస్తంపై ఆరా! అలీ బెట్టింగ్తో పాటు ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడ అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా అలీతో పాటు ఆటగాళ్లు లేక ఇంకా ఎవరైనా ఉన్నారనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక బెట్టింగ్ ఉదంతంపై కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ అంశంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ యువ క్రికెటర్లను ప్రొత్సహించే ఉద్దేశంతో ఐపీఎల్ తరహాలో స్థానిక క్రికెట్ లీగ్‌లను ప్రొత్సహిస్తోంది. అయితే ఇలాంటి వరుస ఘటనలు జరుగుతుండటంతో బీసీసీఐ ఈ లీగ్‌లపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. కేపీఎల్‌లో ఏడు జట్లు పాల్గొంటాయి. తాజాగా కేపీఎల్ ఎడిషన్-2019 ఆగస్టులో ముగిసిన విషయం తెలిసిందే. -
గౌతమ్ భీకర ఇన్నింగ్స్, 134 నాటౌట్
బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మేటి ప్రతిభ చూపి అదరహో అనిపించాడు. బళ్లారి టస్కర్స్ జట్టు తరపున బరిలోకి దిగిన గౌతమ్ ఈ టోర్నమెంట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 39 బంతుల్లో శతకం నమోదు చేశాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 134 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గౌతమ్ భీకర ఇన్నింగ్స్‌తో టస్కర్ నిర్ణీత 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన షిమోగా లయన్స్ టీమ్‌ను బంతితో గౌతమ్ వణికించాడు. అతడి ధాటికి లయన్స్ బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. ఏకంగా 8 వికెట్లు పడగొట్టి లయన్స్‌ను మట్టికరిపించాడు. కేపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. గౌతమ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 70 పరుగుల తేడాతో లయన్స్ పరాజయం పాలైంది. 16.3 ఓవర్లలో 133 పరుగులు చేసి ఆలౌటైంది. బలాల్(40), దేశ్‌పాండే(46) మినహా మిగతా ఆటగాళ్లందరూ విఫలమయ్యారు. ఒంటిచేత్తో టస్కర్స్ను గెలిపించిన కృష్ణప్ప గౌతమ్ ‘మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. -
క్రికెటర్ ను ఇంటర్వ్యూ చేసిన భార్య!
-
క్రికెటర్ ను ఇంటర్వ్యూ చేసిన భార్య!
బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఆరంభమై వారం రోజులైనప్పటికీ అక్కడ అదనపు ఆకర్షణ అనేది కరువైంది..ప్రధానంగా స్టార్ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, మనీష్ పాండేలు అంతర్జాతీయ మ్యాచ్‌లో బిజీగా ఉండటంతో కర్ణాటక ప్రీమియర్ లీగ్ కు కళ తప్పింది. కాకపోతే, శుక్రవారం చోటు చేసుకున్న అరుదైన సంఘటనతో ఈ లీగ్ కు కాస్త జోష్ వచ్చింది. ఇందుకు కారణం ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ, అతని భార్య మయాంతి లాంగర్లే. కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో బెలగావీ పాంథర్స్ తరపున ఆడుతున్న స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్చూ చేసే అవకాశం స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా ఉన్న మయాంతికి వచ్చింది. బ్రాడ్ కాస్టింగ్ కవరేజ్ లో భాగంగా ఆ ఈవెంట్ కు హాజరైన మయాంతి.. భర్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్యూ చేయడం అభిమానుల్లో మజాను తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిన్న బెంగాళూరు బ్లాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో స్టువర్ట్ బిన్నీ 46 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులు నమోదు చేశాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెలగావీ పాంథర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 192 పరుగులు చేసింది. ఆపై బెంగళూరు బ్లాస్టర్స్ 19.3 ఓవర్లలో169 పరుగులు చేసింది. ఇక్కడ స్టువర్ట్ బిన్నీ రెండు వికెట్లతో్ రాణించారు. దాంతో పాంథర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన భర్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్య్వూ చేసే అరుదైన అవకాశం మయాంతికి వచ్చింది. ఇలా భర్తను భార్య ఇంటర్వ్యూ చేయడంపై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. స్టువర్ట్ బిన్నీ రాణించడానికి భార్య మయాంతి అక్కడకు రావడమేనని ఒకరు అభిప్రాయపడగా, భర్తను ఇంటర్య్యూ చేయడం అత్యున్నతమైన గిఫ్ట్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు.