డేర్‌డెవిల్స్‌ కసితీరా.. | Daredevils beat KKR by 55 runs | Sakshi
Sakshi News home page

డేర్‌డెవిల్స్‌ కసితీరా..

Published Fri, Apr 27 2018 11:34 PM | Last Updated on Sat, Apr 28 2018 7:49 AM

Daredevils beat KKR by 55 runs - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చావుదెబ్బ తిన్న ఢిల్లీడేర్‌డెవిల్స్‌.. శుక్రవారం సొంత మైదానం ఫిరోజ్‌ షా కోట్లలో జరిగిన మ్యాచ్‌లో బెబ్బులిలా గర్జించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఊచకోతకు ఓపెనర్‌ పృథ్వీ షా సొగసైన షాట్లు తోడవడంతో కోల్‌కతా ఈసారి తోకముడిచింది. ఆది నుంచి కోల్‌కతా బౌలింగ్‌పై విరుచుకుపడిన ఢిల్లీ.. ఆపై కోల్‌కతానూ కోలుకోనీయకుండా చేసి ఘనమైన విజయాన్ని అందుకుంది. కోల్‌కతా ఆటగాళ్లలో ఆండ్రీ రస్సెల్‌(44)కు తోడు శుభ్‌మాన్‌ గిల్‌(37), నరైన్‌(26)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో ఆ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. ఢిల్లీ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది.


వరుస పరాజయాలతో సతమవుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఎట్టకేలకు జూలు విదిల్చింది. ‌ అయ్యర్‌(93 నాటౌట్‌;40 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లు), పృథ్వీ షా(62; 44బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడటంతో పాటు.. బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, అమిత్‌ మిశ్రా, అవీష్‌ ఖాన్‌ తలో రెండు వికెట్లతో చెలరేగడంతో కోల్‌కతాను 55 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో ఇది ఢిల్లీకి రెండో అత్యుత్తమ స్కోరు.

ఢిల్లీకి ఓపెనర్లు కోలిన్‌ మున్రో-పృథ్వీ షాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన తర్వాత మున్రో(33) ఔటయ్యాడు. ఆపై పృథ్వీషా -శ్రేయస్‌ అయ్యర్‌ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే తొలుత 38 బంతుల్లో పృథ్వీషా హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయ్యర్‌తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత పృథ్వీ షారెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ గోల్డెన్‌ డక్‌గా ఔటయ్యాడు. దాంతో ఢిల్లీ 129 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.

అయితే అయ్యర్‌-మ్యాక్స్‌వెల్‌ జోడి మరింత దూకుడుగా ఆడింది. ఈ క్ర​మంలోనే అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌తో కలిసి 73 పరుగులు జత చేశాడు.  చివర్లో కోల్‌కతా బౌలర్లపై అయ్యర్‌  విరుచుకుపడటంతో ఢిల్లీ భారీ స్కోరు నమోదు చేసింది. ప్రధానంగా శివం మావి వేసిన ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ 29 పరుగుల్ని పిండుకుంది. దాంతో ఈ సీజన్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్న బౌలర్‌గా మావి చెత్త గణాంకాలు నమోదు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement