తడ‘పడ్డారు’
తొలి రోజు లభించిన ఆధిపత్యాన్ని భారత బ్యాట్స్‌మెన్ రెండో రోజు కొనసాగించలేకపోయారు. రెండు వైపుల నుంచి సఫారీ పేసర్లు చేసిన దాడికి వరుసగా పెవిలియన్‌కు ‘క్యూ’ కట్టారు. స్టెయిన్ బుల్లెట్ బంతులతో మెరుపులు మెరిపిస్తే... మోర్కెల్ సమయోచితంగా స్పందించాడు. దీంతో భారీ స్కోరు ఖాయమనుకున్న మ్యాచ్‌లో టీమిండియా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడుతూ మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది.
డర్బన్: ఒకట్రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ స్థాయిని తక్కువగా అంచనా వేయలేరని దక్షిణాఫ్రికా పేసర్ స్టెయిన్ (6/100) నిరూపించాడు. సిరీస్‌లో ఇప్పటిదాకా నిరాశపర్చిన ఈ గన్.. డర్బన్ టెస్టులో మాత్రం భీకరంగా పేలింది. బుల్లెట్‌ను మించిన వేగంతో, సుడులు తిరిగే స్వింగ్‌తో ధోనిసేనను నిలువునా ముంచింది. దీంతో తొలి రోజు ఆధిపత్యం కనబర్చిన టీమిండియా రెండో రోజు చతికిలపడింది. ఫలితంగా కింగ్స్‌మీడ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో... శుక్రవారం రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 111.3 ఓవర్లలో 334 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 198/1తో పటిష్ట స్థితిలో ఉన్న ధోనిసేన 136 పరుగులకే చివరి 9 వికెట్లు కోల్పోయింది.
మురళీ విజయ్ (226 బంతుల్లో 97; 18 ఫోర్లు) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. చతేశ్వర్ పుజారా (132 బంతుల్లో 70; 9 ఫోర్లు), రహానే (121 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు), కోహ్లి (87 బంతుల్లో 46; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. స్మిత్ (35 బ్యాటింగ్), పీటర్సన్ (46 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఇంకా 252 పరుగులు వెనుకబడి ఉంది. భారీ వర్షం కారణంగా రెండో రోజు తొలి సెషన్ ఆట పూర్తిగా రద్దయ్యింది. దీంతో మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.
స్టెయిన్ జోరు
181/1 ఓవర్‌నైట్ స్కోరుతో పుజారా, విజయ్ మెరుగ్గా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా.... స్టెయిన్ మాత్రం మధ్యలో చెలరేగిపోయాడు. పిచ్ నుంచి సహకారం లేకపోయినా నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో రివర్స్ స్వింగ్ చేస్తూ భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. అద్భుతమైన ఇన్ స్వింగర్‌కు పుజారా అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 157 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన కోహ్లి డిఫెన్స్ వైపు మొగ్గు చూపాడు. అయితే తన తర్వాతి ఓవర్‌లోనే స్టెయిన్ భారత్‌కు మరో షాకిచ్చాడు.
సెంచరీ దిశగా సాగుతున్న విజయ్‌తో పాటు, రోహిత్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. షార్ట్ పిచ్ బంతికి విజయ్ కంగుతింటే... నాణ్యమైన ఇన్ స్వింగర్ రోహిత్ మిడిల్ స్టంప్‌ను ఎగరగొట్టింది. 10 బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు పడటంతో భారత్ 199 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లితో జత కలిసిన రహానే ఆచితూచి ఆడాడు. 81వ ఓవర్‌లో స్టెయిన్ కొత్త బంతితో బౌలింగ్‌కు వచ్చినా ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్నారు. 93వ ఓవర్‌లో మోర్కెల్ బంతిని గ్లాన్స్ చేయబోయి కోహ్లి కీపర్ చేతికి చిక్కాడు.
రహానే, కోహ్లి ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. టీ తర్వాత ధోని (40 బంతుల్లో 24; 3 ఫోర్లు), రహానే వేగంగా ఆడారు. మోర్కెల్, పీటర్సన్ బౌలింగ్‌లో చెరో రెండు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించారు. ఈ దశలో మరోసారి బౌలింగ్‌కు దిగిన స్టెయిన్ ఎనిమిది బంతుల వ్యవధిలో ధోని, జహీర్ (0), ఇషాంత్ (4)లను అవుట్ చేయగా, జడేజా (0)ను డుమిని పెవిలియన్‌కు పంపాడు. షమీ (1) ఎక్కువసేపు నిలబడకపోవడంతో భారత్ 14 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. స్టెయిన్ 6, మోర్కెల్ 3, డుమిని ఒక్క వికెట్ తీశారు.
ఓపెనర్ల శుభారంభం
స్మిత్, పీటర్సన్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించి శుభారంభాన్నిచ్చారు. జహీర్, షమీ వేసిన తొలి ఆరు ఓవర్లలో ఏడు ఫోర్లు బాదడంతో ఓవర్‌కు ఆరు పరుగుల చొప్పున లభించాయి. జహీర్ స్థానంలో ఇషాంత్‌ను బౌలింగ్‌కు దించినా వీరి జోరులో మార్పు రాలేదు. దీంతో ధోని... 14వ ఓవర్‌లో స్పిన్నర్ జడేజాకు బంతి అందించాడు.
వికెట్ మీద టర్న్ లభిస్తుండటంతో ప్రొటీస్ ద్వయం సింగిల్స్‌తో స్ట్రయిక్‌ను రొటేట్ చేసింది. సెషన్ చివర్లో రెండో స్పెల్‌కు దిగిన జహీర్ పరుగులు కట్టడి చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. స్మిత్, పీటర్సన్ తొలి వికెట్‌కు అజేయంగా 82 పరుగులు జోడించి రోజును ముగించారు. 20 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) పీటర్సన్ (బి) మోర్కెల్ 29; విజయ్ (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 97; పుజారా (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 70; కోహ్లి (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 46; రోహిత్ (బి) స్టెయిన్ 0; రహానే నాటౌట్ 51; ధోని (సి) స్మిత్ (బి) స్టెయిన్ 24; జడేజా (సి) కలిస్ (బి) డుమిని 0; జహీర్ (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 0; ఇషాంత్ (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 4; షమీ (సి) స్మిత్ (బి) మోర్కెల్ 1; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (111.3 ఓవర్లలో ఆలౌట్) 334.
వికెట్లపతనం: 1-41; 2-198; 3-199; 4-199; 5-265; 6-320; 7-321; 8-322; 9-330; 10-334
బౌలింగ్: స్టెయిన్ 30-9-100-6; ఫిలాండర్ 21-6-56-0; మోర్కెల్ 23.3-6-50-3; కలిస్ 11-1-36-0; పీటర్సన్ 22-2-75-0; డుమిని 4-0-10-1.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: స్మిత్ బ్యాటింగ్ 35; పీటర్సన్ బ్యాటింగ్ 46; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (20 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 82.
బౌలింగ్: జహీర్ 4-0-20-0; షమీ 5-0-23-0; ఇషాంత్ 6-2-18-0; జడేజా 5-1-20-0.
కాకతాళీయమే..!
టెస్టు క్రికెట్‌లో రెండొందల క్యాచ్‌లు అందుకున్న క్రికెటర్లు ఇద్దరు. ద్రవిడ్ (210), తర్వాత... తన చివరి టెస్టులో కలిస్ (200) ఈ మార్కును చేరుకున్నాడు. అయితే అసలు విశేషం ఏమిటంటే... ద్రవిడ్ తన 200వ క్యాచ్ తీసుకుంది 2010లో డర్బన్‌లోనే. అది కూడా డిసెంబరు 27వ తేదీనే. కలిస్ కూడా డిసెంబరు 27వ తేదీనే డర్బన్‌లోనే ఈ మార్కును చేరుకోవడం కాకతాళీయమే. భారత్, దక్షిణాఫ్రికాల మధ్యే జరిగిన ఈ రెండు టెస్టుల్లోనూ స్టెయిన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసుకోవడం కొసమెరుపు..!
2 టెస్టుల్లో 200 క్యాచ్‌లు అందుకున్న రెండో క్రికెటర్‌గా కలిస్. జడేజా క్యాచ్‌ను అందుకోవడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
సెషన్-1
ఆట జరగలేదు
సెషన్-2
ఓవర్లు: 34
పరుగులు: 90
వికెట్లు: 4
సెషన్-3
ఓవర్లు: 16.3
పరుగులు: 63
వికెట్లు: 5 (భారత్)
ఓవర్లు: 20
పరుగులు: 82
వికెట్లు: 0 (దక్షిణాఫ్రికా)