పుణె:ఈ ఐపీఎల్ సీజన్లో కొత్తగా వచ్చిన పుణె సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లు మరో పోరుకు సన్నద్ధమయ్యాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శుక్రవారం రాత్రి గం.8.00లకు ఇరు జట్లు మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడగా, అందులో గుజరాత్ లయన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆ లెక్క సరి చేయాలని మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని పుణె భావిస్తుండగా, గత ఫలితాన్ని పునరావృతం చేయాలని సురేష్ రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ యోచిస్తోంది.
మరోవైపు పుణె జట్టు నుంచి డు ప్లెసిస్ వైదొలగడం ఆ జట్టుకు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ఉస్మాన్ ఖాజాతో భర్తీ చేయనున్నా అతను ఎంతవరకూ ఆడతాడు అనేది వేచిక చూడక తప్పదు. ఇదిలా ఉండగా, గుజరాత్ లయన్స్ జట్టు ఇన్నింగ్స్ ను దాటిగా ఆరంభిస్తున్న బ్రెండన్ మెకల్లమ్, డ్వేన్ స్మిత్లపైనే పుణె ప్రధానంగా దృష్టి సారించనుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ జరిగిన గత మ్యాచ్ లో మెకల్లమ్, స్మిత్లు సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసి గుజరాత్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఈ జోడీ కుదురుకుంటే మాత్రం పుణె కష్టాలు తప్పకపోవచ్చు. కాగా, వరుస ఓటములతో ఢీలా పడిన పుణెకు సన్ రైజర్స్ పై గెలుపు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ విజయంలో ఆర్పీ సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అశోక్ దిండాదే ప్రధాన పాత్ర. ఈ ఆటగాళ్లు ఆయా జట్లలో కీలకంగా మారడంతో మరో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది.
జట్లు అంచనా
పుణె సూపర్ జెయింట్స్:
ఎంఎస్ ధోని(కెప్టెన్), అజింక్యా రహానే, ఉస్మాన్ ఖాజా, స్టీవ్ స్మిత్, భాటియా, సౌరభ్ తివారీ, మిచెల్ మార్ష్,రవి చంద్రన్ అశ్విన్, పెరీరా, మురుగన్ అశ్విన్, అశోక్ దిండా
గుజరాత్ లయన్స్:
సురేష్ రైనా(కెప్టెన్), డ్వేన్ స్మిత్, బ్రెండన్ మెకల్లమ్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా,ఇషాన్ కిషన్, డ్వేన్ బ్రేవో, ఫాల్కనర్, ప్రవీణ్ కుమార్, లడ్డా, సంగ్వాన్