ధోని సేన గాడిలో పడేనా? | will pune super giants win over sunrisers hyderabad | Sakshi
Sakshi News home page

ధోని సేన గాడిలో పడేనా?

Published Tue, Apr 26 2016 5:20 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

ధోని సేన గాడిలో పడేనా?

ధోని సేన గాడిలో పడేనా?

హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని పుణే సూపర్ జెయింట్స్ ను వరుస పరాజయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకూ ఐదు మ్యాచ్లాడిన పుణె ఒకదాంట్లో మాత్రమే గెలవడంతో వారి శిబిరంలో ఆందోళన నెలకొంది. ధోని అండ్ గ్యాంగ్ అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ విఫలమవుతూ పరాజయాల భారాన్ని మోస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం రాత్రి గం.8.00లకు  సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మరో పోరుకు పుణే సన్నద్ధమైంది.


ఐపీఎల్-9వ సీజన్ ఆరంభపు మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడించి ఆత్మవిశ్వాసంతో కనిపించిన పుణేను ఆ తరువాత పరాజయాలు వెక్కిరిస్తునే వస్తున్నాయి. ఆ జట్టులో స్టీవ్ స్మిత్, డుప్లెసిస్, రహానే, పెరీరా, ధోనిలతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కాగితాలపై బలంగా కనిపిస్తున్నప్పటికీ మైదానం చేరేసరికి డీలాపడుతోంది. టాప్ ఆర్డర్‌లో ఒకరిద్దరు రాణించడంతో ఫలితాల్లో భారీమూల్యమే చెల్లించుకుంటోంది.  ఐదు మ్యాచ్‌లైనా... స్టీవ్ స్మిత్ ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ధోనీ మెరుపులు అంతంతే. ఇక పేస్ బౌలింగ్‌లో మీడియం పేసర్ రజత్ భాటియా మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. స్పిన్నర్లు కూడా ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రభావమే చూపలేదు. రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్‌లు దీనిపై దృష్టి పెట్టాలి.
 
 
మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల బాట పట్టడం ఆ జట్టుకు సానుకూలాంశం. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైన హైదరాబాద్ .. ఆ తరువాత హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్ లో ఉంది. ఫామ్ కోసం తంటాలు పడిన ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఇప్పుడు టచ్‌లోకి వచ్చాడు. మరోవైపు కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ వార్నర్ మెరుపు ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. బౌలింగ్ విభాగంలోనూ మెరుగైన స్థితిలో ఉంది. దీంతో కీలక ఆటగాళ్లు యువరాజ్, ఆశిష్ నెహ్రా గాయాల బారిన పడినా... జట్టు విజయాలకు ఢోకా లేకుండా పోయింది. యువీ కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. నెహ్రా ఫిట్‌నెస్‌ను బట్టి మ్యాచ్‌కు ముందు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు ఎలాగైనా విజయం సాధించి పరాజయాలకు చెక్ పెట్టాలని ధోని అండ్ గ్యాంగ్ యెచిస్తుండగా, మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని వార్నర్ సేన భావిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య రసవత్తరపోరు ఖాయంగా కనిపిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement