ధోనిసేన గెలిచిందోచ్! | Rahane lead Pune Supergiants to 7-wicket win over Daredevils | Sakshi
Sakshi News home page

ధోనిసేన గెలిచిందోచ్!

Published Fri, May 6 2016 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

ధోనిసేన   గెలిచిందోచ్!

ధోనిసేన గెలిచిందోచ్!

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై నెగ్గిన పుణే సూపర్ జెయింట్స్
రాణించిన రహానే
 

సీజన్ ఆరంభం నుంచి నిలకడలేమి... గాయాలతో స్టార్ క్రికెటర్లు దూరం... జట్టులో అనేక మార్పులు... అంతా గందరగోళం... ఇలాంటి స్థితిలో ఉన్న పుణే సూపర్ జెయింట్స్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. జట్టులో కొత్తగా చేరిన క్రికెటర్లు రాణించడంతో పాటు... రహానే నిలకడ కొనసాగించడంతో ఢిల్లీపై నెగ్గి సీజన్‌లో మూడో విజయం సొంతం చేసుకుంది.
 

 
న్యూఢిల్లీ: యువ క్రికెటర్ల రాణింపుతో సంచలన విజయాలు సాధిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జోరుకు పుణే సూపర్ జెయింట్స్ బ్రేక్ వేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ధోనిసేన ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. టాస్ గెలిచిన పుణే ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. డుమిని (32 బంతుల్లో 34; 1 ఫోర్), కరుణ్ నాయర్ (23 బంతుల్లో 32; 5 ఫోర్లు) రాణించారు. పుణే బౌలర్లలో బోలాండ్, భాటియా రెండేసి వికెట్లు తీసుకున్నారు. పుణే జట్టు 19.1 ఓవర్లలో మూడు వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ రహానే (48 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయంగా అర్ధసెంచరీ చేయగా... తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఖవాజా (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ధోని (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.


 తలా ఓ చేయి...
 గత మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన పంత్ (2) ఈసారి విఫలం కావడంతో ఆరంభంలోనే ఢిల్లీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే సంజు శామ్సన్ (17 బంతుల్లో 20; 3 ఫోర్లు), కరుణ్ నాయర్ రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించి పరిస్థితిని సరిదిద్దారు. డుమిని, బిల్లింగ్స్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే పుణే బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో ఢిల్లీని నియంత్రించే ప్రయత్నం చేశారు. బ్రాత్‌వైట్ (8 బంతుల్లో 20) మూడు భారీ సిక్సర్లతో చెలరేగడంతో మ్యాచ్‌లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగినా... ఆరు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి పుణే బౌలర్లు కట్టడి చేశారు. చివరి ఓవర్లో నెగి (12 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) చెలరేగడంతో ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోరు లభించింది.


 రాణించిన టాపార్డర్
 కొత్తగా జట్టుతో చేరిన ఖవాజా కుదురుకునేందుకు సమయం తీసుకోగా... ఫామ్‌లో ఉన్న పుణే ఓపెనర్ రహానే పవర్‌ప్లేలో చెలరేగి ఆడాడు. క్రమంగా ఖవాజా కూడా బ్యాట్ ఝళిపించడంతో పవర్‌ప్లేలో పుణే వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. మిశ్రా బౌలింగ్‌లో ఖవాజా అవుటయ్యాక... సౌరవ్ తివారీ (18 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్సర్) సాయంతో రహానే ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించాక తివారీ అవుటయ్యాడు. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలబడ్డ రహానే 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన ధోని భారీ సిక్సర్‌తో ఫామ్‌లో కనిపించాడు. పుణే విజయానికి 18 బంతుల్లో 37 పరుగులు అవసరమైన దశలో... షమీ బౌలింగ్‌లో ధోని వరుసగా ఫోర్, సిక్సర్ కొట్టడంతో ఒకే ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్ తొలి బంతికి ధోని భారీ షాట్ ఆడినా... బిల్లింగ్స్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. పెరీరా (5 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్సర్లు) రెండు భారీ సిక్సర్లు బాది... ఎలాంటి నష్టం జరగకుండా పుణే విజయాన్ని పూర్తి చేశాడు.


 
 స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: రిషబ్ పంత్ (బి) దిండా 2; శామ్సన్ (సి) ఆర్. అశ్విన్ (బి) బోలాండ్ 20; కరుణ్ నాయర్ (సి) పెరీరా (బి) భాటియా 32; డుమిని రనౌట్ 34; బిల్లింగ్స్ (సి) రహానే (బి) భాటియా 24; బ్రాత్‌వైట్ (సి) పెరీరా (బి) బోలాండ్ 20; పవన్ నెగి నాటౌట్ 19; జయంత్ రనౌట్ 1; షమీ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 162.

 వికెట్ల పతనం: 1-13; 2-48; 3-65; 4-110; 5-137; 6-138; 7-143.
బౌలింగ్: దిండా 4-0-34-1; పెరీరా 1-0-9-0; బోలాండ్ 4-0-31-2; ఆర్.అశ్విన్ 4-0-34-0; భాటియా 4-0-22-2; ఎం.అశ్విన్ 3-0-31-0.

 పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే నాటౌట్ 63; ఖవాజా (స్టం) శామ్సన్ (బి) మిశ్రా 30; సౌరవ్ తివారీ (సి) బిల్లింగ్స్ (బి) తాహిర్ 21; ధోని (సి) బిల్లింగ్స్ (బి) తాహిర్ 27; పెరీరా నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.1 ఓవర్లలో మూడు వికెట్లకు) 166.

 వికెట్ల పతనం: 1-59; 2-104; 3-146.
బౌలింగ్: జయంత్ 4-0-25-0; బ్రాత్‌వైట్ 2-0-17-0; షమీ 3.1-0-50-0; అమిత్ మిశ్రా 4-0-28-1; డుమిని 1-0-9-0; తాహిర్ 4-0-26-2; నెగి 1-0-10-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement