బై బై బెంగళూరు.. ఏడేళ్ల తర్వాత ఫ్లే ఆఫ్‌కు ఢిల్లీ | DC down RCB to reach playoffs | Sakshi
Sakshi News home page

బై బై బెంగళూరు

Published Sun, Apr 28 2019 7:42 PM | Last Updated on Mon, Apr 29 2019 8:09 AM

DC down RCB to reach playoffs - Sakshi

అనుకున్నదేమీ జరగలేదు. బెంగళూరు ముందడుగేమీ వేయలేదు. వరుసగా మూడో ఏడాది తమ పోరాటాన్ని లీగ్‌ దశతోనే ముగించింది. ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ చివర్లో అనవసరంగా పరుగులుసమర్పించుకుని... దిగ్గజ బ్యాట్స్‌మన్‌ కోహ్లి, ‘మిస్టర్‌ 360’ డివిలియర్స్‌ వంటి ఆటగాళ్లున్నా ఛేదనలో పేలవప్రదర్శనతో ఎనిమిదో ఓటమిని ఆహ్వానించింది.

ఐపీఎల్‌–12 ప్లే ఆఫ్స్‌కు అర్హత రేసు నుంచి తప్పుకొంది. మరోవైపు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతగడ్డపై చక్కటి విజయం అందుకుంది. పనిలోపనిగా మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకురావడంతోపాటు ఏడేళ్ల విరామం తర్వాతదర్జాగా ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించింది.   

న్యూఢిల్లీ: ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాలి. వాస్తవంగానైతే దీనిని ఒక సవాల్‌గా తీసుకుని ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాలి. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడకూడదో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అలానే ఆడింది. ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్‌పై పైచేయి సాధించినట్లే కనిపించి అంతలోనే పట్టు విడిచింది. ఫలితం... ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పరాజయం పాలై ఐపీఎల్‌–12లో లీగ్‌ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (37 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు); ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ (37 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన అర్ధ సెంచరీలతో గట్టి పునాది వేశారు.

చివర్లో ఆల్‌రౌండర్లు రూథర్‌ఫర్డ్‌ (13 బంతుల్లో 28 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (9 బంతుల్లో 16 నాటౌట్‌; 3 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి అనూహ్య స్కోరు అందించారు. బెంగళూరు బౌలర్లలో చహల్‌ (2/41) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఓపెనర్లు పార్థివ్‌ పటేల్‌ (20 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (17 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభమిచ్చినా... రాయల్‌ చాలెంజర్స్‌ తర్వాత చేతులెత్తేసింది. గురుకీరత్‌ సింగ్‌ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌), స్టొయినిస్‌ (24 బంతుల్లో 32 నాటౌట్‌) పోరాడినా... చివర్లో ఢిల్లీ పేసర్లు ఇషాంత్‌ (1/40), రబడ (2/31) అడ్డుకున్నారు. అంతకుముందు స్పిన్నర్లు అమిత్‌ మిశ్రా (2/29), అక్షర్‌ పటేల్‌ (1/26) బెంగళూరుకు కళ్లెం వేశారు. ఈ గెలుపుతో 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో ఢిల్లీ 16 పాయింట్లతో ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.   

టాప్‌లో వారు... చివర్లో వీరు...
ఈ సీజన్‌లో చక్కటి ఫామ్‌లో ఉన్న ధావన్‌ మరో ఓపెనర్‌ యువ పృథ్వీ షా (10 బంతుల్లో 18; 4 ఫోర్లు)తో కలిసి ఢిల్లీకి మంచి పునాది వేశాడు. చకచకా బౌండరీలు బాదుతున్న పృథ్వీని ఉమేశ్‌ ఔట్‌ చేయడంతో 35 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. వస్తూనే ఫోర్‌తో ఖాతా తెరిచిన అయ్యర్‌ ఆసాంతం అదే దూకుడు కనబర్చాడు. మరో ఎండ్‌లో ధావన్‌ జోరు తో పవర్‌ ప్లే ముగిసేసరికి ఢిల్లీ 59/1తో నిలిచింది. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ మంచి రన్‌రేట్‌తో స్కోరును నడిపించారు.

వరుసగా మూడో అర్ధ సెంచరీ (36 బంతుల్లో) సాధించిన ధావన్‌ ఆ వెంటనే ఔటయ్యాడు. రిషభ్‌ పంత్‌ (7)తో పాటు రెండు సిక్స్‌లతో 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్కు అందుకున్న అయ్యర్, కొలిన్‌ ఇంగ్రామ్‌ (11) వరుస ఓవర్లలో వెనుదిరగడంతో ఢిల్లీ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ దశలో రూథర్‌ఫర్డ్, అక్షర్‌ అనూహ్యంగా విజృంభించి భారీ స్కోరు అందించారు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి రూథర్‌ఫర్డ్‌ కొట్టిన ఒంటి (ఎడమ) చేతి సిక్స్‌ హైలైట్‌గా నిలిచింది.

శుభారంభం దక్కినా... ప్చ్‌!
నెమ్మదించిన పిచ్‌పై లక్ష్య ఛేదనకు బెంగళూరుకు ఓపెనర్లు పార్థివ్, కోహ్లి ఆశావహ ఆరంభాన్నిచ్చారు. పార్ధివ్‌ బౌండరీలతో చెలరేగాడు. ఇషాంత్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతడు అక్షర్‌ పటేల్‌కు సిక్స్‌తో స్వాగతం పలికాడు. ఢిల్లీకి ఆడుతున్న నేపాల్‌ యువ స్పిన్నర్‌ సందీప్‌ లమిచానే ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. రబడ బౌలింగ్‌లో ఓపెనర్లు చెరో ఫోర్‌ దంచారు. ఇషాంత్‌ ఓవర్లో కోహ్లి సిక్స్‌ కొట్టడంతో ఆర్‌సీబీ 4.3 ఓవర్లకే 50 పరుగులు చేసింది. రాకెట్‌లా దూసుకెళ్తున్న ఈ స్కోరుకు పార్థివ్‌ను అవుట్‌ చేసి రబడ బ్రేక్‌ వేశాడు. పవర్‌ ప్లే అనంతరం 64/1తో రాయల్‌ చాలెంజర్స్‌ మెరుగైన స్థితిలోనే నిలిచింది.

కానీ, అక్షర్‌ ఓవర్లో పుల్‌ షాట్‌ ఆడబోయిన కోహ్లి... డీప్‌లో రూథర్‌ఫర్డ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్‌కు అతి సమీపంలో అక్షర్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో డివిలియర్స్‌ (19 బంతుల్లో 17; 1 సిక్స్‌) ఆట ముగిసింది. క్లాసెన్‌ (3)ను బోల్తా కొట్టించడంతో పాటు దూకుడు మీదున్న శివమ్‌ దూబె (16 బంతుల్లో 24; 2 సిక్స్‌లు)నూ ఒకే ఓవర్లో అమిత్‌ మిశ్రా పెవిలియన్‌ చేర్చాడు. బెంగళూరు 111/5తో నిలిచిన దశలో విజయానికి 42 బంతుల్లో 77 పరుగులు అవసరమయ్యాయి. గురుకీరత్, స్టొయినిస్‌ ఆశలు రేపినా అవి గెలుపు తీరం చేర్చలేదు.

మ్యాచ్‌ పోయింది ఇక్కడే
17 ఓవర్లకు 141/5... బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌తో మ్యాచ్‌ చివర్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరిది. ధావన్, పంత్, ఇంగ్రామ్‌ సహా హిట్టర్లంతా ఔటైన ఈ పరిస్థితుల్లో ఆ జట్టు మరో 15 పరుగులు చేసినా గొప్పే. కానీ, బెంగళూరు పేలవ బౌలింగ్‌తో ఢిల్లీ నెత్తిన పాలు పోసింది. రూథర్‌ఫర్డ్, అక్షర్‌ పటేల్‌ వంటి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేక ఆఖరి మూడు ఓవర్లలో ఏకంగా 46 పరుగులు సమర్పించుకుంది. ఆ తర్వాత క్రమంగా నెమ్మదిస్తున్న పిచ్‌పై పార్థివ్‌ ఎంత బాగా ఆడినా ఛేదన కష్టమైపోయింది.

దీనికితోడు కీలక సమయంలో కోహ్లి, డివిలియర్స్‌ వైఫల్యం బెంగళూరును దెబ్బతీసింది. అప్పటికీ 24 బంతుల్లో 52 పరుగులు అవసరమైన స్థితిలో ఇషాంత్‌ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌ సహా గురుకీరత్‌ 16 పరుగులు రాబట్టాడు. కానీ, తదుపరి ఓవర్‌లో రబడ యార్కర్‌ లెంగ్త్‌ బంతులతో 6 పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్లో ఇషాంత్‌ 4 పరుగులే ఇచ్చి గురుకీరత్‌ను అవుట్‌ చేయడంతో పరాజయం ఖాయ మైపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement