క్రిస్ గేల్ను టార్గెట్ చేస్తున్నారు
లండన్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ వినోదం పంచేవాడని, అతడిని విమర్శించడంలో అర్థంలేదని విండీస్కు రెండుసార్లు టి-20 ప్రపంచ కప్ అందించిన సారథి డారెన్ సామీ అన్నాడు. మీడియా ప్రతినిధులతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలపాలవుతున్న క్రిస్ గేల్ను సామీ సమర్థించే ప్రయత్నం చేశాడు.
'నావరకు మన క్రికెట్ హీరోల్లో క్రిస్ ఒకడు. అతను వినోదం కలిగిస్తుంటాడు. జట్టు సభ్యుడిగా గేల్ను గౌరవిస్తా. గేల్ను విమర్శించడంలో కారణం కనిపించడంలేదు. నేనెప్పుడూ గేల్కు మద్దతుగా ఉంటా. ఎందుకంటే క్రికెట్ మైదానంలో అతను ఏం చేశాడన్నదే ముఖ్యం. క్రికెటర్లుగా మాకు బాద్యత ఉంది. అభిమానులు మమ్మల్ని గమనిస్తుంటారు. అయితే కొన్నిసార్లు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కోసం క్రిస్ను టార్గెట్ చేస్తున్నారని భావిస్తున్నా' అని సామీ చెప్పాడు.
బిగ్బాష్ టి-20 లీగ్ సందర్భంగా బ్రిటీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఐపీఎల్ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ద్వందార్థాలు వచ్చేలా గేల్ మాట్లాడాడు. ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత గేల్పై విచారణ చేపడతామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. ఈ నేపథ్యంలో సామీ స్పందించాడు.