
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌కు దక్షిణాఫ్రికాకు వెళ్లే సమయంలో అనూహ్య ఘటన ఎదురైంది. దుబాయ్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ధావన్ కుటుంబ సభ్యులను అడ్డుకున్నారు. అతని భార్య, పిల్లల గుర్తింపు కోసం బర్త్ సర్టిఫికెట్‌తో పాటు ఇతర డాక్యుమెంట్‌లు చూపించాల్సిందిగా కోరారు. దాంతో సర్టిఫికెట్లు వచ్చే వరకు వారిని అక్కడే ఉంచి ధావన్ జట్టుతో పాటు దక్షిణాఫ్రికా వెళ్లిపోవాల్సి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో ధావన్ తన ఆగ్రహాన్ని ప్రకటించాడు.
‘ఎమిరేట్స్ సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. కేప్‌టౌన్ ఫ్లయిట్ ఎక్కే సమయంలో నా కుటుంబ సభ్యులు ప్రయాణించడానికి వీల్లేదని వారు చెప్పారు. నా భార్యా పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర డాక్యుమెంట్లు చూపించమన్నారు. మేం వాటిని వెంట తీసుకుపోలేదు. దాంతో డాక్యుమెంట్ల కోసం ఎదురు చూస్తూ వారు ఇంకా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నారు. అలాంటివి అవసరం అని భావిస్తే మేం ముంబైలో ఫ్లయిట్ ఎక్కే సమయంలోనే అధికారులు చెప్పాలి కదా. కారణం లేకుండా ఎమిరేట్స్ ఉద్యోగి ఒకరు దురుసుగా ప్రవర్తించాడు’ అని ధావన్ ఆక్రోశించాడు.
Comments
Please login to add a commentAdd a comment