సాక్షి, బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రోజుకొక కొత్త విషయం బయటకు వస్తోంది. ఇన్ని రోజులు ఆటగాళ్లు, కోచ్‌లు, బుకీల బాగోతంతోపాటు హనీట్రాప్ మరక కూడా నమోదైంది. తాజాగా ఈ స్కామ్‌లో శాండల్‌వుట్ నటీనటులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నగర పోలీసు కమిషనర్ భాస్కర్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు నటీనటులకు సంబంధం ఉందని అనుమానాలు ఉన్నట్లు తెలిపారు.
మ్యాచ్‌లు ముగిసిన తర్వాత జరిగే పార్టీల్లో నటీనటులు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ విందుల్లో నటీనటులు, ఆటగాళ్లతో కలిసిమెలిసి కనిపించేవారన్నారు. తద్వారా కొద్ది రోజుల్లోనే నటులు భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసిందని తెలిపారు. హఠాత్తుగా వీరికి అంత డబ్బు ఎలా వచ్చిందనే విషయాన్ని మున్ముందు విచారణలో తెలుసుకుంటామన్నారు. కేవలం రెండు, మూడు సినిమాలు చేసిన తర్వాత ధనవంతులయిపోవడం సాధ్యమయ్యే పనేనా అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. బెళగావి ప్యాంథర్స్ కోచ్ సు«దీర్ శింధేను మంగళవారం అరెస్టు చేసినట్లు, అతని నుంచి విచారణలో పలు విషయాలను రాబట్టినట్లు చెప్పారు.
ఆ క్లబ్ నుంచే ఫిక్సింగ్
సుధీర్ శింధేకు చెందిన జయనగరలోని సోషల్ క్రికెట్ క్లబ్‌లో చాలా మంది ఆటగాళ్లు క్రికెట్ ఆడేవారని, ఆ ఆటగాళ్లే దాదాపుగా చాలామంది బెళగావి ప్యాంథర్స్ జట్టులో ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా ఈ క్లబ్‌లో శిక్షణ పొందిన క్రికెటర్లు కేపీఎల్‌లోని చాలా జట్లలో చేరారని తెలిపారు. ఆయా జట్లలో చేరిన ఈ ఆటగాళ్లతో∙మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడే వారని చెప్పారు. ఆ క్రికెట్ క్లబ్‌కు బెళగావి జట్టు యజమాని అస్ఫాక్ థార్ అలి తరచూ వచ్చి ఆటగాళ్లతో పరిచయాలు పెంచుకునే వాడని తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న సినీ నటులు అప్రూవర్‌గా మారితే వారికి పోలీసుల నుంచి సహాయంతోపాటు రక్షణ కల్పిస్తామని కమిషనర్ తెలిపారు.
కేపీఎల్ రద్దు
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కేపీఎల్‌కు మాయని మచ్చ పడింది. ఇప్పటికే ఈ కేసులో ఆటగాళ్లు, జట్ల యజమానులు, కోచ్‌లతో కలుపుకుని సుమారు 9 మంది వరకు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఫిక్సింగ్ కేసు తేలే వరకు కేపీఎల్ నిర్వహించరాదని కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) నిర్ణయించింది. వచ్చే ఏడాది జరగనున్న కేపీఎల్ టోర్నీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
క్యాబ్‌లకు సీసీ కెమెరా, జీపీఎస్
ఓలా, ఉబర్ తదితర ట్యాక్సీలు, క్యాబ్‌లల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చుకోవాలని కమిషనర్ సూచించారు. హైదరాబాద్ వద్ద పశువైద్యురాలిపై దారుణ హత్యాచారం నేపథ్యంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ట్యాక్సీల్లో సీసీటీవీ కెమెరా, జీపీఎస్, ఎమెర్జెన్సీ బటన్ అమర్చుకోవడం తప్పనిసరి అని చెప్పారు. హైదరాబాద్ ఘటన తర్వాత బెంగళూరు నగర పోలీసులు సిద్ధం చేసిన బీసీపీ సురక్షా యాప్ డౌన్‌లోడ్లు పెరిగాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment