సన్ రైజర్స్ 4.. లయన్స్ 0
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఘన విజయాన్ని సాధించింది. సొంతగడ్డపై గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 9 వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ మ్యాచ్ లో సమష్టి పోరాటం చేసిన సన్ రైజర్స్ అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత గుజరాత్ ను కట్టడి చేసిన సన్ రైజర్స్.. ఆపై బ్యాటింగ్లోనూ రాణించి వరుసగా రెండో గెలుపును దక్కించుకుంది. హైదరాబాద్ తో మ్యాచ్ లో విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టాలని భావించిన గుజరాత్ కు మరోసారి నిరాశే ఎదురైంది. గత మ్యాచ్ లో కోల్ కతా చేతిలో 10 వికెట్ల తేడాతో గుజరాత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
గుజరాత్ విసిరిన 136 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ 15.3 ఓవర్లలోనే ఛేదించి తమకు తిరుగులేదని నిరూపించింది. దాంతో గుజరాత్ పై విజయాల రికార్డును హైదరాబాద్ మరింత మెరుగుపరుచుకుంది. ఇది గుజరాత్ పై సన్ రైజర్స్ కు నాల్గో విజయం. గత సీజన్ లో గుజరాత్ పై ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ దే పైచేయి. లీగ్ దశలో గుజరాత్ తో ఆడిన రెండు మ్యాచ్ లతో పాటు, ప్లే ఆఫ్ స్టేజ్లో సైతం సన్ రైజర్స్ నే విజయం వరించింది.
ఈ మ్యాచ్ లో సాధారణ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. శిఖర్ ధావన్(9) తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ, డేవిడ్ వార్నర్(76 నాటౌట్; 45 బంతుల్లో6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రిక్స్(52 నాటౌట్;39 బంతుల్లో 6 ఫోర్లు)లు మిగతా పనిని పూర్తి చేశారు. ఈ జోడి రెండో వికెట్ కు 108 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని సాధించి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. తొలుత వార్నర్ 31 బంతుల్లో అర్ధ శతకం సాధించగా, ఆపై కొద్ది సేపటికి హెన్రిక్స్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ లయన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.గుజరాత్ ఆటగాళ్లలో జాసన్ రాయ్(31), దినేష్ కార్తీక్(30), డ్వేన్ స్మిత్(37)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలం కావడంతో గుజరాత్ భారీ స్కోరు చేయలేకపోయింది. గుజరాత్ టాపార్డర్ ఆటగాళ్లలో బ్రెండన్ మెకల్లమ్(5), సురేష్ రైనా(5), అరోన్ ఫించ్(3)లు ఘోరంగా వైఫల్యం చెందారు.దాంతో నిర్ణీత ఓవర్లలో గుజరాత్ ఏడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
రషీద్ మ్యాజిక్..
బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్ లో రెండు వికెట్లు తీసి విజయంలో తనవంతు పాత్ర పోషించిన సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ మరోసారి తన మ్యాజిక్ ను చూపెట్టాడు. తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ వరుస విరామాల్లో మూడు కీలక కీలక వికెట్లు తీసి రైజర్స్ కు చక్కటి ఆరంభాన్నిచ్చాడు. రషీద్ స్పిన్ మాయాజాలానికి గుజరాత్ కు గట్టి షాక్ తగిలింది. బ్రెండన్ మెకల్లమ్, ఫించ్, రైనాలను అవుట్ చేసి సత్తా చాటాడు. సన్ రైజర్స్ మిగతా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు సాధించగా, నెహ్రాకు వికెట్ దక్కింది.