టీ20 ప్రపంచకప్.. వన్డేప్రపంచకప్.. చాంపియన్స్ ట్రోఫి..అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.. టెస్టులు.. వన్డేలు..టీ20ల్లో కలిపి అత్యధికంగా 331 మ్యాచ్‌ల్లో జట్టుకు నేతృత్వం వహించిన ఏకైక నాయకుడు. అర్జునుడి రథానికి కృష్ణుడిలా.. అతిరథ మహారథుల బృందానికి నాయకుడిగా విజయాలందించిన మహేంద్రుడి ప్రస్థానానికి నేటికి సరిగ్గా 13 ఏళ్లు.. ఈ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.!
మారుమూల చిన్న పట్టణం.. దిగువ మధ్యతరగతి కుటుంబం.. కావల్సినంత ప్రతిభ.. అవకాశాలు పరిమితం.. కష్టాలు.. అపరిమితం.. కుటుంబ బాధ్యతలు.. తండ్రి పడుతున్న కష్టాలు.. క్రికెట్ కెరీర్ కొనసాగించాలా.. ఉద్యోగంలో కొనసాగాలా.. ఇలాంటి పరిస్థితి నుంచి భారతీయ క్రికెట్‌లో తారజువ్వలా దూసుకొచ్చాడు.. రాంచీ ఆటగాడు..!
13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు (డిసెంబర్ 23, 2004) బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. చిట్టగాంగ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో.. మైదానంలోకి దిగాడు ధోని.. ఎదుర్కొన్న తొలి బంతికే అవతల ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌తో సమన్వయ లోపం వల్ల రనౌట్‌గా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. తరువాతి మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 23 పరుగులే చేశాడు. అనంతరం తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని వైజాగ్‌లో పాకిస్థాన్‌పై తొలి సెంచరీ సాధించాడు. ఆనాటి నుంచి నేటి వరకు ధోనికి తిరుగులేదు. ఎన్ని విమర్శలొచ్చిన నోటితో కాకుండా బ్యాట్‌తోనే బదులిచ్చాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. యువ ఆటగాళ్లకు అండగా ఉంటూ.. పెదన్నలా వ్యవహిరిస్తున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ కోహ్లి.. వైస్ కెప్టెన్ రోహిత్ అయినా.. క్లిష్ట పరిస్థితిల్లో కెప్టెన్సీ వహించేది ధోనినే అని అందరికి తెలిసిన విషయమే.
♦ కెప్టెన్‌గా ధోని..
తొలి టీ20 ప్రపంచకప్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆరంభించిన ధోని.. సారథిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని సారథ్యంలో భారత్ 2007లో టీ20 ప్రపంచకప్, 2010 ఆసియా కప్, 2011 వన్డే ప్రపంచకప్.. 2013 ఛాంపియన్స్ ట్రోఫి.. 2016 ఆసియా కప్‌లు గెలుచుకుంది. టీమిండియాకు ఎన్నో ఘనతలు అందించడం సారథిగా ఎన్నో రికార్డులు నెలకొల్పడంలో ధోనిది భిన్నమైన శైలి. చివరికి విడ్కోలు పలకడంలోనూ అతని దారే వేరు. 2014లో ఊహించని విధంగా టెస్టులకు వీడ్కోలు చెప్పిన ధోని.. ఈ ఏడాది చడీచప్పుడు కాకుండా వన్డే, టీ20 జట్టు సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు.
- అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన తొలి భారతీయ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని.
- అత్యధిక వన్డేలకు కెప్టెన్సీ చేసిన వారిలో ఆస్ట్రేలియా ఆటగాడు పాంటింగ్(230), న్యూజిలాండ్ ఫేమింగ్ (218)ల తర్వాతి స్థానం ధోని(199)దే.
- అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా ధోని(331)నిలిచాడు.
- కెప్టెన్‌గా అత్యధిక టీ20(72)లు ఆడిన .. అత్యధిక టీ20లు (41) గెలిచిన ఆటగాడు కూడా ధోనినే.
- 2009లో ధోని నాయకత్వంలో తొలిసారిగా భారత్ టెస్టుల్లో నెం.1 గా నిలిచింది.
♦ వికెట్ కీపర్‌గా ..
మహేంద్ర సింగ్ ధోని కీపర్‌గా ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. అతను వికెట్ల వెనుక ఉంటే ఏ బ్యాట్స్‌మెన్ క్రీజు దాటాలన్నా ఓసారి ఆలోచించాల్సిందే. 90 టెస్టులాడిన ధోని కీపర్‌గా 256 అవుట్లలో పాలుపంచుకొని ఈ ఫార్మట్‌లో ఐదో కీపర్‌గా గుర్తింపు పొందాడు. ఇందులో 256 క్యాచ్‌లు ఉండగా 38 స్టంప్ అవుట్‌లున్నాయి. ఇక వన్డేల్లోనైతే ఏకంగా 294 అవుట్లలో 105 స్టంపింగ్స్ ఉండటం విశేషం. దీంతో అత్యధిక స్టంప్ అవుట్‌లు చేసిన తొలి కీపర్‌గా రికార్డుకెక్కాడు. ఇక టీ20 ల్లో 47 అవుట్లలో 29 స్టంపింగ్‌లున్నాయి.
♦ ధోని పరుగులు..
90 టెస్టుల్లో 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలతో 4,876 పరుగులు చేశాడు.
312 వన్డేల్లో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలతో 9,898 పరుగులు చేసి 10 వేల క్లబ్‌లో చేరడానికి 102 పరుగుల దూరంలో ఉన్నాడు.
85 టీ20ల్లో 1 హాఫ్ సెంచరీతో 1,348 పరుగులు చేశాడు.
రనౌట్‌తో ధోని అరంగ్రేటం!
Comments
Please login to add a commentAdd a comment