
ధోని వర్సెస్ కోహ్లి
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో పుణె సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే రసవత్తర పోరుకు మరి కాసేపట్లో తెరలేవనుంది. పుణె సూపర్ జెయింట్స్ కు ధోని కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, రాయల్ చాలెంజర్స్కు విరాట్ కోహ్లి నేతృత్వం వహిస్తుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. నగరంలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శుక్రవారం రాత్రి గం.8.00లకు ఇరు జట్లు తలపడనున్నాయి.
ఈ సీజన్లో ఇప్పటివరకూ 15 ఐపీఎల్ మ్యాచ్లు జరగ్గా.. రాయల్ చాలెంజర్స్, పుణె సూపర్ జెయింట్స్లు పోటీ పడటం ఇదే ప్రథమం. దీంతో ఇరు జట్ల మధ్య పోరుపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భారత క్రికెట్ లో తమదైన ముద్ర వేసిన ధోని, కోహ్లిలు ఈ మ్యాచ్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటివరకూ ఇరు జట్లు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక దాంట్లో మాత్రమే గెలిచాయి. పుణె, రాయల్ చాలెంజర్స్ లు తమ తమ తొలి మ్యాచ్ల్లో విజయం సాధించి జోరు మీద కనిపించినా, ఆ తరువాత వెనుకబడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ లో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. టోర్నీలో రాయల్ చాలెంజర్స్, పుణె జట్లు బలంగా కనిపిస్తున్నా విజయాల విషయానికొచ్చేసరికి పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇరు జట్లలో ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రమే రాణించడమే ఇందుకు కారణం.
టోర్నీలో పెద్దగా బలంగా లేని ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ జట్లు సైతం సమిష్ట ప్రదర్శనతో ముందుకు వెళుతుంటే రాయల్ చాలెంజర్స్, పుణెలు మాత్రం స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించడంలో మాత్రం విఫలమవుతూ వస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. పుణె జట్టులో కెవిన్ పీటర్సన్, స్టీవ్ స్మిత్, డు ప్లెసిస్, ధోని, మిచెల్ మార్ష్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉండగా, రాయల్ చాలెంజర్స్ జట్టులో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, సర్ఫరాజ్ ఖాన్, కేదర్ జాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ మ్యాచ్కు ఎటువంటి వర్ష సూచన లేదు. టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. తొలుత టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
రాయల్ చాలెంజర్స్ జట్టు(అంచనా): విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, ట్రావిస్ హెడ్, సర్ఫరాజ్ ఖాన్, స్టువర్ట్ బిన్నీ,హర్షల్ పటేల్, రిచర్డ్ సన్,ఇక్బాల్ అబ్దుల్లా,వరుణ్ అరోన్
పుణె సూపర్ జెయింట్స్ జట్టు (అంచనా): మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), అజింక్యా రహానే, డు ప్లెసిస్, కెవిన్ పీటర్సన్,పెరీరా, స్టీవ్ స్మిత్,ఇర్ఫాన్ పఠాన్, రవి చంద్రన్ అశ్విన్,ఇషాంత్ శర్మ,అంకిత్ శర్మ, మురుగన్ అశ్విన్