హషీమ్ ఆమ్లా మళ్లీ బాదేశాడు..
మొహాలి: ఈ ఐపీఎల్ సీజన్ లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా మరో శతకాన్ని నమోదు చేశాడు. ఆదివారం రాత్రి గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ లో ఆమ్లా సెంచరీతో అదుర్స్ అనిపించాడు. 60 బంతుల్లో8 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 104 పరుగులు చేశాడు. తద్వారా ఈ ఐపీఎల్లో రెండో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఆమ్లా శతకం సాధించిన సంగతి తెలిసిందే.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలో ఆచితూచి ఆడింది. తొలి ఓవర్ ఐదో బంతికి గప్టిల్(2)అవుట్ కావడంతో కింగ్స్ కు ముందుగానే ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆమ్లా-షాన్ మార్ష్ ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 125 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కింగ్స్ పంజాబ్ తేరుకుంది. ఈ క్రమంలోనే తొలుత ఆమ్లా హాఫ్ సెంచరీ చేయగా, ఆపై మార్ష్ కూడా అర్ధ శతకం నమోదు చేశాడు. కాగా, మార్ష్(58;43 బంతుల్లో6 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసిన కొద్ది సేపటికి పెవిలియన్ చేరాడు. దాంతో స్కోరు పెంచే బాధ్యతను ఆమ్లాతో కలిసి మ్యాక్స్ వెల్ పంచుకున్నాడు. ఈ జోడి చివరి ఓవర్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మ్యాక్స్ వెల్ చేసిన 20 పరుగుల్లో రెండు సిక్సర్లు ఉండగా, సిక్సర్ తో ఆమ్లా సెంచరీ సాధించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.