మన హైదరాబాదీ కుమ్మేశాడు..
► రాణించిన రషీద్ ఖాన్
► 154 పరుగులకే కుప్ప కూలిన గుజరాత్
కాన్పుర్: సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ మధ్య జరుగుతున్న ఆసక్తికర మ్యాచ్ లో మన హైదరాబాద్ యువ బౌలర్ మహ్మద్ సిరాజ్ దాటికి లయన్స్ తోక ముడిచింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, స్మిత్, రవీంద్ర జడేజా మినహా మిగతా బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ కు పరిమితం అవ్వడంతో లయన్స్ 154 పరుగులకే కుప్పకూలింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు.యువ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ 27 బంతుల్లో ఐపీఎల్ కేరిర్ లోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేయగా మరో ఓపెనర్ డ్వాన్ స్మిత్ కూడా 33 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. వీరి బ్యాటింగ్ దాటికి గుజరాత్ పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 105 పరుగు చేసింది. 7 ఫోర్లు 4 సిక్స్ లతో 54 పరుగులు చేసిన స్మిత్ ను రషీద్ ఖాన్ వికెట్లు ముందు బోల్త కొట్టించడంతో గుజరాత్ వికెట్ల పతనం మొదలైంది. వీరిద్దరు తొలి వికెట్ కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
5 ఫోర్లు, 4 సిక్సర్ లతో 61 పరుగులు చేసిన ఇషాన్ ను, సురేశ్ రైనా (2) లను యువ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. అనంతరం క్రీజులో కి వచ్చిన దినేశ్ కార్తిక్(0), ఆరోన్ ఫించ్(2) లను స్పిన్నర్ రషీద్ ఖాన్ అవుట్ చేయడంతో గుజరాత్123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. గుజరాత్ లయన్స్ 12 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. తర్వాత బ్యాటింగ్ కు దిగిన జడేజా, ఫాల్కనర్ లు ఆచితూచి ఆడే ప్రయత్నం చేసిన సిరాజ్ మరో సారి దెబ్బ కొట్టాడు. సిరాజ్ వేసిన 16 ఓవర్లో ఫాల్కనర్(8), ప్రదీప్ సంగ్వాన్(0) లను వరుస బంతుల్లో క్లీన్ బౌల్డ్ చేసి గుజరాత్ పతనాన్ని శాసించాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఓక్క బ్యాట్స్ మన్ కుదురుకోలేదు. పోటాపోటిగా సన్ రైజర్స్ బౌలర్లకు వికెట్లు సమర్పించుకున్నారు. ఒక వైపు రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేసినా మిగతా బ్యాట్స్ మెన్ నుంచి సహాకారం అందకపోవడంతో గుజారాత్ 4 బంతుల్లో మిగిలి ఉండాగానే కుప్పకూలింది. ఇక సన్ రైజర్స్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3, భువనేశ్వర్ 2 ,వికెట్లు పడగొట్టగా సిద్దార్థ్ కౌల్ కు ఒక వికెట్ దక్కింది.