
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్ బెర్తుని ఖాయం చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. దాంతో శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రమే కానుంది. కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలవాలని ఆశిస్తోంది. ప్రస్తుతం 18 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్‌లో ఉండగా, సీఎస్‌కే 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రన్‌రేట్ ప్రకారం సీఎస్‌కే మెరుగైన స్థానంలో ఉండటంతో ఢిల్లీతో గెలిస్తే టాప్ ప్లేస్‌ను ఆక్రమిస్తుంది. దీనిలో భాగంగా ధోని అండ్ గ్యాంగ్ పోరుకు సన్నద్ధమవుతోంది.
ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి ఓపెనర్లు అంబటి రాయుడు, షేన్ వాట్సన్ సీఎస్‌కే మెరుపు ఆరంభాల్ని ఇస్తుండగా.. మిడిలార్డర్‌లో సురేశ్ రైనా, ఎంఎస్ ధోని, బ్రేవో నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లుగా మలుస్తున్నారు. మరొకవైపు ఢిల్లీ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా, జాసన్ రాయ్ మెరుగ్గా ఆడుతుండగా.. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హిట్టింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment