చెలరేగిన డివిలియర్స్, కోహ్లి
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో పుణె సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ స్టార్ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లిలు అదరగొట్టారు. డివిలియర్స్ (83;46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజసిద్ధమైన ఆట తీరుతో చెలరేగిపోగా, అతనికి జతగా విరాట్ కోహ్లి(80; 63 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి దుమ్మురేపాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ ఆదిలోనే కేఎల్ రాహుల్(7) వికెట్ను కోల్పోయింది. ఆ తరుణంలో విరాట్ కు జతకలిసిన డివిలియర్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏబీ హాఫ్ సెంచరీ మార్కును చేరుకోగా, 50 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్ తో విరాట్ అర్థ శతకం సాధించాడు. ఈ జోడీ రెండో వికెట్ కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్టస్థితికి చేర్చింది. పుణె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పదే పదే బౌలర్లను మార్చినా డివిలియర్స్-కోహ్లిల జోడి భాగస్వామ్యానికి చివరి ఓవర్ లో మాత్రమే తెరపడింది.
రాయల్ చాలెంజర్స్ తొలి 15.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 128 పరుగులు చేయగా, చివరి ఐదు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 57 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఆఖరి ఓవర్లో విరాట్, డివిలియర్స్ లు వరుసగా పెవిలియన్ చేరడంతో రాయల్ చాలెంజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులను నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ కోల్పోయిన మూడు వికెట్లు పుణె పేస్ బౌలర్ తిషారా పెరీరాకు దక్కడం విశేషం.