కోహ్లి 'శత'క్కొట్టుడు
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. పుణె సూపర్ జెయింట్స్ జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి అజేయ శతకంతో చెలరేగి ఆడటంతో బెంగళూరు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ గా వచ్చిన కోహ్లి(108 నాటౌట్; 58 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తో చివర వరకూ క్రీజ్లో ఉండి జట్టును విజయపథంలో నడిపించాడు. తద్వారా ఈ ఐపీఎల్ సీజన్ లో రెండో శతకాన్ని కోహ్లి నమోదు చేశాడు. దీంతో పాటు ఐపీఎల్లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్ గా కోహ్లి నిలిచాడు.
పుణె విసిరిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన బెంగళూరు ఆది నుంచి దూకుడుగా ఆడింది. కోహ్లికి జతగా కేఎల్ రాహుల్(38;35 బంతుల్లో 1 ఫోర్, 2సిక్సర్లు)రాణించి శుభారంభాన్ని అందించాడు. అనంతరం ఏబీ డివిలియర్స్(1) విఫలమైనా, షేన్ వాట్సన్(36;13 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడి బెంగళూరు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.చివరి రెండుఓవర్లలో 22 పరుగులు చేయాల్సి తరుణంలో విరాట్ దూకుడుగా ఆడాడు. ఈ పరుగులను సాధించే క్రమంలో విరాట్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో విరాట్ 21 పరుగులను సాధించి మ్యాచ్ను ఇంకా మూడు బంతులుండగానే ముగించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పుణె నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. పుణె ఆదిలోనే ఉస్మాన్ ఖాజా(16) వికెట్ను కోల్పోయింది. అనంతరం అజింక్యా రహానే(74; 48బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్సర్లు), సౌరభ్ తివారీ(52 ; 39 బంతుల్లో 9 ఫోర్లు) రాణించడంతో పుణె భారీ స్కోరు చేసింది.