ధోని రెచ్చిపోయాడు..
విశాఖ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో పుణె సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది. శనివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అద్వితీయంగా ఆడి జట్టుకు మరపురాని గెలుపును అందించాడు. చివరి ఓవర్ లో పుణె విజయానికి 23 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని రెచ్చిపోయాడు. మూడు సిక్సర్లు, ఒక ఫోర్ తో 22 పరుగులు చేసి పుణెకు విజయాన్ని అందించాడు. తొలి బంతికి పరుగేమీ రాకపోగా, రెండో బంతి వైడ్ అయ్యింది. దీంతో పుణె విజయానికి నాలుగు బంతుల్లో 22 పరుగులు అవసరమయ్యాయి.
అయితే ఆ తరుణంలో మ్యాచ్ విన్నర్ గా పేరుగాంచిన ధోని విశ్వరూపం ప్రదర్శించాడు. రెండో బంతిని సిక్స్ కొట్టిన ధోని, మూడో బంతిని కూడా అంతే వేగంగా కొట్టాడు. అయితే ఆ బంతిని పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా అడ్డుకోవడంతో పరుగు రాలేదు. ఇక నాల్గో బంతిని ఫోర్ కొట్టగా, ఐదు, ఆరు బంతుల్ని సిక్స్ లుగా మలచడంతో పుణె అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రమే అయినా, ధోని ఆడిన తీరు ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో ధోని(64 నాటౌట్;32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోవడంతో పుణె నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(30), మురళీ విజయ్(59)లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడీ 60 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన అనంతరం ఆమ్లా తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం సాహా(3) విఫలమైనా, గుర్ కీరత్ సింగ్(51) రాణించడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు చేసింది.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పుణె జట్టులో అజింక్యా రహానే(19), ఉస్మాన్ ఖాజా(30)లు ఫర్వాలేదనిపించారు. ఆపై జార్జ్ బెయిలీ(9), సౌరభ్ తివారీ(17) లు విఫలమయ్యారు. ఆ పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోని జట్టును ఆదుకున్నాడు. తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న ధోని.. చివరి వరకూ క్రీజ్ లో పుణెకు విజయాన్ని సాధించిపెట్టాడు. పంజాబ్ బౌలర్ అక్షర్ పటేల్ వేసిన చివరి ఓవర్ లో ధోని విశేషంగా రాణించి పూర్వపు ఫామ్ ను అందుకున్నాడు.