చెలరేగిన స్టీవ్ స్మిత్
పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా శుక్రవారం గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ ఆటగాడు స్టీవ్ స్మిత్ చెలరేగిపోయాడు. స్మిత్(101; 54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేశాడు. అతనికి జతగా అజ్యింకా రహానే(53;45 బంతుల్లో 5ఫోర్లు) రాణించడంతో పుణె సూపర్ జెయింట్స్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణె సూపర్ జెయింట్స్ ఆదిలోనే సౌరభ్ తివారీ(1) వికెట్ ను రనౌట్ రూపంలో కోల్పోయింది.అనవసరపు పరుగు కోసం యత్నించిన తివారీని రైనా రనౌట్ చేయడంతో పుణె 13 పరుగుల వద్దే తొలి వికెట్ ను నష్టపోయింది. ఆ సమయంలో రహానేకు జతకలిసిన స్మిత్ రెచ్చిపోయాడు. ఈ జోడి 111 పరుగులను జత చేయడంతో పుణె పటిష్టస్థితికి చేరింది. ఈ క్రమంలోనే స్మిత్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును చేరగా, రహానే 43 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అయితే రహానే హాఫ్ సెంచరీ చేసిన స్వల్ప వ్యవధిలోనే రనౌట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, స్మిత్ మాత్రం అదే దూకుడును కొనసాగించి సెంచరీ సాధించాడు.దీంతో టీ 20ల్లో స్మిత్ తొలి సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(30 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్సర్లు) ఆకట్టుకోవడంతో పుణె నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
మ్యాచ్ విశేషాలు..
ఏ వికెట్కైనా రహానే-స్మిత్లు నమోదు చేసిన 111 పరుగుల భాగస్వామ్యమే పుణె కు అత్యుత్తమం.
ఐపీఎల్లో స్మిత్ అంతకుముందు నమోదు చేసిన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 79 కాగా,టీ 20ల్లో అతని బెస్ట్ 90
ఈ ఐపీఎల్లో పుణె నమోదు చేసిన 193 పరుగులు రెండో అత్యుత్తమం. అంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (227) చేసిన స్కోరే అత్యధికం.