'పుణె జట్టులో మార్పులు కష్టం'
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై విజయం సాధించి శుభారంభం చేసిన పుణె సూపర్ జెయింట్స్ ఆ తరువాత వరుస ఓటములతో సతమతమవుతోంది. ఆదివారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్లో పరాజయం చవిచూసిన పుణె వరుసగా నాల్గో ఓటమిని మూటగట్టుకుంది.
దీనిపై ఆ జట్టు కోచ్ స్టెఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ... ఐదు మ్యాచ్ల్లో నాల్గింటిలో ఓటమి చెంది టోర్నీలో వెనుకబడిపోవడం ఆందోళన కల్గిస్తున్నా, ప్రస్తుత పరిస్థితులో జట్టులో మార్పులు చేయడం కూడా మంచిది కాదన్నాడు. సరైన కాంబినేషన్ కోసం అన్వేషిస్తున్నా, కొత్తగా టోర్నీలో అడుగుపెట్టిన జట్టులో భారీ స్థాయిలో మార్పులు కష్ట సాధ్యమన్నాడు. రాబోవు రెండు, మూడు మ్యాచ్ల్లో విజయం సాధించినట్లయితే తాము తిరిగి గాడిలో పడే అవకాశం ఉందన్నాడు. ప్రస్తుతం సరైన కాంబినేషన్ కోసం మాత్రమే యత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. కోల్ కతా మ్యాచ్లో 160 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి పాలుకావడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. స్లో వికెట్ పై మంచి లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచకల్గినా పరాజయం చెందడానికి బౌలర్ల వైఫల్యమే కారణమన్నాడు.