పుణే, గుజరాత్‌లకు పొడిగింపు లేదు
ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో పుణే, గుజరాత్ ఫ్రాంచైజీలకు పొడిగింపు లేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. లీగ్‌తో ఈ రెండు ఫ్రాంచైజీలకు కేవలం రెండేళ్ల ఒప్పందమే ఉందని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైన చెన్నై, రాజస్తాన్‌లను వచ్చే సీజన్ నుంచి అనుమతిస్తామని చెప్పారు. ఒక వేళ ఐపీఎల్‌లో 8 జట్లకు బదులు 10 జట్లకు స్థానం కల్పించినా... కొత్తగా బిడ్డింగ్ నిర్వహిస్తాం తప్ప పుణే, గుజరాత్‌లను కొనసాగించేది లేదని తేల్చిచెప్పారు. ఎన్ని జట్లు ఆడతాయనే విషయాన్ని ఐపీఎల్ పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రసార హక్కులను ఇకపై ఐదేళ్ల వరకే ఇస్తామన్నారు. ‘ఐదేళ్లలో ఎంత పెద్ద హిట్ అవుతుందో ఎవరికి తెలుసు. అందుకే పదేళ్లు కాకుండా ఐదేళ్లకే పరిమితం చేస్తాం’ అని శుక్లా అన్నారు. సుప్రీం కోర్టు నియమించిన బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) మార్గదర్శకాల ప్రకారమే ఈ ఒప్పందాలు జరుగుతాయన్నారు. టైటిల్ స్పాన్సర్‌షిప్ కట్టబెట్టేందుకు కొత్తగా ఈ–వేలం నిర్వహిస్తామన్నారు.
ప్రభుత్వం అనుమతిస్తేనే పాక్‌తో ఆట: పాకిస్తాన్‌లో పర్యటించేందుకు భద్రతా కారణాలే అసలు సమస్యని రాజీవ్ శుక్లా చెప్పారు. ‘మిగతా జట్లలాగే మేమూ భద్రత పట్ల ఆందోళనగా ఉన్నాం. మ్యాచ్‌ల కోసం మా ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్టలేం’ అని అన్నారు. పాక్‌తో సిరీస్ ఆడేందుకు భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరని... ఇది కాదని ముందడుగు వేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సిరీస్‌ల ఒప్పంద ఉల్లంఘనపై పాక్ క్రికెట్ బోర్డు ఇచ్చిన నోటీసుకు దీటుగానే బదులిస్తామని చెప్పారు.