pune super giants
-
హోరాహోరీ.. పుణే గెలుపు
ఐపీఎల్-10 సీజన్‌ను పుణే సూపర్ జెయింట్స్ ఘనవిజయంతో ప్రారంభించింది. టాస్ గెలిచిన పుణే బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 184/8 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్మన్లలో హర్ధిక్ పాండ్యా 20వ ఓవర్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన పుణే ఆది నుంచి లక్ష్యం దిశగా సాగింది. పుణే ఓపెనర్ అజింక్యా రహానే 60(34) సమయోచిత ఇన్నింగ్స్‌కు తోడు స్టీవ్ స్మిత్ 84(51) నాటౌట్ కెప్టెన్ ఇన్నింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇన్నింగ్స్ మరో బంతి మిగిలివుండగానే 187/3తో గెలుపొందింది. పుణే బౌలర్లలో ఇమ్రాన్ తహీర్కు మూడు వికెట్లు దక్కగా, రజత్ భాటియాకు రెండు వికెట్లు దక్కాయి. ముంబై బౌలర్లలో టిమ్ సౌథీ, హర్ధిక పాండ్యా, మిచెల్ మెక్క్లెనాగన్లకు తలా ఓ వికెట్ దక్కింది. -
విరాట్ గ్యాంగ్ వర్సెస్ ధోని సేన?
హూస్టర్: మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణె సూపర్ జెయింట్ జట్లు తలపడబోతున్నాయా?అంటే కొంత వరకూ అవుననే సమాధానమే వస్తుంది. అయితే ఐపీఎల్ నుంచి పుణె సూపర్ జెయింట్స్ నిష్క్రమిస్తే ఎలా బెంగళూరుతో తలపడుతుంది? అనే సందేహం రాక తప్పదు. అయితే ఈ రెండు జట్లు పోటీ పడేది ఐపీఎల్లో కాదులెండి. అమెరికాలో ఈ ఏడాది నిర్వహించే ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ల్లో ఆర్సీబీ, పుణె జట్లు పాల్గొనబోతున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. అమెరికాలో క్రికెట్ మార్కెట్ ను పరీక్షించేందుకు ఎగ్జిబిషన్ మ్యాచ్ లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మ్యాచ్ ల నిర్వహణకు హూస్టన్‌ను తాత్కాలిక వేదికగా అనుకున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఆదివారం బెంగళూరులో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందుకు దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, భారత క్రికెట్ జట్టు వరుసగా జింబాబ్వే, వెస్టిండీస్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ సిరీస్ ల తరువాత మాత్రమే ఎగ్జిబిషన్ మ్యాచ్ ల షెడ్యూల్ ను ఖరారు చేస్తారు. భారత క్రికెట్ జట్టు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో ఈ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లపై ముంబై ఇండియన్స్ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. -
ధోని రెచ్చిపోయాడు..
విశాఖ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో పుణె సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది. శనివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అద్వితీయంగా ఆడి జట్టుకు మరపురాని గెలుపును అందించాడు. చివరి ఓవర్ లో పుణె విజయానికి 23 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని రెచ్చిపోయాడు. మూడు సిక్సర్లు, ఒక ఫోర్ తో 22 పరుగులు చేసి పుణెకు విజయాన్ని అందించాడు. తొలి బంతికి పరుగేమీ రాకపోగా, రెండో బంతి వైడ్ అయ్యింది. దీంతో పుణె విజయానికి నాలుగు బంతుల్లో 22 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ తరుణంలో మ్యాచ్ విన్నర్ గా పేరుగాంచిన ధోని విశ్వరూపం ప్రదర్శించాడు. రెండో బంతిని సిక్స్ కొట్టిన ధోని, మూడో బంతిని కూడా అంతే వేగంగా కొట్టాడు. అయితే ఆ బంతిని పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా అడ్డుకోవడంతో పరుగు రాలేదు. ఇక నాల్గో బంతిని ఫోర్ కొట్టగా, ఐదు, ఆరు బంతుల్ని సిక్స్ లుగా మలచడంతో పుణె అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రమే అయినా, ధోని ఆడిన తీరు ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో ధోని(64 నాటౌట్;32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోవడంతో పుణె నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(30), మురళీ విజయ్(59)లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడీ 60 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన అనంతరం ఆమ్లా తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం సాహా(3) విఫలమైనా, గుర్ కీరత్ సింగ్(51) రాణించడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పుణె జట్టులో అజింక్యా రహానే(19), ఉస్మాన్ ఖాజా(30)లు ఫర్వాలేదనిపించారు. ఆపై జార్జ్ బెయిలీ(9), సౌరభ్ తివారీ(17) లు విఫలమయ్యారు. ఆ పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోని జట్టును ఆదుకున్నాడు. తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న ధోని.. చివరి వరకూ క్రీజ్ లో పుణెకు విజయాన్ని సాధించిపెట్టాడు. పంజాబ్ బౌలర్ అక్షర్ పటేల్ వేసిన చివరి ఓవర్ లో ధోని విశేషంగా రాణించి పూర్వపు ఫామ్ ను అందుకున్నాడు. -
పుణె విజయలక్ష్యం 173
విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(30), మురళీ విజయ్(59)లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడీ 60 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన అనంతరం ఆమ్లా తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం సాహా(3) విఫలమైనా, గుర్ కీరత్ సింగ్(51) రాణించడంతో పంజాబ్ ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. పుణె బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, జంపా, తిషారా పెరీరా, అశోక్ దిండాలకు తలో వికెట్ దక్కింది. -
'టీ 20లో ఆ చెత్త రూల్‌ను మార్చండి'
కోల్‌కతా:అంతర్జాతీయ క్రికెట్లో వర్షం కారణంగా మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే డక్ వర్త్ లూయిస్ పద్ధతిపై పుణె సూపర్ జెయింట్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మండిపడ్డాడు. మ్యాచ్ ను ఉన్నపళంగా కుదించే ఈ పద్ధతి నిజంగా పనికిమాలినదిగా అభివర్ణించాడు. కనీసం పొట్టి ఫార్మాట్లోనైనా డక్ వర్త్ లూయిస్ పద్ధతికి చరమగీతం పాడాలని ఫ్లెమింగ్ డిమాండ్ చేశాడు. 'డక్‌వర్త్ లూయిస్ పద్ధతి పనికిమాలినది. ఎప్పుడైతే డక్ వర్త్ లూయిస్‌కు వెళ్లామో అప్పుడే మ్యాచ్ దాదాపు వన్ సైడ్ అయిపోతుంది. ఇదే విషయాన్నికొన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నా ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. కనీసం టీ 20ల్లోనైనా వర్షం వల్ల మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే ప్రస్తుత డక్ వర్త్ లూయిస్ పద్ధతిని మార్చండి' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. శనివారం కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్స్ డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీనిపై ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. డక్ వర్త్ లూయిస్ వల్లే తాము పరాజయం చెందినట్లు పేర్కొన్నాడు. పిచ్ టర్న్ అవుతున్న కారణంగానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నామన్నాడు. ఈ వికెట్‌పై 135 పరుగులను ఛేదించడం చాలా కష్టమని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు. అయితే తమ ఇన్నింగ్స్ చివర్లో ఉండగా వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ అమలు చేయడంతో పూర్తిగా ఆడకుండానే ఓటమి చెందామన్నాడు. ఎప్పుడైతే డక్ వర్త్‌కు వెళ్లామో అప్పుడే మ్యాచ్ దాదాపు ముగిసి పోవడం ఎంతవరకూ సరైన పద్ధతని ఫ్లెమింగ్ ప్రశ్నించాడు. -
కోహ్లి 'శత'క్కొట్టుడు
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. పుణె సూపర్ జెయింట్స్ జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి అజేయ శతకంతో చెలరేగి ఆడటంతో బెంగళూరు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ గా వచ్చిన కోహ్లి(108 నాటౌట్; 58 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తో చివర వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును విజయపథంలో నడిపించాడు. తద్వారా ఈ ఐపీఎల్ సీజన్ లో రెండో శతకాన్ని కోహ్లి నమోదు చేశాడు. దీంతో పాటు ఐపీఎల్లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్ గా కోహ్లి నిలిచాడు. పుణె విసిరిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన బెంగళూరు ఆది నుంచి దూకుడుగా ఆడింది. కోహ్లికి జతగా కేఎల్ రాహుల్(38;35 బంతుల్లో 1 ఫోర్, 2సిక్సర్లు)రాణించి శుభారంభాన్ని అందించాడు. అనంతరం ఏబీ డివిలియర్స్(1) విఫలమైనా, షేన్ వాట్సన్(36;13 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడి బెంగళూరు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.చివరి రెండుఓవర్లలో 22 పరుగులు చేయాల్సి తరుణంలో విరాట్ దూకుడుగా ఆడాడు. ఈ పరుగులను సాధించే క్రమంలో విరాట్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో విరాట్ 21 పరుగులను సాధించి మ్యాచ్‌ను ఇంకా మూడు బంతులుండగానే ముగించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పుణె నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. పుణె ఆదిలోనే ఉస్మాన్ ఖాజా(16) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం అజింక్యా రహానే(74; 48బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్సర్లు), సౌరభ్ తివారీ(52 ; 39 బంతుల్లో 9 ఫోర్లు) రాణించడంతో పుణె భారీ స్కోరు చేసింది. -
దుమ్మురేపిన రహానే
బెంగళూరు: పుణె సూపర్ జెయింట్స్ ఆటగాడు అజ్యింకా రహానే మరోసారి దుమ్మురేపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రహానే(74; 48బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్సర్లు) అదరగొట్టాడు. మరోవైపు సౌరభ్ తివారీ(52 ; 39 బంతుల్లో 9 ఫోర్లు) కూడా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పుణె 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణె ఆదిలోనే ఉస్మాన్ ఖాజా(16) వికెట్‌ను కోల్పోయింది. ఈ తరుణంలో రహానేకు జత కలిసిన తివారీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో తివారీ తొలుత హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై వెంటనే రహానే అర్థ శతకం సాధించాడు. ఈ జోడి 106 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చిన అనంతరం తివారీ రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో కెప్టెన్ మహేంద్ర సింగ్(9)మూడో వికెట్ గా అవుటయ్యాడు. అయితే పెరీరా-రహానాలు స్కోరును పెంచే క్రమంలో వరుసగా అవుట్ కావడంతో పుణె 171 పరుగుల వద్ద ఐదో వికెట్ ను నష్టపోయింది. ఆపై జార్జ్ బెయిలీ డకౌట్ గా వెనుదిరిగినా, రవి చంద్రన్ అశ్విన్(10నాటౌట్;5 బంతుల్లో 1 సిక్స్), భాటియా(9 నాటౌట్;4 బంతుల్లో 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో షేన్ వాట్సన్ మూడు వికెట్లు సాధించగా, చాహాల్,జోర్డాన్లకు తలో వికెట్ దక్కింది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది. ఇప్పటివరకూ పుణె తొమ్మిది మ్యాచ్‌లాడి మూడు గెలవగా, బెంగళూరు ఏడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచింది. -
ఢిల్లీ బౌలింగ్ అద్భుతం: ధోనీ
సీజన్ ఆరంభం నుంచి నిలకడలేమితో అష్టకష్టాలు పడుతున్న పుణే సూపర్ జెయింట్స్ మూడో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడాడు. ఢిల్లీ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని పొగిడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా అమిత్ మిశ్రా, ఇమ్రాన్ తాహిర్ చాలా చక్కని బంతులతో తమ బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించాడు. బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. పటిస్టమైన ఢిల్లీని కేవలం 162 పరుగులకే పరిమితం చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ వల్లే గెలిచామని అభిప్రాయపడ్డాడు. మధ్య ఓవర్లలో బ్యాటింగ్ కాస్త మాములుగా అనిపించినా వెంటనే కుదురుకుని విజయాన్ని సాధించామని చెప్పాడు. ఈ విజయంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది ధోనీ పరిస్థితి. వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తూ టైటిల్ రేసులో దాదాపు అన్ని సీజన్లలో నిలిచే మహేంద్ర సింగ్ ధోనీ పరిస్థితి ప్రస్తుతం అలా కనపడటం లేదు. గురువారం ఢిల్లీపై నెగ్గి ఈ సీజన్లో ధోనీ నేతృత్వంలోని పుణే మూడో విజయం సొంతం చేసుకుంది. స్టార్ ఆటగాళ్లు గాయాలతో టోర్నీ నుంచి వైదొలగడం, తరచూ మార్పులతో ఓటములు పుణేను వెంటాడాయి. అయితే డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో రహానే నిలకడ కొనసాగించడంతో ఢిల్లీపై నెగ్గి సీజన్లో మూడో విజయం సొంతం చేసుకుని ధోనికి కాస్త ఊరట కలిగించినట్లయింది. -
ధోనిసేన గెలిచిందోచ్!
► ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై నెగ్గిన పుణే సూపర్ జెయింట్స్ ► రాణించిన రహానే సీజన్ ఆరంభం నుంచి నిలకడలేమి... గాయాలతో స్టార్ క్రికెటర్లు దూరం... జట్టులో అనేక మార్పులు... అంతా గందరగోళం... ఇలాంటి స్థితిలో ఉన్న పుణే సూపర్ జెయింట్స్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. జట్టులో కొత్తగా చేరిన క్రికెటర్లు రాణించడంతో పాటు... రహానే నిలకడ కొనసాగించడంతో ఢిల్లీపై నెగ్గి సీజన్లో మూడో విజయం సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ: యువ క్రికెటర్ల రాణింపుతో సంచలన విజయాలు సాధిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జోరుకు పుణే సూపర్ జెయింట్స్ బ్రేక్ వేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ధోనిసేన ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. టాస్ గెలిచిన పుణే ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. డుమిని (32 బంతుల్లో 34; 1 ఫోర్), కరుణ్ నాయర్ (23 బంతుల్లో 32; 5 ఫోర్లు) రాణించారు. పుణే బౌలర్లలో బోలాండ్, భాటియా రెండేసి వికెట్లు తీసుకున్నారు. పుణే జట్టు 19.1 ఓవర్లలో మూడు వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ రహానే (48 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయంగా అర్ధసెంచరీ చేయగా... తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఖవాజా (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ధోని (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తలా ఓ చేయి... గత మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన పంత్ (2) ఈసారి విఫలం కావడంతో ఆరంభంలోనే ఢిల్లీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే సంజు శామ్సన్ (17 బంతుల్లో 20; 3 ఫోర్లు), కరుణ్ నాయర్ రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించి పరిస్థితిని సరిదిద్దారు. డుమిని, బిల్లింగ్స్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే పుణే బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో ఢిల్లీని నియంత్రించే ప్రయత్నం చేశారు. బ్రాత్‌వైట్ (8 బంతుల్లో 20) మూడు భారీ సిక్సర్లతో చెలరేగడంతో మ్యాచ్‌లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగినా... ఆరు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి పుణే బౌలర్లు కట్టడి చేశారు. చివరి ఓవర్లో నెగి (12 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) చెలరేగడంతో ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోరు లభించింది. రాణించిన టాపార్డర్ కొత్తగా జట్టుతో చేరిన ఖవాజా కుదురుకునేందుకు సమయం తీసుకోగా... ఫామ్‌లో ఉన్న పుణే ఓపెనర్ రహానే పవర్‌ప్లేలో చెలరేగి ఆడాడు. క్రమంగా ఖవాజా కూడా బ్యాట్ ఝళిపించడంతో పవర్‌ప్లేలో పుణే వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. మిశ్రా బౌలింగ్‌లో ఖవాజా అవుటయ్యాక... సౌరవ్ తివారీ (18 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్సర్) సాయంతో రహానే ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించాక తివారీ అవుటయ్యాడు. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలబడ్డ రహానే 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ధోని భారీ సిక్సర్‌తో ఫామ్‌లో కనిపించాడు. పుణే విజయానికి 18 బంతుల్లో 37 పరుగులు అవసరమైన దశలో... షమీ బౌలింగ్‌లో ధోని వరుసగా ఫోర్, సిక్సర్ కొట్టడంతో ఒకే ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్ తొలి బంతికి ధోని భారీ షాట్ ఆడినా... బిల్లింగ్స్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. పెరీరా (5 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్సర్లు) రెండు భారీ సిక్సర్లు బాది... ఎలాంటి నష్టం జరగకుండా పుణే విజయాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: రిషబ్ పంత్ (బి) దిండా 2; శామ్సన్ (సి) ఆర్. అశ్విన్ (బి) బోలాండ్ 20; కరుణ్ నాయర్ (సి) పెరీరా (బి) భాటియా 32; డుమిని రనౌట్ 34; బిల్లింగ్స్ (సి) రహానే (బి) భాటియా 24; బ్రాత్‌వైట్ (సి) పెరీరా (బి) బోలాండ్ 20; పవన్ నెగి నాటౌట్ 19; జయంత్ రనౌట్ 1; షమీ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1-13; 2-48; 3-65; 4-110; 5-137; 6-138; 7-143. బౌలింగ్: దిండా 4-0-34-1; పెరీరా 1-0-9-0; బోలాండ్ 4-0-31-2; ఆర్.అశ్విన్ 4-0-34-0; భాటియా 4-0-22-2; ఎం.అశ్విన్ 3-0-31-0. పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే నాటౌట్ 63; ఖవాజా (స్టం) శామ్సన్ (బి) మిశ్రా 30; సౌరవ్ తివారీ (సి) బిల్లింగ్స్ (బి) తాహిర్ 21; ధోని (సి) బిల్లింగ్స్ (బి) తాహిర్ 27; పెరీరా నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.1 ఓవర్లలో మూడు వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1-59; 2-104; 3-146. బౌలింగ్: జయంత్ 4-0-25-0; బ్రాత్‌వైట్ 2-0-17-0; షమీ 3.1-0-50-0; అమిత్ మిశ్రా 4-0-28-1; డుమిని 1-0-9-0; తాహిర్ 4-0-26-2; నెగి 1-0-10-0. -
పుణె విజయలక్ష్యం 163
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గురువారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో పుణె సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణె ఆదిలోనే రిషబ్ పంత్(2)వికెట్ ను కోల్పోయింది. అనంతరం సంజూ శాంసన్(20), కేకే నాయర్(32), జేపీ డుమినీ(34), బిల్లింగ్స్ (24), బ్రాత్ వైట్(20), నేగీ(19నాటౌట్) ఇలా తలో చేయి వేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.పుణె బౌలర్లలో పెరీరా, భాటియాలు తలో రెండు వికెట్లు సాధించారు. -
ఫీల్డింగ్ ఎంచుకున్న పుణె
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా గురువారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలుత ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఢిల్లీ ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదింట గెలవగా, పుణె ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే నెగ్గింది. ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్ ప్లేస్‌లోకి చేరాలని ఢిల్లీ అండ్ గ్యాంగ్ భావిస్తుండగా, వరుస మ్యాచ్ ల్లో ఓటమితో ఢీలా పడిన పుణె కనీసం ఈ మ్యాచ్ లోనైనా గెలుపుతో గాడిలో పడాలని యోచిస్తోంది. -
ముంబై విజయలక్ష్యం 160
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఆదివారం ఇక్కడ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణె 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పుణెకు ఆదిలోనే అజింక్యా రహానే(4) వికెట్ ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ సౌరభ్ తివారీ(57;45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేశాడు. అతనికి స్టీవ్ స్మిత్(45;23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చక్కటి సహకారం అందించడంతో పుణె స్కోరు పరుగులు పెట్టింది. ఈ ఇద్దరూ చెలరేగి ఆడటంతో పుణె 9.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఆ తరువాత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(24) కాస్త ఫర్వాలేదనిపించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బూమ్రా మూడు వికెట్లు సాధించగా, మెక్లీన్ గన్, హర్భజన్ సింగ్‌లకు తలో వికెట్ దక్కింది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ముంబై ఎనిమిది మ్యాచ్‌లాడి నాలుగు విజయాలు సాధించగా, పుణె ఆరు మ్యాచ్ లాడి రెండింట మాత్రమే నెగ్గింది. .అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పుణె విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
పుణెకు మరో ఎదురుదెబ్బ
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పేలవ ప్రదర్శనతో వెనుకబడిన పుణె సూపర్ జెయింట్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పుణె ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. మిచెల్ మార్ష్ తొడ కండరాలు పట్టేయడంతో ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే ఇద్దరు పుణె ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, డు ప్లెసిస్ లు గాయాల బారిన పడి టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. పీటర్సన్ కాలిపిక్క గాయంతో టోర్నీనుంచి తప్పుకోగా, డు ప్లెసిస్ చేతి వేలు విరగడంతో జట్టు నుంచి వైదొలిగాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన ధోని అండ్ గ్యాంగ్ రెండింట మాత్రమే విజయం సాధించి చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. -
చెలరేగిన స్టీవ్ స్మిత్
పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా శుక్రవారం గుజరాత్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్స్ ఆటగాడు స్టీవ్ స్మిత్ చెలరేగిపోయాడు. స్మిత్(101; 54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేశాడు. అతనికి జతగా అజ్యింకా రహానే(53;45 బంతుల్లో 5ఫోర్లు) రాణించడంతో పుణె సూపర్ జెయింట్స్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణె సూపర్ జెయింట్స్ ఆదిలోనే సౌరభ్ తివారీ(1) వికెట్ ను రనౌట్ రూపంలో కోల్పోయింది.అనవసరపు పరుగు కోసం యత్నించిన తివారీని రైనా రనౌట్ చేయడంతో పుణె 13 పరుగుల వద్దే తొలి వికెట్ ను నష్టపోయింది. ఆ సమయంలో రహానేకు జతకలిసిన స్మిత్ రెచ్చిపోయాడు. ఈ జోడి 111 పరుగులను జత చేయడంతో పుణె పటిష్టస్థితికి చేరింది. ఈ క్రమంలోనే స్మిత్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును చేరగా, రహానే 43 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అయితే రహానే హాఫ్ సెంచరీ చేసిన స్వల్ప వ్యవధిలోనే రనౌట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, స్మిత్ మాత్రం అదే దూకుడును కొనసాగించి సెంచరీ సాధించాడు.దీంతో టీ 20ల్లో స్మిత్ తొలి సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(30 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్సర్లు) ఆకట్టుకోవడంతో పుణె నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. మ్యాచ్ విశేషాలు.. ఏ వికెట్‌కైనా రహానే-స్మిత్‌లు నమోదు చేసిన 111 పరుగుల భాగస్వామ్యమే పుణె కు అత్యుత్తమం. ఐపీఎల్లో స్మిత్ అంతకుముందు నమోదు చేసిన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 79 కాగా,టీ 20ల్లో అతని బెస్ట్ 90 ఈ ఐపీఎల్లో పుణె నమోదు చేసిన 193 పరుగులు రెండో అత్యుత్తమం. అంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (227) చేసిన స్కోరే అత్యధికం. -
ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్
పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా శుక్రవారం ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా తొలుత ధోని సేనను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఇరు జట్లు ఆరు మ్యాచ్‌లు ఆడగా గుజరాత్ ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పుణె రెండు మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది. అంతకుముందు ఇరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ధోని సేన లెక్క సరిచేసేనా?
పుణె:ఈ ఐపీఎల్ సీజన్లో కొత్తగా వచ్చిన పుణె సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లు మరో పోరుకు సన్నద్ధమయ్యాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శుక్రవారం రాత్రి గం.8.00లకు ఇరు జట్లు మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడగా, అందులో గుజరాత్ లయన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆ లెక్క సరి చేయాలని మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని పుణె భావిస్తుండగా, గత ఫలితాన్ని పునరావృతం చేయాలని సురేష్ రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ యోచిస్తోంది. మరోవైపు పుణె జట్టు నుంచి డు ప్లెసిస్ వైదొలగడం ఆ జట్టుకు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ఉస్మాన్ ఖాజాతో భర్తీ చేయనున్నా అతను ఎంతవరకూ ఆడతాడు అనేది వేచిక చూడక తప్పదు. ఇదిలా ఉండగా, గుజరాత్ లయన్స్ జట్టు ఇన్నింగ్స్ ను దాటిగా ఆరంభిస్తున్న బ్రెండన్ మెకల్లమ్, డ్వేన్ స్మిత్‌లపైనే పుణె ప్రధానంగా దృష్టి సారించనుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ జరిగిన గత మ్యాచ్ లో మెకల్లమ్, స్మిత్‌లు సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసి గుజరాత్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఈ జోడీ కుదురుకుంటే మాత్రం పుణె కష్టాలు తప్పకపోవచ్చు. కాగా, వరుస ఓటములతో ఢీలా పడిన పుణెకు సన్ రైజర్స్ పై గెలుపు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ విజయంలో ఆర్పీ సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అశోక్ దిండాదే ప్రధాన పాత్ర. ఈ ఆటగాళ్లు ఆయా జట్లలో కీలకంగా మారడంతో మరో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. జట్లు అంచనా పుణె సూపర్ జెయింట్స్: ఎంఎస్ ధోని(కెప్టెన్), అజింక్యా రహానే, ఉస్మాన్ ఖాజా, స్టీవ్ స్మిత్, భాటియా, సౌరభ్ తివారీ, మిచెల్ మార్ష్,రవి చంద్రన్ అశ్విన్, పెరీరా, మురుగన్ అశ్విన్, అశోక్ దిండా గుజరాత్ లయన్స్: సురేష్ రైనా(కెప్టెన్), డ్వేన్ స్మిత్, బ్రెండన్ మెకల్లమ్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా,ఇషాన్ కిషన్, డ్వేన్ బ్రేవో, ఫాల్కనర్, ప్రవీణ్ కుమార్, లడ్డా, సంగ్వాన్ -
పుణే సూపర్ విక్టరీ
32 పరుగులకే కూలిన 5 వికెట్లు... ఒక దశలో 48 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా లేకపోవడం... హైదరాబాద్ బలహీన బ్యాటింగ్ ప్రదర్శనకు ఇది నిదర్శనం. ఫలితంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్టుకు బ్రేక్ పడింది. ధావన్ ఒంటరి పోరు మినహా ఇతర ఆటగాళ్ల నుంచి కనీస ప్రదర్శన లేకపోవడంతో సొంతగడ్డపై వార్నర్ సేనకు పరాభవం ఎదురైంది. ముందుగా బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శన, ఆ తర్వాత స్మిత్ సాధికారిక బ్యాటింగ్ కలగలిసి పుణేకు కొంత విరామం తర్వాత విజయం రుచి చూపించాయి. పరాజయాల పరంపరతో తీవ్ర ఒత్తిడిలో పడిన ధోని సేన ఎట్టకేలకు ఉప్పల్‌లో ఊపిరి పీల్చుకుంది. * 34 పరుగులతో సన్‌రైజర్స్ చిత్తు * రాణించిన బౌలర్లు, స్మిత్ సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్ వైఫల్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో పరాజయాన్ని మూటగట్టుకుంది. మంగళవారం ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ 34 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (53 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేసే సమయానికి పుణే 11 ఓవర్లలో 3 వికెట్లకు 94 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 46 నాటౌట్; 7 ఫోర్లు), డు ప్లెసిస్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 50 బంతుల్లోనే 80 పరుగులు జత చేశారు. పుణే బౌలర్ అశోక్ దిండాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ఆదుకున్న ధావన్... గత మూడు మ్యాచ్‌లలో ఛేదనలో అద్భుతాలు చేసిన సన్‌రైజర్స్ ఈసారి తొలుత బ్యాటింగ్ చేస్తూ పూర్తిగా తడబడింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ వార్నర్ విఫలమైతే ఒక్కసారిగా ఎలా కుప్పకూలుతుందో ఈ మ్యాచ్ చూపించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వార్నర్ (0)ను అవుట్ చేసి అశోక్ దిండా దెబ్బ తీశాడు. ఆ తర్వాత క్యూ కట్టినట్లు ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఒకరి వెనక మరొకరు వెనుదిరిగారు. మూడో స్థానంలో వచ్చిన తారే (14 బంతుల్లో 8; 1 ఫోర్) ప్రభావం చూపించలేకపోగా, మోర్గాన్ (0), హుడా (1), హెన్రిక్స్ (1) విఫలమయ్యారు. అయితే మరోవైపు రైజర్స్ జట్టు తరఫున అదృష్టవశాత్తూ ధావన్ నిలబడ్డాడు. ఆరంభంలో పరిస్థితిని బట్టి జాగ్రత్తగా ఆడిన ధావన్, ఆ తర్వాత మరింత బాధ్యతతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కొంతవరకు నమన్ ఓజా (21 బంతుల్లో 18; 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 51 బంతుల్లో 47 పరుగులు జోడించారు. 41 పరుగుల వద్ద రహానే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ధావన్, 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. చివర్లో భువనేశ్వర్ (8 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో సన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కీలక భాగస్వామ్యం... పుణే ఇన్నింగ్స్‌కు కూడా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి రహానే (0) అవుటయ్యాడు. అయితే స్మిత్, డు ప్లెసిస్ కలిసి జెయింట్స్‌ను నడిపించారు. ముస్తఫిజుర్ వేసిన రెండు ఓవర్లలో కలిపి స్మిత్ నాలుగు ఫోర్లు బాది జోరు ప్రదర్శించడంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 46 పరుగులకు చేరింది. బిపుల్ వేసిన ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో పుణే 17 పరుగులు రాబట్టింది. ఇదే జోరులో భాగస్వామ్యం 80 పరుగులకు చేరిన అనంతరం హెన్రిక్స్, డు ప్లెసిస్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అనంతరం ధోని (5) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే స్మిత్ చక్కటి ఆటతో పుణేను విజయానికి చేరువగా తెచ్చాడు. 118 ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కిది రెండో అత్యల్ప స్కోరు. గతేడాది ముంబైపై ఆ జట్టు అత్యల్పంగా 113 పరుగులు చేసింది. 2 ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అశ్విన్ తీసిన వికెట్ల సంఖ్య. ఈ రెండు వికెట్లు మ్యాచ్‌లో అతను వేసిన తొలి బంతికే రావడం విశేషం. 29 సున్నా పరుగులకే వార్నర్ అవుటవ్వడం 29 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2014లో ఏప్రిల్ 27న చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో వార్నర్ డకౌట్ అయ్యాడు. 2 ఐపీఎల్లో ఓపెనర్‌గా వచ్చి మొత్తం ఓవర్లు ఆడి తక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా శిఖర్ ధావన్ (56 నాటౌట్) నిలిచాడు. 2009లో బెంగళూరుపై దక్కన్ చార్జర్స్ ఓపెనర్ గిబ్స్ (53 నాటౌట్) అతి తక్కువ స్కోరు చేశాడు. స్కోరువివరాలు :- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సి) రహానే (బి) అశోక్ దిండా 0; శిఖర్ ధావన్ (నాటౌట్) 56; ఆదిత్య తారే (సి) పెరీరా (బి) అశోక్ దిండా 8; ఇయాన్ మోర్గాన్ (సి) ధోని (బి) మిచెల్ మార్ష్ 0; దీపక్ హుడా (సి) ధోని (బి) ఆర్.అశ్విన్ 1; హెన్రిక్స్ (సి) ధోని (బి) మిచెల్ మార్ష్ 1; నమన్ ఓజా (బి) అశోక్ దిండా 18; బిపుల్ శర్మ (రనౌట్) 5; భువనేశ్వర్ కుమార్ (సి) డు ప్లెసిస్ (బి) పెరీరా 21; ఆశిష్ నెహ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1-0, 2-26, 3-27, 4-29, 5-32, 6-79, 7-92, 8-115. బౌలింగ్: అశోక్ దిండా 4-1-23-3, మిచెల్ మార్ష్ 4-0-14-2, తిసారా పెరీరా 4-0-32-1, ఆర్.అశ్విన్ 4-0-14-1, రజత్ భాటియా 3-0-24-0, ఎం.అశ్విన్ 1-0-6-0. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: అజింక్య రహానే (సి) మోర్గాన్ (బి) భువనేశ్వర్ కుమార్ 0; డు ప్లెసిస్ (సి) నమన్ ఓజా (బి) హెన్రిక్స్ 30; స్టీవెన్ స్మిత్ (నాటౌట్) 46; ధోని (సి) తారే (బి) నెహ్రా 5; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (11 ఓవర్లలో మూడు వికెట్లకు) 94. వికెట్ల పతనం: 1-0, 2-80, 3-94. బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 3-1-17-1, ఆశిష్ నెహ్రా 3-0-21-1, ముస్తఫిజుర్ రెహమాన్ 2-0-21-0, బిపుల్ శర్మ 1-0-17-0, హెన్రిక్స్ 2-0-16-1. -
శిఖర ధవన్ ఒక్కడే..
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా మంగళవారం ఇక్కడ పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు సన్ రైజర్స్ వరుస వికెట్లను కోల్పోతున్నా ధవన్ మాత్రం అత్యంత నిలకడను ప్రదర్శించాడు. ధవన్(56 నాటౌట్; 53 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్))తో బాధ్యతాయుతంగా ఆడాడు. మిగతా సన్ రైజర్స్ ఆటగాళ్లు విఫలం కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 119 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగల్గింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఆదిలోనే డేవిడ్ వార్నర్(0) వికెట్ ను కోల్పోయింది. అనంతరం ఆదిత్య తారే(8), ఇయాన్ మోర్గాన్(0), హూడా(1), హెన్రీక్యూస్(1)లను నష్టపోయి కష్టాల్లో పడింది. మరోవైపు 32 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఈ ఐపీఎల్లో చెత్త రికార్డును మూటగట్టుకుంది. హైదరాబాద్ మిగతా ఆటగాళ్లలో ఆదిత్యా తారే(8), ఇయాన్ మోర్గాన్(0),దీపక్ హూడా(0),హెన్రీక్యూస్(1)లు ఘోరంగా విఫలమయ్యారు. ధవన్ కు తోడు నమాన్ ఓజా(18),భువనేశ్వర్ కుమార్(21) మోస్తరుగా రాణించడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. పుణె బౌలర్లలో అశోక్ దిండా మూడు వికెట్లు సాధించగా,మిచెల్ మార్ష్ కు రెండు వికెట్లు, రవి చంద్రన్ అశ్విన్, పెరీరాలకు కు ఒక వికెట్ దక్కింది. ఆకట్టుకున్న దిండా ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పుణె బౌలర్ అశోక్ దిండా ఆరంభపు మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్ కు ప్రధాన బలమైన డేవిడ్ వార్నర్ ఆదిలోనే పెవిలియన్ కు పంపి పుణె పెట్టుకున్న ఆశలను నిజం చేశాడు. తొలి ఓవర్ ను అందుకున్న దిండా..నాల్గో బంతికే వార్నర్ ను డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. ఆ తరువాత ఆదిత్యా తారేను, నమాన్ ఓజాను అవుట్ చేశాడు. నాలుగు ఓవర్లు కోటా పూర్తి చేసిన దిండా తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి 10 పరుగులకే మాత్రమే ఇవ్వగా, అతని వ్యక్తిగత నాల్గో ఓవర్ లో 13 పరుగులిచ్చాడు. ఓవరాల్ గా ఒక మేడిన్ సాయంతో సన్ రైజర్స్ ను కట్టడి చేయడంలో దిండా ప్రధాన పాత్ర పోషించాడు. -
సన్ రైజర్స్ 'చెత్త' రికార్డు'!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్లో వరుస మూడు విజయాలతో ఊపు మీద కనిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. సొంతగడ్డపై మంగళవారం పుణె సూపర్ జెయింట్స్ తో మ్యాచ్‌లో సన్ రైజర్స్ 32 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ సీజన్ లో ఒక జట్టు ఇలా 32 పరుగులకే ఐదు వికెట్లను నష్టపోవడం ఇదే ప్రథమం. ఐపీఎల్లో ఓవరాల్ గా ఐదు వికెట్లను నష్టపోయే క్రమంలో ఇది ఆరో అత్యల్పం కావడం గమనార్హం. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ పరుగుల ఖాతా తెరవకుండానే కెప్టెన్ డేవిడ్ వార్నర్ వికెట్ ను కోల్పోయింది. అనంతరం ఆదిత్య తారే(8), ఇయాన్ మోర్గాన్(0), హూడా(1), హెన్రీక్యూస్(1)లను నష్టపోయి కష్టాల్లో పడింది. ఈ ఐదు వికెట్లలో అశోక్ దిండా, మిచెల్ మార్ష్ లు తలో రెండు వికెట్లు సాధించగా,రవి చంద్రన్ అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది. -
హైదరాబాద్-పుణె మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా మంగళవారం ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-పుణె సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం రావడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. టాస్ వేసిన అనంతరం తేలికపాటి జల్లులు పడటంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని సేన
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా మంగళవారం ఇక్కడ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలుత హైదరబాద్‌ను బ్యాటింగ్ ఆహ్వానించాడు.ఇప్పటివరకూ ఇరు జట్లు ఐదు మ్యాచ్‌లాడగా పుణె ఒక దాంట్లో మాత్రమే విజయం సాధించగా, సన్ రైజర్స్ మూడు మ్యాచ్‌ల్లో నెగ్గింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన సన్ రైజర్స్.. వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), శిఖర్ ధవన్, ఆదిత్యా తారే, ఇయాన్ మోర్గాన్, దీపక్ హూడా, హెన్రీక్యూస్, నమాన్ ఓజా, బిపుల్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఆశిష్ నెహ్రా పుణె సూపర్ జెయింట్స్ తుది జట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), అజింక్యా రహానే, డు ప్లెసిస్, స్టీవ్ స్మిత్,పెరీరా, మిచెల్ మార్ష్, రజత్ భాటియా, సౌరభ్ తివారీ, రవి చంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, అశోక్ దిండా -
ధోని సేన గాడిలో పడేనా?
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని పుణే సూపర్ జెయింట్స్ ను వరుస పరాజయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లాడిన పుణె ఒకదాంట్లో మాత్రమే గెలవడంతో వారి శిబిరంలో ఆందోళన నెలకొంది. ధోని అండ్ గ్యాంగ్ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ విఫలమవుతూ పరాజయాల భారాన్ని మోస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం రాత్రి గం.8.00లకు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మరో పోరుకు పుణే సన్నద్ధమైంది. ఐపీఎల్-9వ సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో కనిపించిన పుణేను ఆ తరువాత పరాజయాలు వెక్కిరిస్తునే వస్తున్నాయి. ఆ జట్టులో స్టీవ్ స్మిత్, డుప్లెసిస్, రహానే, పెరీరా, ధోనిలతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కాగితాలపై బలంగా కనిపిస్తున్నప్పటికీ మైదానం చేరేసరికి డీలాపడుతోంది. టాప్ ఆర్డర్లో ఒకరిద్దరు రాణించడంతో ఫలితాల్లో భారీమూల్యమే చెల్లించుకుంటోంది. ఐదు మ్యాచ్‌లైనా... స్టీవ్ స్మిత్ ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ధోనీ మెరుపులు అంతంతే. ఇక పేస్ బౌలింగ్‌లో మీడియం పేసర్ రజత్ భాటియా మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. స్పిన్నర్లు కూడా ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రభావమే చూపలేదు. రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్‌లు దీనిపై దృష్టి పెట్టాలి. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల బాట పట్టడం ఆ జట్టుకు సానుకూలాంశం. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైన హైదరాబాద్ .. ఆ తరువాత హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్ లో ఉంది. ఫామ్ కోసం తంటాలు పడిన ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఇప్పుడు టచ్‌లోకి వచ్చాడు. మరోవైపు కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ వార్నర్ మెరుపు ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. బౌలింగ్ విభాగంలోనూ మెరుగైన స్థితిలో ఉంది. దీంతో కీలక ఆటగాళ్లు యువరాజ్, ఆశిష్ నెహ్రా గాయాల బారిన పడినా... జట్టు విజయాలకు ఢోకా లేకుండా పోయింది. యువీ కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. నెహ్రా ఫిట్నెస్ను బట్టి మ్యాచ్‌కు ముందు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు ఎలాగైనా విజయం సాధించి పరాజయాలకు చెక్ పెట్టాలని ధోని అండ్ గ్యాంగ్ యెచిస్తుండగా, మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని వార్నర్ సేన భావిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య రసవత్తరపోరు ఖాయంగా కనిపిస్తోంది. -
'పుణె జట్టులో మార్పులు కష్టం'
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి శుభారంభం చేసిన పుణె సూపర్ జెయింట్స్ ఆ తరువాత వరుస ఓటములతో సతమతమవుతోంది. ఆదివారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం చవిచూసిన పుణె వరుసగా నాల్గో ఓటమిని మూటగట్టుకుంది. దీనిపై ఆ జట్టు కోచ్ స్టెఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ... ఐదు మ్యాచ్‌ల్లో నాల్గింటిలో ఓటమి చెంది టోర్నీలో వెనుకబడిపోవడం ఆందోళన కల్గిస్తున్నా, ప్రస్తుత పరిస్థితులో జట్టులో మార్పులు చేయడం కూడా మంచిది కాదన్నాడు. సరైన కాంబినేషన్ కోసం అన్వేషిస్తున్నా, కొత్తగా టోర్నీలో అడుగుపెట్టిన జట్టులో భారీ స్థాయిలో మార్పులు కష్ట సాధ్యమన్నాడు. రాబోవు రెండు, మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించినట్లయితే తాము తిరిగి గాడిలో పడే అవకాశం ఉందన్నాడు. ప్రస్తుతం సరైన కాంబినేషన్ కోసం మాత్రమే యత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. కోల్ కతా మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి పాలుకావడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. స్లో వికెట్ పై మంచి లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచకల్గినా పరాజయం చెందడానికి బౌలర్ల వైఫల్యమే కారణమన్నాడు.