పుణె: చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు మరోసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఇది తొమ్మిదోసారి. ఆడిన తొమ్మిది సీజన్లలోనూ అద్భుతంగా రాణించి చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం గమనార్హం. తాజాగా ఆదివారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విజయం అనంతరం జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విలేకరులతో మాట్లాడారు. ప్రతి సీజన్‌లో బాగా రాణించాలంటే జట్టును సరిగ్గా అంచనా వేసి వినియోగించుకోవాల్సి ఉంటుందని ధోనీ అన్నారు.
‘ఆటగాళ్లకు ఎంతో సన్నిహితమైన వ్యక్తులు జట్టుకు సిబ్బందిగా ఉన్నారు. దీంతో కెప్టెన్‌గా నా పని సులువైపోయింది. మాకు నిజంగా మంచి జట్టు ఉంది. ప్రతి సీజన్‌లోనూ కొత్త ఆటగాళ్లు జట్టులో చేరారు. అశ్విన్, బొలింగర్, మోహిత్ లాంటివాళ్లు జట్టు తరఫున ఆడారు. రెండేళ్లు మేం ఆడకపోవడంతో పలువురు ఆటగాళ్లు మారారు. ఈక్రమంలో అందుబాటులో ఉన్న జట్టును చక్కగా బేరీజు వేసి.. ఫలితాలు ఇచ్చేదిశగా ఉపయోగించుకున్నాం’ అని తెలిపారు.
గతంలో ఐపీఎల్ ఫైనల్‌లో పొరపాట్లు చేసిన సంగతి తనకు గుర్తు ఉందని, రాబోయే మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని కోరుకుంటున్నామని, ప్లేఆఫ్స్‌లో తమ జట్టు ఉత్తమంగా ఉండాలని అనుకుంటున్నట్టు ధోనీ అన్నారు. పంజాబ్ విసిరిన 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి రెండు వికెట్లు పడిన తర్వాత ధోనీ వరుసగా హర్భజన్ సింగ్, దీపక్ చాహర్‌లను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపించారు.
ఇలా ప్రధాన బ్యాట్స్‌మెన్ కాకుండా బౌలర్లు ముందుకు రావడంతో పంజాబ్ బౌలర్లు కంగుతిన్నారు. ఈ విషయంపై ధోనీ స్పందిస్తూ.. పంజాబ్ బౌలర్లను డిస్టర్బ్ చేయడానికి అలా చేశానని తెలిపారు. ‘బౌలింగ్ లైనప్ చూసుకుంటే.. కొంచెం స్వింగ్ వస్తోంది. స్వింగ్ సాధ్యపడితే ఎక్కువ వికెట్లు తీసుకోవాలని బౌలర్లు భావిస్తారు. అందుకే భజ్జీ, చాహర్‌ను పంపి.. బౌలర్లలో కొంత గందరగోళం సృష్టించాలని భావించాం. సరైన బ్యాట్స్‌మెన్ వస్తే బౌలర్లు నిలకడగా బౌలింగ్ చేస్తారు. అదే లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు వస్తే.. బౌన్సర్లు, ఆఫ్‌కటర్లు వేయడానికి ప్రయత్నిస్తారు. కొంత నిలకడ తప్పుతుంది’ అని ధోనీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment