మొత్తం డబ్బులు ఇవ్వలేదు: మెకల్లమ్
కాన్పూర్: తనకు రావాల్సిన మొత్తం సొమ్మును గుజరాత్ లయన్స్ ఇవ్వలేదని అంటున్నాడు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బ్రెండన్ మెకల్లమ్. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడేటప్పుడు తనకు రూ. 7.5 కోట్లు వచ్చేదని, ఆ మొత్తాన్ని తాజా ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్ నుంచి పొందలేదన్నాడు. తనను అదే మొత్తానికి గుజరాత్ లయన్స్ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మెకల్లమ్ గుర్తు చేశాడు. ఆటగాళ్లకు ధనాన్ని చెల్లించే వ్యవహారంలో శాలరీ క్యాప్ పేరు చెప్పి తగ్గించి ఇచ్చారని మెకల్లమ్ స్పష్టం చేశాడు.
2016లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్లు ఐపీఎల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లుపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో వాటిపై రెండేళ్లు నిషేధం పడింది. దాంతో ఆ జట్ల స్థానంలో గుజరాత్, పుణెలు వచ్చి చేరాయి. అదే క్రమంలో చెన్నై, రాజస్థాన్ జట్ల ఆటగాళ్లను గుజరాత్, పుణెలు వేలంలో కొనుగోలు చేశాయి. అందులో మెకల్లమ్ ను గుజరాత్ లయన్స్ దక్కించుకుంది.