లయన్స్ ‘పవర్’ | Gujarat Lions beat Pune Supergiants by 7 wickets | Sakshi
Sakshi News home page

లయన్స్ ‘పవర్’

Published Fri, Apr 15 2016 12:22 AM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

లయన్స్ ‘పవర్’ - Sakshi

లయన్స్ ‘పవర్’

గుజరాత్‌కు వరుసగా రెండో విజయం
7 వికెట్లతో పుణే జెయింట్స్ చిత్తు
చెలరేగిన ఫించ్, మెకల్లమ్
బంతితో మెరిసిన జడేజా

 
ఐపీఎల్‌లో తొలి సారి బరిలోకి దిగి తలపడిన రెండు జట్లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లేవర్ కనిపించింది. ధోని, అశ్విన్, డు ప్లెసిస్ ఒక వైపు... రైనా, జడేజా, మెకల్లమ్, బ్రేవో మరో వైపు నిలిచారు. అయితే పుణేతో పోలిస్తే లయన్స్ జట్టులో భారీ షాట్లు ఆడే ‘పవర్’ హిట్టర్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చింది. పుణేలో అత్యుత్తమ క్లాసిక్ ఆటగాళ్లు ఉన్నా... టి20కి కావలసిన ‘పవర్’తో ఆడలేకపోయారు. మొత్తానికి తమిళుల కొత్త సంవత్సరం రోజున రెండు పాత తమిళ జట్ల పోరాటంలా సాగిన మ్యాచ్‌లో ధోనిపై రైనా పైచేయి సాధించాడు.
 
రాజ్‌కోట్:ఐపీఎల్‌లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో సాధికార విజయం సాధించింది. గురువారం పుణే జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (43 బంతుల్లో 69; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ పీటర్సన్ (31 బంతుల్లో 37; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 61 బంతుల్లో 86 పరుగులు జోడించగా... చివర్లో ధోని (10 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. జడేజా, తాంబే చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లయన్స్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆరోన్ ఫించ్ (36 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (31 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 51 బంతుల్లోనే 85 పరుగులు జత చేసి జట్టు విజయాన్ని సులువు చేశారు.


భారీ భాగస్వామ్యం: సూపర్‌జెయింట్స్‌కు చక్కటి ఆరంభం అందించిన ఓపెనర్ రహానే (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) చకచకా పరుగులు చేసినా తాంబే బంతికి వెనుదిరిగాడు. దీంతో డు ప్లెసిస్, పీటర్సన్ జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. వరుసగా రెండు ఓవర్లలో కలిపి 29 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 57 పరుగులకు చేరింది. క్రీజ్‌లో నిలదొక్కుకున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్ కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. అయితే గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో ఒక్కసారిగా పరుగుల వేగం తగ్గింది. ఒక దశలో డు ప్లెసిస్, పీటర్సన్ ధాటిగానే ఆడినా... తమ స్థాయికి తగినట్లుగా మెరుపులు ప్రదర్శించలేకపోయారు. ఈ క్రమంలో 33 బంతుల్లో ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత బ్రేవో చక్కటి బంతితో ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.

ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ప్లెసిస్, స్మిత్ (5), మార్ష్ (7) వెనుదిరిగారు. దాంతో రన్‌రేట్ తగ్గిపోయి జట్టు 150 పరుగులు కూడా దాటుతుందా అనిపించింది. అయితే చివర్లో ధోని మెరుపులతో పుణే చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. బ్రేవో వేసిన ఈ ఓవర్లో ధోని 2 ఫోర్లు, 1 సిక్స్ సహా 20 పరుగులు రాబట్టాడు. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులతో పటిష్టంగా ఉన్న పుణే... చివరి 10 ఓవర్లలో 76 పరుగులు మాత్రమే చేయగలిగింది. తన చివరి రెండు ఓవర్లలో 3 పరుగులే ఇచ్చి జడేజా ఇందులో కీలక పాత్ర పోషించాడు.


 మెరుపు ఓపెనింగ్: లయన్స్‌కు ఓపెనర్లు ఫించ్, మెకల్లమ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. ఆర్పీ సింగ్ ఓవర్లో మెకల్లమ్ రెండు సిక్సర్లు బాదగా, ఆ తర్వాత ఇషాంత్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. తన తొలి ఓవర్లో నాలుగే పరుగులు ఇచ్చి అశ్విన్ కాస్త తెరిపినిచ్చినా... తర్వాతి రెండు ఓవర్లు గుజరాత్ పంట పండించాయి. మురుగన్ అశ్విన్ వేసిన మరుసటి ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన ఫించ్... భాటియా తర్వాతి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి 33 పరుగులు వచ్చాయి. ఇదే జోరులో 33 బంతుల్లోనే ఫించ్ హాఫ్ సెంచరీ పూర్తయింది.

ఎట్టకేలకు మురుగన్ అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత తన దూకుడు కొనసాగించిన మెకల్లమ్ అశ్విన్ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మెకల్లమ్, కొద్ది సేపటికే రైనా (24 బంతుల్లో 24; 1 ఫోర్) కూడా వెనుదిరిగినా... బ్రేవో (10 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్‌ను ముగించాడు.


 స్కోరు వివరాలు
పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (ఎల్బీ) (బి) తాంబే 21; డు ప్లెసిస్ (స్టంప్డ్) కార్తీక్ (బి) తాంబే 69; పీటర్సన్ (బి) బ్రేవో 37; స్మిత్ (సి) ఫాల్క్‌నర్ (బి) జడేజా 5; ధోని (నాటౌట్) 22; మార్ష్ (బి) జడేజా 7; భాటియా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163.

 వికెట్ల పతనం: 1-27; 2-113; 3-132; 4-134; 5-143.
బౌలింగ్: ప్రవీణ్ 2-0-12-0; జకాతి 4-0-40-0; తాంబే 4-0-33-2; బ్రేవో 4-0-43-1; జడేజా 4-0-18-2; ఫాల్క్‌నర్ 2-0-15-0.

గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) ఇషాంత్ (బి) మురుగన్ 50; మెకల్లమ్ (సి) డు ప్లెసిస్ (బి) ఇషాంత్ 49; రైనా (స్టంప్డ్) ధోని (బి) మురుగన్ 24; బ్రేవో (నాటౌట్) 22; జడేజా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18 ఓవర్లలో 3 వికెట్లకు) 164.

 వికెట్ల పతనం: 1-85; 2-120; 3-147.
బౌలింగ్: ఆర్పీ సింగ్ 2-0-21-0; ఇషాంత్ 4-0-39-1; అశ్విన్ 4-0-26-0; మురుగన్ 4-0-31-2; భాటియా 3-0-30-0; మార్ష్ 1-0-10-0.
 
 
 
 జడేజా స్పెషల్...
గతంలో మూడు ఐపీఎల్ జట్ల తరఫున బరిలోకి దిగినా... సొంత రాష్ట్రంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని లోటు జడేజాకు ఉండేది. ఇప్పుడు గుజరాత్ లయన్స్ తరఫున అతను తొలిసారి తన సొంత ప్రేక్షకుల మధ్య రాజ్‌కోట్‌లో ఆడి సత్తా చాటాడు. రాజ్‌కోట్‌లోనూ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. తన తొలి రెండు ఓవర్లలో ఒక సిక్స్‌తో 15 పరుగులు ఇచ్చిన జడేజా తర్వాతి రెండు ఓవర్లు మ్యాచ్ దిశను మార్చాయి. 17వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చిన అతను, 19వ ఓవర్లో మరో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి పుణేను పూర్తిగా కట్టి పడేశాడు. ఓ దశలో 180 పైచిలుకు పరుగులు చేస్తుందని భావించిన పుణే... జడేజా స్లాగ్ ఓవర్ల ప్రదర్శన కారణంగా 163 పరుగులకే పరిమితమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement