
డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ
* తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 416/2
* కివీస్‌తో రెండో టెస్టు
పెర్త్: న్యూజిలాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (272 బంతుల్లో 244 బ్యాటింగ్; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 2 వికెట్లకు 416 పరుగులు చేసింది. స్మిత్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఉస్మాన్ ఖాజా (186 బంతుల్లో 121; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు ఓపెనర్లలో బర్న్స్ (40) మోస్తరుగా ఆడినా... వార్నర్ మాత్రం నిర్ధాక్షిణ్యంగా వేటాడాడు. కివీస్ బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్ లోపించడంతో పరుగుల వరద పారించాడు. తొలి వికెట్‌కు 101 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చిన వార్నర్.. ఆ తర్వాత మరింత వేగంగా ఆడాడు.
కేవలం 118 బంతుల్లోనే సెంచరీ చేసిన అతను 236 బంతుల్లోనే ‘డబుల్’ బాదేశాడు. ఖాజాతో కలిసి రెండో వికెట్‌కు 302 పరుగులు సమకూర్చి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఒకే రోజులో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కిన వార్నర్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో శతకాలు సాధించిన గవాస్కర్ రికార్డును సమం చేశాడు.