దుమ్మురేపిన రహానే
బెంగళూరు: పుణె సూపర్ జెయింట్స్ ఆటగాడు అజ్యింకా రహానే మరోసారి దుమ్మురేపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రహానే(74; 48బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్సర్లు) అదరగొట్టాడు. మరోవైపు సౌరభ్ తివారీ(52 ; 39 బంతుల్లో 9 ఫోర్లు) కూడా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పుణె 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణె ఆదిలోనే ఉస్మాన్ ఖాజా(16) వికెట్ను కోల్పోయింది. ఈ తరుణంలో రహానేకు జత కలిసిన తివారీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో తివారీ తొలుత హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై వెంటనే రహానే అర్థ శతకం సాధించాడు. ఈ జోడి 106 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చిన అనంతరం తివారీ రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో కెప్టెన్ మహేంద్ర సింగ్(9)మూడో వికెట్ గా అవుటయ్యాడు. అయితే పెరీరా-రహానాలు స్కోరును పెంచే క్రమంలో వరుసగా అవుట్ కావడంతో పుణె 171 పరుగుల వద్ద ఐదో వికెట్ ను నష్టపోయింది. ఆపై జార్జ్ బెయిలీ డకౌట్ గా వెనుదిరిగినా, రవి చంద్రన్ అశ్విన్(10నాటౌట్;5 బంతుల్లో 1 సిక్స్), భాటియా(9 నాటౌట్;4 బంతుల్లో 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో షేన్ వాట్సన్ మూడు వికెట్లు సాధించగా, చాహాల్,జోర్డాన్లకు తలో వికెట్ దక్కింది.