పుణెకు సాధారణ లక్ష్యం
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా సోమవారం రాత్రి రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ కు ఓపెనర్లు ఇషాన్ కిషన్(31;24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్(45;27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) శుభారంభం అందించారు.
ఈ జోడి పవర్ ప్లేలో 55 పరుగులు సాధించి గుజరాత్ స్కోరును పరుగులు పెట్టించారు. అయితే ఇషాన్ కిషన్ తొలి వికెట్ అవుటైన తరువాత సురేశ్ రైనా(8), అరోన్ ఫించ్(13) నిరాశపరిచారు. ఆపై డ్వేన్ స్మిత్ డకౌట్ గా అవుట్ కావడంతో గుజరాత్ 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో దినేష్ కార్తీక్(29),రవీంద్ర జడేజా(19) మోస్తరుగా రాణించారు. ఇక చివర్లో గుజరాత్ తడబడటంతో 161 పరుగులకే పరిమితమైంది. పుణె బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్, ఉనాద్కత్ తలో మూడు వికెట్లు సాధించగా, శార్దూల్ ఠాకూర్, క్రిస్టియన్ లకు చెరో వికెట్ లభించింది.