చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 132 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కే ఆది నుంచి పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్(6), షేన్ వాట్సన్( 10)లు తీవ్రంగా నిరాశపరిచారు. సురేశ్ రైనా(5) కూడా విఫలం కావడంతో సీఎస్‌కే కష్టాల్లో పడింది. ఆ దశలో మురళీ విజయ్-అంబటి రాయుడుల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది. వీరిద్దరూ 33 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మురళీ విజయ్(26) నాల్గో వికెట్‌గా నిష్క్రమించాడు. ఆపై అంబటి రాయుడు(42 నాటౌట్: 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్), ఎంఎస్ ధోని(37 నాటౌట్: 29 బంతుల్లో 3 సిక్సర్లు)లు ఫర్వాలేదనిపించడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు సాధించగా, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యాలు తలో వికెట్ తీశారు.
సీఎస్‌కేను కట్టడి చేసిన ముంబై బౌలర్లు
తమకు అచ్చొచ్చిన మైదానంలో ముంబై ఇండియన్స్ మరోసారి ఆకట్టుకుంది. సీఎస్‌కేను ఆరంభం నుంచి కట్టడి చేసి సాధారణ స్కోరుకే పరిమితం చేసింది. పిచ్ మందకొడిగా ఉండటాన్ని ఉపయోగించుకున్న ముంబై బౌలర్లు.. చెన్నైకు ఏ దశలోనూ బ్యాట్ ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు. దాంతో చెన్నై టాపార్డర్ అంతా పరుగులు చేయడానికి నానా ఇబ్బందుల్లో పడింది. ప్రధానంగా ముంబై స్పిన్నర్ రాహుల్ చాహర్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టకున్నాడు. 4 ఓవర్లు వేసి రెండు వికెట్లు సాధించడంతో పాటు 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment