మిగతా జట్టంతా కుదురుకున్నా... ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు రెండు అంశాల్లో అనుమానాలున్నాయి. ఒకటి... నాలుగో స్థానంలో రాహుల్‌ను దింపుదామా? లేదా? రెండు... దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఎలా ఆడతాడోనని? అయితే, వీటికి బంగ్లాదేశ్‌తో సన్నాహక మ్యాచ్ రూపంలో, టోర్నీ ప్రారంభానికి ముందే సమాధానం దొరికింది.
ఓపెనర్లు విఫలమైనా, కెప్టెన్ కోహ్లి పెద్దగా పరుగులు చేయలేకున్నా... రాహుల్, ధోని నిలిచారు. తడబడిన ఇన్నింగ్స్‌ను పునర్ నిర్మిస్తూ శతకాలతో చెలరేగారు. సరైన సమయంలో ఊపులోకి వచ్చారు. మున్ముందు... ఇంగ్లండ్ గడ్డపై ఎంత స్కోరైతే గెలుపు సురక్షితమో జట్టుకు అంత స్కోరు అందించారు. బౌలింగ్‌లో బుమ్రా ధాటికి, కుల్దీప్, చహల్ స్పిన్‌కు బంగ్లా బెంబేలెత్తింది.
కార్డిఫ్: తొలి సన్నాహక మ్యాచ్‌లో ఆకట్టుకోలేపోయిన భారత్... రెండో దాంట్లో దమ్ము చూపింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ (99 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెటరన్ ధోని (78 బంతుల్లో 113; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకాలతో మెరిశారు. ఫలితంగా బంగ్లాదేశ్‌తో మంగళవారం ఇక్కడ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా 95 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (46 బంతుల్లో 47, 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. రూబెల్ హొస్సేన్ (2/62), షకీబ్ (2/58) రెండేసి వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా 49.3 ఓవర్లలో 264 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. బుమ్రా (2/25) పదునైన బంతులతో ప్రభావం చూపాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/47), చహల్ (3/55) మణికట్టు స్పిన్‌తో మాయ చేశారు. మంగళవారంతో అన్ని జట్ల సన్నాహక మ్యాచ్‌లు ముగిశాయి. గురువారం ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌తో ప్రధాన టోర్నమెంట్ మొదలవుతుంది.
భారత్ కుదురుకుంది...
గత మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్షగా నిలిచిన ఇక్కడి వాతావరణం ఈ సారీ కొంత ఇబ్బంది పెట్టింది. మేఘావృత పరిస్థితుల్లో ఓపెనర్లు ధావన్ (1), రోహిత్ శర్మ (19) నిలదొక్కుకోవడానికే శ్రమించారు. తడబడుతూనే 9 బంతులాడిన ధావన్... ముస్తఫిజుర్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. 42 బంతులు ఎదుర్కొన్న రోహిత్ ఒక్కటే బౌండరీ కొట్టగలిగాడు. సులువుగా పరుగులు సాధిస్తూ కోహ్లి మాత్రం ఎప్పటిలానే స్వేచ్ఛగా ఆడాడు. అయితే, సైఫుద్దీన్ చక్కటి బంతికి బౌల్డయ్యాడు. ఓవైపు కుదురుకున్న రాహుల్ పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తుంటే విజయ్ శంకర్ (2) తేలిగ్గా వికెట్ ఇచ్చేశాడు.
అప్పటికి స్కోరు 22 ఓవర్లలో 102/4. రన్‌రేట్ ఐదు పరుగుల లోపే. ఈ దశలో రాహుల్, ధోని జోడీ నిలిచింది. స్పిన్నర్ అబు జయేద్‌ను లక్ష్యంగా చేసుకున్న రాహుల్... అతడి బౌలింగ్‌లో వరుసగా బౌండరీలు బాదాడు. మధ్యలో షకీబ్ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. 45 బంతుల్లో అతడి అర్ధ సెంచరీ పూర్తయింది. మెహిదీ హసన్, షకీబ్ కాసేపు నిలువరించినా... షకీబ్ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌తో రాహుల్ జూలు విదిల్చాడు. మెహిదీ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో ధోని కూడా జోరు పెంచాడు. మొసద్దిక్ బౌలింగ్‌లో ఫోర్‌తో అర్ధ సెంచరీ (40 బంతుల్లో) అందుకున్నాడు.
31వ ఓవర్ నుంచి పరుగులు అలవోకగా రావడంతో రన్ రేట్ 6 దాటింది. మరో ఎండ్‌లో సమయోచితంగా ఆడిన రాహుల్ 94 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. కాసేపటికే షబ్బీర్ అతడిని ఔట్ చేశాడు. ఇక్కడి నుంచి హార్డిక్ పాండ్యా (11 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) తోడుగా ధోని జట్టు స్కోరును 300 దాటించాడు. అబు జయేద్ ఓవర్లో భారీ సిక్స్‌తో అతడు సెంచరీ (73 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. చివర్లో జడేజా (11 నాటౌట్), దినేశ్ కార్తీక్ (7 నాటౌట్) కొన్ని పరుగులు జోడించారు. బంగ్లా తరఫున 9 మంది బౌలింగ్ చేయడం గమనార్హం.
శుభసూచకం...
ఓపెనర్ల ఆట మరోసారి ఆందోళనలో పడేసినా... ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించిన రాహుల్, ధోని కారణంగా ఈ మ్యాచ్‌తో భారత్‌కు పెద్ద ఉపశమనం లభించిందనే చెప్పొచ్చు. వన్డేలకు సరిపడే ఆటతో వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరు ఆకట్టుకుంది. తొలుత బంగ్లా స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగిన ఈ ద్వయం నిలదొక్కుకున్నాక పేసర్లనూ వదల్లేదు. పేసర్లు ముస్తఫిజుర్ బౌలింగ్‌లో డీప్ స్వే్కర్ లెగ్‌లోకి కొట్టిన రెండు సిక్స్‌లు రాహుల్ నాణ్యమైన ఆటను చూపగా... రూబెల్ హొస్సేన్ ఓవర్లో ఓవర్ లాంగాన్ దిశగా, అబు జయేద్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్‌లోకి బాదిన సిక్స్‌లు మునుపటి ధోనిని చూపాయి. ఈ ద్వయం వీలుచిక్కినప్పుడల్లా స్పిన్నర్లను చితక్కొట్టింది. వీరు ఐదో వికెట్‌కు 128 బంతుల్లోనే 164 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు పెరిగింది.
బంగ్లా అందుకోలేకపోయింది
భారీ స్కోరు ఛేదనలో బంగ్లా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు లిటన్ దాస్(73), సౌమ్య సర్కార్ (25) పెద్దగా మెరుపుల్లేకుండానే నడిపించారు. భారత పేసర్లు బుమ్రా, షమీలను సమర్థంగా ఎదుర్కొంటూ 49 పరుగులు జోడించారు. బుమ్రా వేసిన పదో ఓవర్లో కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి సౌమ్య ఔటయ్యాడు. యార్కర్ లెంగ్త్‌లో వచ్చిన మరుసటి బంతి షకీబ్ (0) స్టంప్స్‌ను చెదరగొట్టింది. లిటన్, ముష్ఫికర్ (90) బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నారు. 130 బంతుల్లో 120 పరుగులు జత చేశారు. చహల్ వరుస బంతుల్లో లిటన్, మిథున్ (0)ను పెవిలియన్ చేర్చాడు. తొలుత మొహ్మదుల్లా (9)ను బౌల్డ్ చేసిన కుల్దీప్... ముష్ఫికర్, హొస్సేన్ (0)ల పనిపట్టాడు. దీంతో బంగ్లాదేశ్ లక్ష్యానికి చాలా దూరంలోనే ఆగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment