ధోనిపై క్రిమినల్ కేసు కొట్టివేత
మ్యాగజైన్ ముఖచిత్రం వివాదం
న్యూఢిల్లీ: విష్ణుమూర్తి రూపంలో మ్యాగజైన్‌పై కనిపించి హిందువుల మనోభావాలు దెబ్బ తీశాడంటూ సుదీర్ఘ కాలంగా సాగుతూ వచ్చిన వివాదంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఊరట లభించింది. దీనికి సంబంధించి నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ సుప్రీం కోర్టు గురువారం తీర్పునిచ్చింది. 2013లో బిజినెస్ టుడే మ్యాగజైన్ కవర్ పేజీపై విష్ణు మూర్తి రూపంలో ధోని చిత్రాన్ని ప్రచురించి అతడి చేతుల్లో వివిధ ఉత్పత్తులను ఉంచింది. అయితే ఇందులో ఓ షూ కూడా ఉండటం వివాదాస్పదమైంది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ట్రయల్ కోర్టులో కేసు దాఖలైంది.
అప్పట్లో తనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది. అయితే ఈ విషయంలో ధోని ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదమేమీ లేదని పేర్కొంటూ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ కేసును కొట్టివేసింది. ధోని, మ్యాగజైన్ ఎడిటర్‌ను ప్రాసిక్యూట్‌చేస్తే న్యాయం అవహేళనకు గురి అయినట్టేనని కోర్టు పేర్కొంది. అంతకుముందు కర్ణాటకలో తనపై ఇదే విధంగా నమోదైన కేసు విషయంలోనూ ధోనికి విముక్తి లభించింది.