సోచి : వారి పాదాల మధ్య బంతి పాదరసంలా జారుతుంది. గోల్ కొడితే గురి తప్పడం అరుదు.దశాబ్ద కాలానికి పైగా ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులను మైమరిపించిన ఆ మాయగాళ్లే లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు నుంచే ఈ పేర్లు ప్రపంచమంతా హోరెత్తాయి. ఈసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలనీ వారు సైతం కలలు కన్నారు. కానీ.. ఆ కలలు నెరవేరలేదు.
మెస్సీ, రొనాల్డోలు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు ఫిఫా ప్రపంచకప్ నుంచి ఒకే రోజు నిష్క్రమించాయి. ప్రధానంగా మెస్సీ, రొనాల్డోలు వైఫల్యం చెందడంతో టైటిల్ ఫేవరెట్లుగా దిగిన అర్జెంటీనా, పోర్చుగల్‌లు ప్రిక‍్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాయి. దాంతో సోషల్ మీడియా వేదికగా మెస్పీ, రొనాల్డోలపై జోకుల వర్షం కురుస్తోంది. ఆ ఇద్దర్నీ ఇప్పటివరకూ దిగ్గజ ఆటగాళ్లుగా అభిప్రాయపడిన అభిమానులు.. తమ అభిప్రాయాన్ని సైతం మార్చుకుని విమర్శలు గుప్పించారు.
‘ఏనాడు వరల్డ్‌కప్ నాకౌట్ గేమ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయని వీరిద్దరూ ఒకే రోజు ఒకే రకంగా వరల్డ్ కప్‌ను వీడారు’ అంటూ అని ఒక అభిమాని సెటైర్ వేయగా, ‘రొనాల్డ్ జట్టుతో మెస్సీ ఆడినట్లయితే అంతర్జాతీయ గోల్స్ కంటే కూడా ఎక్కువసార్లు వీడ్కోలు ప్రకటించే అవకాశం దక్కేది’అని మరొక అభిమాని విమర్శించాడు. ‘రొనాల్డో-మెస్సీలు ఎయిర్‌పోర్ట్‌లు ఎదురుపడితే అది కచ్చితంగా జోక్‌గా నిలిచిపోతుంది’అని మరొకరు చమత్కరించారు. ‘ఈరోజు రాత్రి వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లు కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి’అని మరొక అభిమాని ఎద్దేవా చేశాడు. రొనాల్డో-మెస్సీలు ఎయిర్‌పోర్ట్‌లు కలిస్తే ఇలానే ఉంటుందంటూ రెండు మేకలు ఉన్న ఫొటోను మరొకరు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment