గత ఏడాది అశ్విన్ నాయకత్వంలో కొత్తగా కనిపించిన పంజాబ్ తొలి 9 మ్యాచ్‌లలో 6 గెలిచి దూసుకుపోయింది. కానీ తర్వాతి ఐదు మ్యాచ్‌లు కూడా ఓడి అనూహ్యంగా లీగ్ దశకే పరిమితమైంది. ఈ సారి మరింత నిలకడైన ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది.
బలాలు: ఓపెనర్లు క్రిస్ గేల్, లోకేశ్ రాహుల్ మెరుపు బ్యాటింగే జట్టును ముందుకు తీసుకెళ్లవచ్చు. ఐపీఎల్‌లో గేల్ ప్రదర్శన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్‌తో ఇటీవలి వన్డే సిరీస్‌లో విధ్వంసకర ప్రదర్శనతో గేల్ తాను సిద్ధంగా ఉన్నానని చెప్పేశాడు. మరోవైపు టి20 ఫార్మాట్‌లో రాహుల్ రికార్డు ఘనం. గత ఏడాది అతను 158.41 స్ట్రయిక్ రేట్‌తో 659 పరుగులు చేశాడు. ఇప్పుడూ వీరిద్దరు అద్భుతమైన ఆరంభం ఇస్తే మిగిలిన ఆటగాళ్లు జోరు కొనసాగించడం కష్టం కాకపోవచ్చు. ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ జట్టు బ్యాటింగ్ బలం పెంచాడు. డేవిడ్ మిల్లర్ కూడా తుది జట్టులో ఉంటాడు. టీమిండియాకు దూరమైనా చేవ తగ్గలేదని నిరూపిస్తున్న అశ్విన్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టి పడేయగలడు. అఫ్గానిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ముజీబుర్ రహమాన్ గత ఏడాది కూడా ఎంతో ప్రభావం చూపించాడు. కొత్తగా జట్టులోకి వస్తున్న వరుణ్ చక్రవర్తిపై కూడా ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. పేస్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియన్ ఆండ్రూ టైదే ప్రధాన బాధ్యత కాగా, భారత్ నుంచి అంకిత్ రాజ్‌పుత్ అన్ని మ్యాచ్‌లు ఆడవచ్చు.
బలహీనతలు: టీమ్‌లో చెప్పుకోదగ్గ భారత ఆల్‌రౌండర్ ఎవరూ లేరు. ఇంగ్లండ్ సంచలనం స్యామ్ కరన్ ఉన్నా అతడికి తుది జట్టులో అన్ని మ్యాచ్‌లలో చోటు కష్టమే. మిడిలార్డర్‌లో కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, మన్‌దీప్ సింగ్ ఏ మాత్రం రాణించగలరనేది సందేహమే. భారత పేసర్ మొహమ్మద్
షమీ ఉన్నా, గాయాల సమస్యతో పాటు ఐపీఎల్‌లో ఎప్పుడూ ప్రభావం చూపలేకపోయిన అతను ఈసారి ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది కీలకం. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల గేల్ అండగా ప్లే ఆఫ్స్‌పై పంజాబ్ ఆశలు పెట్టుకోవచ్చు కానీ గత ఏడాదిలా కుప్పకూలిపోతే మాత్రం కష్టం
జట్టు వివరాలు: అశ్విన్ (కెప్టెన్), రాహుల్, మన్‌దీప్, అంకిత్ రాజ్‌పుత్, కరుణ్ నాయర్, అశ్విన్ మురుగన్, సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్, షమీ, అగ్నివేశ్, హర్‌ప్రీత్ బ్రార్, వరుణ్ చక్రవర్తి, అర్‡్షదీప్ సింగ్, సిమ్రన్ సింగ్, దర్శన్ (భారత ఆటగాళ్లు), హెన్రిక్స్, పూరన్, టై, గేల్, స్యామ్ కరన్, మిల్లర్, ముజీబ్, విలోన్ (విదేశీ ఆటగాళ్లు).
Comments
Please login to add a commentAdd a comment