
స్మిత్ బృందానికి దలైలామా ఆశీర్వాదం
ఆస్ట్రేలియా ఆటగాళ్లు టిబెట్ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. శుక్రవారం ధర్మశాల మెక్‌లియోడ్ గంజ్‌లోని ఆయన మందిరంలో కలిసిన ఆసీస్ క్రికెటర్లను దలైలామా ఆశీర్వదించారు. అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మాట్లాడుతూ ‘బౌద్ధ గురువును కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో గడిపిన క్షణాలు అహ్లాదకరంగా సాగాయి. ప్రశాంతంగా నిద్రపోవడం ఎలాగో ఆయన్ని అడిగి తెలుసుకున్నాను. ముక్కు మూసుకొని మేమంతా ఆయన ముందు కూర్చుంటే మమ్మల్ని ఆశీర్వదించి పంపారు.
దీంతో తదుపరి ఐదు రోజులు ఎలాంటి కలవరపాటు లేకుండా కంటినిండా నిద్రపోతాను’ అని అన్నాడు. దలైలామాతో భేటీ వల్ల ఎలాంటి లబ్ధి పొందారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘చెప్పలేనంత ప్రశాంతత పొందాం. ఆయనతో ఏదైనా ఇట్టే నేర్చుకోవచ్చు. మాకిది చక్కని అనుభూతి. శిరోభారం తగ్గి ఎక్కడలేని ఉపశమనం లభించింది’ అని స్మిత్ చెప్పాడు. ఈ సందర్భంగా కెప్టెన్ స్మిత్ ఆసీస్ క్రికెటర్లందరూ సంతకం చేసిన జెర్సీని దలైలామాకు అందజేశాడు.