విరాట్ గ్యాంగ్ వర్సెస్ ధోని సేన?
హూస్టర్: మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణె సూపర్ జెయింట్ జట్లు తలపడబోతున్నాయా?అంటే కొంత వరకూ అవుననే సమాధానమే వస్తుంది. అయితే ఐపీఎల్ నుంచి పుణె సూపర్ జెయింట్స్ నిష్క్రమిస్తే ఎలా బెంగళూరుతో తలపడుతుంది? అనే సందేహం రాక తప్పదు. అయితే ఈ రెండు జట్లు పోటీ పడేది ఐపీఎల్లో కాదులెండి. అమెరికాలో ఈ ఏడాది నిర్వహించే ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ల్లో ఆర్సీబీ, పుణె జట్లు పాల్గొనబోతున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
అమెరికాలో క్రికెట్ మార్కెట్ ను పరీక్షించేందుకు ఎగ్జిబిషన్ మ్యాచ్ లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మ్యాచ్ ల నిర్వహణకు హూస్టన్ను తాత్కాలిక వేదికగా అనుకున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఆదివారం బెంగళూరులో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందుకు దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, భారత క్రికెట్ జట్టు వరుసగా జింబాబ్వే, వెస్టిండీస్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ సిరీస్ ల తరువాత మాత్రమే ఎగ్జిబిషన్ మ్యాచ్ ల షెడ్యూల్ ను ఖరారు చేస్తారు. భారత క్రికెట్ జట్టు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో ఈ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లపై ముంబై ఇండియన్స్ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.