ఆమ్లా శతకం వృథా
►కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు షాక్
►డ్వేన్ స్మిత్ సూపర్ ఇన్నింగ్స్
►గుజరాత్ లయన్స్ విజయం
మొహాలీ: ప్లే ఆఫ్‌లో చోటు కోసం అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ దూకుడుకు గుజరాత్ లయన్స్ బ్రేక్ వేసింది. ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఓపెనర్ డ్వేన్ స్మిత్ (39 బంతుల్లో 74; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈసారి సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీనికి తోడు కీలక సమయాల్లో క్యాచ్‌లను వదిలేయడంతో పంజాబ్ మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైనా సేన 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు ఆమ్లా (60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ సీజన్‌లో రెండో శతకంతో చెలరేగగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. షాన్ మార్‡్ష (43 బంతుల్లో 58; 6 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. అనంతరం గుజరాత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసి గెలిచింది. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), రైనా (25 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. డ్వేన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
స్మిత్ జోరు...
190 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన గుజరాత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్, ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు) 9.2 ఓవర్ల పాటు పంజాబ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా ఫామ్‌లో లేని స్మిత్ ఈ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. ఆరో ఓవర్‌లో చేతుల్లోకి వచ్చిన స్మిత్ క్యాచ్‌ను మార్‡్ష వదిలేయగా తర్వాతి ఓవర్‌లో భారీ సిక్స్‌తో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఎనిమిదో ఓవర్‌లో ఇషాన్‌కు లైఫ్ లభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. దీంతో తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. స్మిత్ దూకుడుకు పదో ఓవర్‌లోనే జట్టు వంద పరుగులు దాటింది. అయితే మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన తను క్యాచ్ అవుటయ్యాడు. ఆ తర్వాత భారీ షాట్లతో చెలరేగుతున్న రైనా జట్టును విజయంవైపు తీసుకెళుతుండగా 18వ ఓవర్‌లో సందీప్ శర్మ షాక్ ఇచ్చాడు. రైనాతో పాటు ఫించ్ (2) వికెట్‌ను తీయడంతో ఉత్కంఠ పెరిగింది. అప్పటికి 13 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయితే దినేశ్ కార్తీక్ వరుసగా 6,4 బాది ఒత్తిడి తగ్గించాడు. చివరి ఓవర్‌లో 8 పరుగులు కావాల్సి ఉండగా రెండు బంతులు ఉండగానే జట్టు నెగ్గింది.
ఆమ్లా, మార్ష్ దూకుడు...
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ తొలి ఓవర్‌లోనే గప్టిల్ (2) వికెట్‌ను కోల్పోయింది. తొలి రెండు ఓవర్లలో జట్టు చేసింది మూడు పరుగులే. ఐదు ఓవర్ల వరకు కూడా కనీసం ఓవర్‌కు ఆరు రన్‌రేట్ కూడా లేకుండా సాగుతున్న వీరి ఇన్నింగ్స్ చివరకు భారీ స్కోరు సాధించిందంటే ఆమ్లా మెరుపులే కారణం. అతనికి మార్‡్ష చక్కటి సహకారం అందించడంతో లయన్స్ బౌలర్లు ఇబ్బందిపడ్డారు. ఆరో ఓవర్‌లో ఆమ్లా సిక్స్, ఫోర్ బాదడంతో జట్టు పవర్‌ప్లేలో 44 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత రిస్కీ షాట్లకు వెళ్లకుండా ఈ జోడి అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచింది.